2396* వ రోజు ....           31-Mar-2022

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు ఎందుకు వాడాలి ?

2396* వ వేకువ స్వచ్ఛ కార్యకర్తల వీధి సేవా ఘంటికలు.


మార్చి మాసాంతం (31-3-22 - గురువారం) వేకువ 4.17 కే 16 మందికి “అయం ముహూర్తోస్సుముహూర్తః!

మరో 11 మందికి కాస్త అటూ ఇటూగా! ఇక అప్పటి నుండి గంటా 50 నిముషాల పైగా విజయ్ నగర్ కాలనీ దగ్గర కశ్మలాల మీద స్వచ్ఛ కార్యకర్తల “బాదుడే..... బాదుడు!” మురుగ్గుంటల్లోని  చెత్త – ప్లాస్టిక్– ఎండుటాకుల మీదకి ఒంటి కాలి మీద “దూకుడే.... దూకుడు!” ఆ మూల 8 - 9 సెంట్ల ఖాళీ జాగాలో ని పిచ్చి, ముళ్ల చెట్ల మీద కత్తులు “దూసుడే....దూసుడు!”


మరి ఈ 30 40 - 50 మంది గ్రామ కర్తవ్య పరాయణులు కాక వీధి పరిశుభ్ర సౌందర్య శిల్పులెవరున్నారు కనుక? 30 వేల మంది గౌరవ పౌరుల్లో ఈ వేళ క్రొత్తగా పట్టుమని ముగ్గురైనా వస్తే గదా! కనీసం - ఈ వార్డు బాధ్యులు, గ్రామ వాలంటీర్లకైనా ఇక్కడి రహదారి ఉద్యానాల పట్ల, బైపాస్ అందాల పట్ల కనికరం కలిగిందా?


27/30 మంది శ్రమదాతలే ఎన్నాళ్లయినా తమ వార్డు - వీధి స్వస్త – సౌందర్యాలకు బాధ్యత వహిస్తూనే ఉండాలి కాబోలు! ఇక శాశ్వతంగా ఎప్పటికీ ఈ స్వచ్చోద్యమ రధం స్వచ్చ కార్యకర్తల కాళ్లతోనే ముందుకు నడవాలన్నమాట! ఈ సామాజిక స్ఫూర్తిలో - ఇంత శుభోదయ శ్రమదాన సందడిలో – వార్డు నివాసులు పాలు పంచుకోనట్లేనా? 

ఇక నేటి ఉషఃకాలాన ఈ నిష్కామ కర్ముల గ్రామ బాధ్యతా నిర్వహణలేమంటే :

 

- బైపాస్ రోడ్డుకు ఇరువైపులా - ఇటు అశోక్ నగర్, అటు విజయ్ నగర్ మూడులైన్ల దాక చేసిన కత్తుల, దంతెల, చీపుళ్ల, గోకుడు పారల కృషితో ఈ 100 గజాల వీధికి కళాకాంతులు వచ్చాయి.

 

- విజయ నగర్ వైపున్న మురుగు కాల్వలో ఆకులు, పుల్లలు, ప్లాస్టిక్ సీసాలు, మద్యం సీసాలు లాగడంతో ఇక ఇప్పుడా కాలువ మురుగు మర్యాదగా ముందుకు నడుస్తున్నది!

 

- విజయనగర్ 1 వ వీధి మలుపులోని ఖాళీ నివేశనంలోని అసహ్యకరమైన సీసాలు, కొబ్బరిమట్టలు, గడ్డి,పిచ్చి చెట్ల గుబుర్లు అదృశ్యమై - ట్రక్కులో కెక్కి  చెత్త కేంద్రానికి చేరగా – ఆ స్తలం ఇప్పుడు చూడబుద్దవుతున్నది! (ఈ ఏడెనిమిది సెంట్ల జాగాను కార్యకర్తలిప్పటికే ఏడెనిమిది మార్లు బాగు చేశారు! అంటే – అటు కాలుష్యకారులు, ఇటు పరిశుభ్ర – సౌందర్యకారులూ - ఎవ్వరూ తగ్గేదేలే!)

 

- వాట్సప్ మాధ్యమ చిత్రాల్లో ఒక చోట గంటన్నర శ్రమతో  - చెమటతో అరుగు మీద విశ్రాంతి పొందుతున్న ఇద్దర్నీ, మరో వైపు మెట్ల మీద చతికిలబడిన వృద్ధ బాలుడినీ చూడవచ్చు!

 

కాల క్షేప కబుర్ల - కాఫీ సరదా సమయంలో ఊరి స్వచ్చ – శుభ్ర - సౌందర్య సంకల్ప నినాదాలను ప్రకటించిన కార్యకర్త తాతినేని వేంకటరమణ! “స్వచ్ఛ కార్యకర్తల వేల రోజుల - లక్షల పని గంటల శ్రమకు ఖరీదు కట్టే షరాబులెవరని” (బహుశా గ్రామస్తుల్ని) ప్రశ్నించినది చల్లపల్లి స్వచ్చోద్యమ సారధి! ఇందుకు నా వ్యక్తిగత సమాధానం: “మనసున్న మనుషులు నిండు హృదయాలతో మాత్రమే ఆ స్ఫూర్తిని – ఆ త్యాగాన్ని కొలవగలరు” అని!

 

-1-2-3 తేదీల్లో జరిగే జానపద – డప్పు కళా ప్రదర్శన దృష్ట్యా - రేపటి వేకువ మనం కలిసి శ్రమించదగిన చోటు NTR పార్కు దగ్గరనే!

 

      సమర్పిసున్నాం ప్రణామం 95

అనగ ననగ రాగ సుధలు అతిశయించు పద్ధతిగా –

తినగ తినగ వేముకూడ తియ్యగుండు సామెతగా –

కాల పరీక్షకు నిలిచిన గ్రామ స్వచ్ఛ ఉద్యమాన్ని –

రాటుదేల్చి నడిపే  నిర్వాహకులకు ప్రణామం!

 

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   31.03.2022.