2394*వ రోజు....           29-Mar-2022

 ఒక్క వాడకానికే పరిమితమైన (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వస్తువుల నష్టం చాలా పెద్దది.

గ్రామ భద్రతా దళం వారి 2394* వ నాటి కృషి!

ఈ వేకువ సైతం మొత్తం 8 మంది, (+ మధ్యలో ఇద్దరు సందర్శకులు) బందరు మార్గంలో, రాయపాటి వంశస్థుల గృహాల దగ్గర, రిజిస్ట్రారు కార్యాలయం ఎదుట, భారత లక్ష్మి వడ్లమర వీధిలో, మరొకటి రెండు చోట్ల కొంత సుందరీకరణ, కొన్ని వీధి భద్రతా చర్యలు నిర్వహించారు. నిన్న - ఇవ్వాళ తామను కొన్నది సాధించారు!

            తాము నివసించే ఊరిని ఎంతగా సొంతం చేసుకోకపోతే, (అపార్ధం చేసుకోవద్దు దీనర్ధం వరస బెట్టి కనపడ్డ ప్రతి జాగాను ఆక్రమించుకోవడం కానే కాదు-) గ్రామస్తుల స్వస్త సౌకర్యాల పట్ల ఎంత అభినివేశం లేకుంటే - ఈ ఏడెనిమిది మంది ముఖ్యంగా అందులో ఐదుగురు - ఈ శుభోదయాన ఈ కరకు - మురికి - బరువు పనులకూ పూనుకొంటారు? మనసా - వాచా - కర్మణా ఇన్ని వేల రోజులుగా తమ ఊరికి లక్షల పనిగంటల శ్రమను అంకితం చేస్తారు?

            వీళ్లలో ఒక ధవళ ధౌత వస్త్రధారి - తూములూరి - మట్టి పనితో ఒళ్ళూ- బట్టలూ దుమ్ము కొట్టుకొని,

            ఒక కాంపౌండరుడు - బృందావనుడు - నేను చూసిన 10 - 12 నిముషాలు నడుమెత్తక పార -  పలుగు పనిచేసి,

            ఒక విజయుడు, ఒక శ్రీనివాసుడు చెమటతో బట్టలు తడిసి, నడుం నొప్పిని లెక్కచేయని ఒక మాలెంపాటి ఎత్తైన ట్రక్కు మీద నిలిచి మట్టిని దిగుమతి చేసి,

            ఇక రెండో మాలెంపాటి (84 నాటౌట్), మరో 75 ఏళ్ల పెద్ద శాస్త్రి - శారీరక - ఆరోగ్య సమస్యల్లో పోటీపడే వీళ్లు చేయదగిన పనులేనా ట్రక్కు తలుపులు పైకి లేపడం - డిప్పలు ఒంగి ఎత్తడం వగైరాలు?

            ఈ ఆరేడుగురు ఇంటి - ఒంటి బాధ్యతల్ని సమస్యల్ని ప్రక్కకు నెట్టి ఊరి కోసం ఏకాస్తయినా పాటుబడగలమా - అనే ధృఢ సంకల్పంతో మాత్రమే ఇన్ని పనులు చేయగలిగారనుకొంటా!

            డాక్టరు గోపాలకృష్ణయ్యగారి గ్రామ మెరుగుదల త్రివిధ నినాదాలతో తమ సంతృప్తికర శ్రమదానాన్ని 6.50 కి ముగించారు!

            రేపటి సామ్యవాద (కమ్యూనిస్టు) వీధి - చివర బైపాస్ మార్గ శ్రమదానం కోసం మనం కలుసుకోదగిన చోటు దాసరి రామమోహనరావు గారి ఇంటి ప్రక్కనే!

    

      సమర్పిస్తున్నాం ప్రణామం 93

ఎవ్వరెవరి మేధస్సుల కెంత పదును పెట్టితిరో

ఆశయాన్ని క్షేత్రంలో ఆచరించి చూపితిరో

స్వార్థానికి జెల్ల కొట్టి పరార్థమునకు పూనితిరో

అట్టి గ్రామ స్వచ్ఛ వీరులందరికీ ప్రణామం!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   29.03.2022.