2397* వ రోజు .......           01-Apr-2022

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు ఎందుకు వాడాలి?

31 మంది శ్రమదాన ధారావాహిక - @2397*

శ్రమదాన వేదిక మారింది తప్ప - నేటిది (శుక్రవారం - 1.4.22) కూడ అదే సమయం వేకువ - 4.19! NTR పేరిట నెలకొల్పి, ఉదాహరణ ప్రాయంగా నిర్వహింపబడుతున్న పార్కు! గతంలో వాయిదా పడి, నేటి సాయంత్రం నుండి మొదలయ్యే డప్పు కళా ప్రదర్శన సందర్భం! ఉండడానికి అందంగాను, సౌకర్యంగాను సదరు పార్కు ఉన్నా - స్వచ్ఛ సైనికులకు ఆ అందం, ఆ శుభ్రత చాల్లేదట!

ఇంకేముంది - ఈ 30 మందీ 2 గంటల పాటు చేసిన శ్రమదానంతో - ఆ పార్కు మొత్తం కాదు గాని, ఏ ఐదో వంతో (సుమారు 40 సెంట్ల చదరం) - ముఖ్యంగా కళావేదిక, పిల్లల ఆటల వేదికల చుట్టు ప్రక్కల ఇప్పుడెంత ముచ్చటగా ఉన్నదో చూడండి! అలాగే - తమ కృషితో బాగా మెరుగుపడిన పార్కు భాగంలో నిలిచి, సంతృప్తిగా చూసుకొంటున్న కార్యకర్తల సామూహిక ఛాయా చిత్రాన్నొకమారు గమనించండి!

వాళ్ల ముఖాల్లోని సమంజసమైన ఆనందం చల్లపల్లి స్వచ్చోద్యమ విజయానికి చిహ్నం! ఆ పార్కులోని మోకాలి ఎత్తు గడ్డి దుబ్బులు తొలగి, కొన్ని ఎగుడు దిగుళ్లు చదునై, ఎక్కడెక్కడి అపరిశుభ్రతలు మటుమాయమై, ఎండుటాకులు చీపుళ్లకు బలై ప్రోగులు బడి, పుల్లాపుడకలుంటే డిప్పల ద్వారా బైటకు చేరి ఈ సాయంత్రం 5.00 కళా ప్రదర్శనకు పార్కు అందంగా ముస్తాబయిందంటే - అది ఒక ఆదర్శ - అనుసరణీయ - సామూహిక శ్రమ శక్తి ఫలితం!

ఇందుకు గాను - కొందరు గృహిణులు, లబ్ద ప్రతిష్టులైన ముగ్గురు డాక్టర్లు, ఒక లాయరు, ప్రస్తుత మరియు విశ్రాంత ఉద్యోగులు, ఎన్ని చెమట చుక్కలు కురిపించారో నేనొక ప్రత్యక్ష సాక్షిని!

ఆ పార్కు - శుభ్ర - సౌందర్యాలకీ, ఈ 30 మంది 3 - 4 కిలోమీటర్లు వేకువనే వచ్చి శ్రమించడానికీ సంబంధమేమిటో ఆలోచించవలసింది మా గ్రామంలోని పాతిక ముప్పైవేల మంది పౌరులే! పౌర హక్కులకీ, పౌర బాధ్యతలకీ - మాటల్లో ఆదర్మానికీ, చేతల్లో వాస్తవానికీ ఉండే లింకు ఏమిటో కూడ ఇక్కడ తెలుస్తుంది!

పరుల కోసం పాటుబడని - నరుని జన్మం దేనికనీ

మూగ నేలకు నీరందించని - వాగు పరుగులు దేనికనీ.....

అని సి. నారాయణరెడ్డి ఒక గజల్ లో ప్రశ్నించినట్లుగా...... 

ఈ 30 మంది చేసిన 60 గంటల శ్రమదానంతో పార్కుకు ఏ క్రొత్త కళ వచ్చిందో - అక్కడి నిత్య పాదచారులకు ఏ మేరకు ఆహ్లాదం కలుగుతుందో - ఆత్మ సంతృప్తి తప్ప ఇతర ప్రతిఫలమాసించని స్వచ్ఛ కార్యకర్తల తాత్త్వికబలం ఎట్టిదో ఆలోచించ గల ఎవరికైనా తేలికగా అర్ధమౌతుంది!

6:45 కు ఈ విశిష్ట ఉద్యమ సారధి కార్యకర్తల కఠిన కాయకష్టం పట్ల ఆశ్చర్యం ప్రకటించే ముందు - అడపా గురవయ్య నిష్టగా ముమ్మార్లు, ప్రకటించిన గ్రామ స్వచ్ఛ - పరిశుభ్ర - సౌందర్య సాధనా కాంక్ష, శ్రమదానోద్యమ ప్రశంస ప్రశంసార్హములే!

    చల్లపల్లి స్వచ్చోద్యమం పట్ల అంతులేని ఆదరాభిమానాలు గల ఉదయ శంకర శాస్త్రి గారి నెలవారీ చందా 5,000/- మేనేజింగ్ ట్రస్టీ గారికి అందినది.

రేపటి ఉగాది  పర్వదిన ఉషోదయ వేళా విశేష శ్రమదానం కోసం మనం కలిసి ముందడుగేయవలసిన చోటు NTR పార్కే!

 

      సమర్పిసున్నాం ప్రణామం - 96

ఈ స్వచ్ఛత - ఈ శుభ్రత - ఈ భద్రత - ఈ ధన్యత -

ఈ నవ్వత ఈ భవ్యతలెవ్వరి కష్టార్జితమో,

ఈ స్ఫూర్తికి - ఈ దీప్తికి - ఈ కీర్తికి కారణమెవరో

ఆ స్వచ్చోద్యమ కారులకందరికీ ప్రణామాలు !

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   01.04.2022.