2399*వ రోజు....           03-Apr-2022

 ఒక్కసారికి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు ?

 

స్వచ్చ సుందర ధారావాహికలో ఆదివారం - @2399*వ ఎపిసోడ్.

 

03.04.2022 వ వేకువ కార్యకర్తల శ్రమదాన సమయం 4.20 నుండి 6.00 దాక!

 

100 నిముషాల కాలం-24 మంది జమిలి కృషి- ఇంత పెద్ద ఊరి కున్న ఒకే ఒక ఆహ్లాదకర NTR పార్కులో!

 

సామాజిక చరిత్ర విశ్లేషకులు ఇందరి మూకుమ్మడి శ్రమ సందేశాన్ని ఏమని తీర్పు చెపుతారో గాని, ఒక సినీ కవి మాత్రం:

         

           “పది మందిలో పాట పాడినా, అది అంకిత మెవరో ఒకరికే

           విరి తోటలో పూవులెన్ని పూచినా, గుడికి చేరేదీ నూటికి ఒకటే....

అని వ్రాసిన సందర్భం వేరు, అదేదో నాయికా నాయకుల నడుమ ఒక కృత్రిమ సన్నివేశం!

         

     దానికి భిన్నంగా సగటున ప్రతి వేకువ 30-40 మంది స్వచ్చ కార్యకర్తలు 2400 దినాలుగా అందరి ఉమ్మడి లక్ష్యం తమ గ్రామ శుభ్ర-సౌందర్యాలుగా-పాతిక ముప్ఫై వేల మంది గ్రామ సహోదరుల ఆహ్లాద, స్వస్తతల సాధనగా-ఒకానొక శ్రమ జీవన వేదంగా- నూతన సంస్కృతీ ప్రవర్తకంగా నడుస్తున్న ఉద్యమం వేరు!

 

          మానవ శ్రమ శక్తి వనరులు, కష్టించే తత్త్వం పుష్కలంగా ఉన్న మన దేశంలో కూడ మెదడున్న సృజనాత్మక శ్రమ శక్తి ని మూలన పడేసి, యాంత్రిక శక్తినే  వాడుకోవడం చూస్తున్నాం. ఈ స్వచ్చంద శ్రమ దాతలు మాత్రం చాదస్తుల్లాగా యాంత్రిక శక్తికి బదులుగా ఒళ్లు హూనమయ్యేట్లుగా పార, పలుగు, చీపురు, గొడ్డలి, గోకుడు పని ముట్లతోనే చెమటలు క్రక్కుతూ పని చేస్తారు స్వార్థ పరంగా కాదు, గ్రామ సమాజ పరంగానే.

 

          ఐతే వీళ్ళంతా కేవలం చాదస్తులో లేక అభ్యుదయకర నవీన సంస్కృతీ ప్రారంభకులో కాలమే-భవిష్యత్ సమాజమే నిర్ణయించాలి! దేశ వ్యాప్త గుర్తింపు కోసం తాపత్రయమనో, మీడియాలో ప్రచారపు పిచ్చి అనో, వేల దినాల- లక్షలాది పని గంటల వ్యసనమనో ఇప్పటికిప్పుడు తేల్చేయడానికి మనమెవ్వరం?

          ఇప్పటికి మాత్రం ఈ చల్లపల్లి స్వచ్చోద్యమం దేశంలో మరెక్కడా చోటు చేసుకోని, 30/40 గ్రామాల్లో కాస్త ముందు చూపున్న వారు అనుసరిస్తున్న- అనుకరిస్తున్న ఒకానొక స్వచ్చంద సాముహిక శ్రమదానం అంతే!

 

          నేటికి మూడు వేకువలుగా పార్కులో ఇందరు కార్యకర్తలెందుకు శ్రమిస్తున్నారు? గృహిణులు, వృద్ధులు తమ శారీరక మానసిక శ్రమశక్తిని  ధారపోసే అవసరమేమిటి అంటే ఈ రెండు మూడు సాయంత్రాల్లో NTR పార్కులో అరుదైన జానపద కళా ప్రదర్శనలు, నాలుగైదు గంటల పాటు వాటిని ఆస్వాదించవస్తున్న వందలాది క్రిక్కిరిసిన ప్రేక్షకులు! అందరు ప్రోగైన పార్కులో పుట్టుకొచ్చే కాలుష్యాలు తొలగించే బాధ్యతో, అదృష్టమో ఈ స్వచ్చ కార్యకర్తలే దక్కించుకొంటున్నారు మరి!

 

          ఉన్నది 24 మందే గాని, ఎవరి క్రమ శిక్షణ వారిదే; లక్ష్యం మాత్రం ఏకోన్ముఖమే!  అది - ఇంత మంచి పార్కు మరింత శోభస్కరంగా ఆహ్లాదకరంగా ప్రయోజన కరంగా ఉండాలనే!

 

          6.30 కు స్వచ్చ కార్యకర్తల త్రివిధ ఆశయాల్ని-గ్రామ స్వచ్చ-శుభ్ర-సౌందర్య సందేశాన్ని నినాదాలుగా ప్రకటించిన యువ కార్యకర్త రామానగరానికి చెందిన రాజు.

 

          బుధవారం వేకువ మనం మరొకమారు కలిసి శ్రమించవలసింది  సాగర్ టాకీస్ బైపాస్ మార్గంలోని సజ్జా ప్రసాదు గారి (అశోక్ నగర్ తొలి) వీధి దగ్గరే!

         

      సమర్పిస్తున్నాం ప్రణామం 98

 

అన్ని గ్రామ పరిసరాలు కాలుష్యపు అన కొండలె!

రహదారులు-శ్మశానాలు క్రమ్ముకొన్న చెత్తలే!

అందుకు మినహాయింపే స్వచ్చోద్యమ చల్లపల్లి

ఆ సంఘటనకు కారకులందరికీ ప్రణామాలు!

 

    - నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

      03.04.2022.