1904 * వ రోజు....           28-Jan-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులను వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1904* వ నాటి శ్రమానందం.

వరుసగా 3 వ రోజు కూడ ప్రభుత్వ రవాణా సంస్థ ప్రాంగణంలోనే స్వచ్చ-శుభ్రత అవసరమనిపించి, 4.04-6.16 నిముషాల దాక నిర్వహించిన శ్రమదానంలో 27 మంది పాల్గొన్నారు. సుమారు రెండెకరాలకు పై బడిన- నిత్యం వేలాది మంది ప్రయాణించే, వేచియుండే ఈ ఆవరణను 30-40 మంది కార్యకర్తలు గత మూడు రోజులుగా-సుమారు 180 పని గంటలు శ్రమిస్తేనే ఈ పాటి స్వచ్చ-సుందరతలు ఏర్పడినవి!

 

ఈ జనవరి మాసపు వేకువ చలిలో-మంచులో-చాలీ చాలని వెలుతురులో-క్రీ నీడల్లో-అక్కడక్కడ ఎగుడుదిగుడు జాగాలలో-అందరికీ చెంది, ఆహ్లాదకరంగా ఉండదగిన ఈ ఆవరణ పరిశుభ్రత కై శక్తి వంచన లేకుండ శ్రమించిన కార్యకర్తల మహా కృషికి ఖరీదు కట్టలేను గాని, అభివందనలు తెలుపగలను. ఈ రెండు గంటల శ్రమదాన వేడుకలో వీరు:

 

- 350 పైగా ఖాళీ మద్యం సీసాలను ఏరి పోగులు పెట్టారు.

 

- అందం మెరుగుదల కోసం కొన్ని చెట్ల కొమ్మల్ని కత్తిరించారు. కందకంలా ఉన్న పల్లంలో డిప్పల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్ధాలను ఊడ్చి, ఏరి గొర్రులతో లాగి, గుట్టలు చేశారు.

 

- ఆకందకానికి దక్షిణాన గట్టు మీది కంచె కోరడు చెట్ల క్రింది పిచ్చి-ముళ్ల మొక్కల్ని నరికి, తీగల్ని, త్రెంచి, తేనెటీగల ఉనికితో కొద్ది భాగం తప్ప బండ్రేవు కోడు కాల్వ ఉత్తర దిశను శుభ్రపరిచారు.

 

- ముగ్గురు మహిళలు చీపుళ్లతో కనిపించిన వ్యర్ధాలను ఊడ్చి మరికొంత స్వచ్చత సమకూర్చారు.

 

- ఇద్దరు సుందరీకరణ సభ్యులు మాత్రం బస్ స్టాండు బైటి-ఉత్తర రహదారి భాగాన్ని వంచిన నడుములెత్తకుండా ఊడ్చి మెరుగులు దిద్దారు.

 

ఏడెనిమిది నిముషాల టీ, కాఫీ ఆస్వాదనల, సరదా కబుర్ల తరువాత, జరిగిన సమీక్షా సమావేశంలో గత మూడు రోజుల శ్రమ ఫలితంగా అందంగా కనిపిస్తున్న ఈ ప్రాంగణాన్ని చూసి మురిసిపోయి, కాలుష్యం మీద కొర్రపాటి వీరసింహ రణ సంకల్ప నినాదాలు ముమ్మారు ప్రతిధ్వనించి, 6.45 నిముషాలకు నేటి మన బాధ్యతలు ముగిసినవి!

 

మరికొన్ని శేష బాధ్యతల కోసం - ఈనాడు పోగుపడిన తుక్కును చెత్త కేంద్రానికి చేర్చడం వంటి వాటి నిర్వహణకై రేపు కూడ RTC బస్ ప్రాంగణం దగ్గరనే కలుసుకొందాం!

 

       మరల మరల చెప్పగలను.

నీ కోసం నీ శ్రమ లో నిబిడీకృత స్వార్ధమనుచు...

మనకోసం మన శ్రమ తో మనుగడ సాఫల్యమనుచు...

తమ శ్రమదానం ఉమ్మడి క్షేమం కొరకే ననుచూ...

స్వచ్చోద్యమ చల్లపల్లి చాటి చెప్పె చూడుమనుచు...

 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

మంగళవారం – 28/01/2020

చల్లపల్లి.