2395*వ రోజు.......           30-Mar-2022

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?

 

2395* వ నాటి శ్రమ వితరణ సందేశం!

 
30.03.2022 వ నాటిది బుధవారం. ఈ 2395 రోజుల్లో ఇది ఎన్నో బుధవారమో, కమ్యూనిస్టు వీధి- బైపాస్ మార్గాల కూడలి దగ్గర నేటి 32 మంది గ్రామ శుభ్ర- సౌందర్య భవితవ్య నిర్ణేతల ప్రయత్నమున్నదో – ఎన్ని వేల గంటల్లో తీసుకోగలిగిన వాళ్లకు పంచిన సామాజిక స్ఫూర్తి ఏ పాటిదో లెక్కలు కట్టే షరాబు లేరి? కార్యకర్తల శ్రమ – స్వేద- సమయ త్యాగాల కొలబద్దలుంటాయా?
 
నేటి వేకువ 4.17 కు 16 మంది కార్యకర్తల కలయిక! తదాదిగా 6.15 దాక- సుమారు 2 గంటల పాటు – అక్కడ దుమ్మే లేచి వాళ్ళను క్రమ్మిందో-డ్రైనులో బురద వాళ్ళ బట్టల మీద ఎన్ని డిజైన్లు వేసిందో – క్రింద చతికిలబడి జరుగుతూ- గడ్డి పీకుతూ – పిచ్చి, ముళ్ల మొక్కల్ని తొలగిస్తూ –ఎంతగా ఒంటికీ – బట్టలకూ దుమ్ము కొట్టుకొందో – నేనైతే గమనిస్తూనే ఉన్నాను గాని- ఈ శ్రామికులు పట్టించుకోలేదు! ఒక ఊపులో కాలుష్యం మీద యుద్ధం చేసే సైనికులకు బహుశా ఇవన్నీ చాలా చిన్న విషయాలు!
 
ఈ వేకువ శుభ్ర-సుందరీకృత మార్గం విశాలమయిందే గాని, కేవలం 150 గజాలకే పరిమితం! ఐతే మాత్రం ఏం తక్కువ తిన్నది? ప్రక్క డ్రైను తో కలిపి – ఈ కాస్త జాగాలోనే పెద్ద ట్రక్కు పట్టనంత కశ్మలాలు నిండలేదా? ఒక ధ్యాన మండలి ప్రముఖుడు పై కెక్కి వాటిని సర్దలేదా?
 
ఇది చాలదన్నట్లు ముగ్గురు కత్తీ - గొర్రూ- చీపుర్లే సుకొని ప్రక్క బజారును కూడ మరో 50 గజాలు ఊడ్చి, నాకు చెందిన ఖాళీ జాగాను మరింత శుభ్ర పరచి, సుందరీకరించారు కదా!
 
ఆసలీ పురాతన- చారిత్రక గ్రామ ప్రారబ్ద మేమంటే – దాని నొసట ఇలా వ్రాసి ఉందట – పంచాంగంలో లాగా: “ స్వచ్చోద్యమ శ్రమదాన నామ 7-8 సంవత్సరాల్లో – ఏ రెండు- మూడు- నాలుగు వేల రోజులో- ఏ ఐదారు లక్షల పని గంటలో ప్రతిరోజూ ఏదో ఒక వీధిలోనో – మురుగు కాల్వలోనో –రహదార్ల మీదనో –శ్మశానాల్లోనో 30-40-50 మంది అదేదో వాళ్ల పవిత్ర కర్తవ్యం లాగా – ఊడ్చి, గుంటలు పూడ్చి, చెట్లు పెంచి, నిన్ను కంటికి రెప్పలా చూసుకొందురు గాక.....” అని ! మరి – విధి లిఖితం- తప్పదు గదా!
 
గ్రామస్తులం – మనం కొందరం- “ పాపం! ఈ డాక్టర్లు-గృహిణులు – వర్షీయసులు (వృద్ధులు)- ఊరి కోసం ఇంత శ్రమిస్తున్నారా”! అని ఆశ్చర్యపడి, అభినందించబోతాం కాని, ఈ ఊరి సమగ్ర మెరుగుదల కంకణ ధారులేమో- ఏ రోజూకారోజు తాము మెరుగులు దిద్దిన వీధిని చూసుకొని పొందే ఆనందం ఎంతటిదో తెలుసా?
 
100% అలాంటిది కాకున్నా-6.40 సమీక్షా సమయంలో ఒక 91 ఏళ్ల దానశీలి – దాసరి రామమోహన రావు + దివంగత స్వచ్చ చల్లపల్లి మామ్మ ఈనాడు తమ ఊరి మేలు కోసం వెచ్చించిన 3,00,000/- తో గలిపి వారి పూర్తి వితరణ అక్షరాల 19 లక్షలు*! ఇది వారి మరో విధమైన – హద్దులు దాటిన సంతృప్తి!
 
ఆదివారం నాటి వైద్య శిబిరంలో బహుళ ప్రయోజక 160 సంచుల్ని అమ్మగా వచ్చిన 2,400/- ను చెక్కు రూపంలో మేనేజింగ్ ట్రస్టీ గారికి, పప్పుండల్ని కార్యకర్తలకు డా. గోపాలకృష్ణయ్య గారు సమర్పించారు.
 
పాట పాడవలసిన నందేటి శ్రీనివాసుడు – ఇంచు మించు పాటలాగే- ఖంగున ముమ్మారు ప్రకటించిన గ్రామ స్వచ్చ- పరిశుభ్ర – సౌందర్య సంకల్ప నినాదాలతో నేటి శ్రమ వేడుక ముగిసింది.
 
రేపటి మన శ్రమదాన కర్తవ్యానికై నేటి సామ్యవాద వీధి చివరే – బైపాస్ మార్గంలోనే కలుసుకొందాం!
 
సమర్పిసున్నాం ప్రణామం – 94
విశ్రమించని-వినుతి కెక్కిన- వీర విక్రమ స్వచ్చ సైన్యం
గ్రామ మందలి ముఖ్య వీధుల కశ్మలం తొలగించుచుంటే-
అక్కడక్కడ కొన్ని వీధులు హరిత –సుమ-సుందరములైతే-
చల్లపల్లి స్వచ్చ-సుందర – సైనికుల కిదె మా ప్రణామం !
 
- నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,
‘మనకోసం మనం’ ట్రస్టు బాధ్యుడు
30.03.2022.