2403*వ రోజు ....           09-Apr-2022

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం.

 

శ్మశానం దిశగా 2403 * వ గ్రామ సుందరీకరణ ఉద్యోగ పర్వం!

 

          శనివారం (09.04.2022) వేకువ 4.17 నుండి 6.12 దాక  సాగిన సదరు ఉద్యోగం(ప్రయత్నం) 25 మందిది! ఊరి అపరిశుభ్ర – అస్తవ్యస్తతా వ్యథ దశాబ్దాల నాటిది! జగమొండితనంగా – తెగింపుగా ఉన్న ఊరి కోసం శ్రమిస్తున్న స్వచ్చ సైనికుల సాత్విక పోరాట కథ ఎనిమిదేళ్ల నాటిది!

 

          కాలుష్యం పై నేటి వేకువ 45-50 పని గంటల సమరంతో మెరుగులు దిద్దుకొన్న అదృష్టం జమ్మి లంకమ్మ గుడి నుండి ఉత్తరంగా 150 గజాల వీధిది. వీధి చిన్నదే గాని – ఇరుకుదే గాని, ముళ్ల , పిచ్చి మొక్కల దరిద్రంలోనూ,  అంగుళం మందపు  దుమ్ము ధూళిలోనూ, మద్యం సీసాల, ప్లాస్టిక్ సంచుల్లోనూ, వీధి మార్జిన్ల  ఆక్రమణల్లోనూ- ఇదేం తక్కువ తినలేదే!

 

          డ్రైను ప్రక్క స్థలంలో కొట్టి పడేసి, ఎండిన కొమ్మల్తోను, ప్లాస్టిక్ సీసాల్తో ను , గోనె సంచుల మూటల్తోను, మురుగు కాలువ చాలా వరకు పూడి ఉన్నది. స్వచ్చ సైనికులు ఇప్పటిదాక  ఏ పది మార్లో ఇక్కడకు వస్తే ఈ డ్రైను వాళ్ల కు  పని కల్పిస్తూనే ఉన్నది! ఎండు టాకులు నిండి , వరి చెత్త పరకలు పడిన ఈ గబ్బు కాలువ ఈ వేకువ ఇద్దరు కార్యకర్తల శ్రమకు పాత్రమైంది !

 

          2 గంటల పాటు ఇందరు వాలంటీర్లు చెమటలు చిందిస్తుంటే- సందడి చేస్తుంటే-స్ఫూర్తిమంతమైన, శ్రావ్యమైన పాటలు వినిపిస్తుంటే – తమ కోసం, తమ వీధిలో, తమ ఆహ్లాదకల్పనా శ్రమదానం నడుస్తుంటే- దారికి పడమర నుండి ఒకరు, తూర్పు నుండి ఒకరు వచ్చి భాగస్తులైనందుకు సంతోషించాలో, మిగిలిన వారి నిర్లిప్తతను ప్రశ్నించాలో తెలియడం లేదు!

          మద్య ప్రియుల సౌకర్యార్థం వేకువనే ఇక్కడ దుకాణం సజావుగా నడుస్తూనే  ఉన్నది. విక్రేతలు, వినిమయ దారులు, వచ్చే పోయే వాహన చోదకులు ఎవరి పనిలో వాళ్లు  నిమగ్నులయ్యే  ఉన్నారు. తమ వీధి శుభ్ర- సౌందర్య సాధన కై  పాటుబడుతున్న ఒక మంచి కృషికి మాత్రం స్పందన లేదు!       

 

          స్వచ్చ కార్యకర్తలు వేలాది రోజులుగా ఊరి కోసం ఏ ప్రణాళికా బద్ధంగా – వీధి శుభ్రతా  సాధకంగా- తమ ఆత్మ సంతృప్తి దాయకంగా- ఎంత నిబద్ధంగా పని చేయాలో అంతగా ఈ ఉదయం కూడ  చేశారు.

 

- ఎండు కొమ్మల్ని, ఊడ్చి పోగులు పెట్టిన కసవుల్ని, ఒక ట్రక్కుకు సరిపడా నింపుకొని, చెత్త కేంద్రానికి తరలించారు;

 

- స్వచ్చ సంస్కృతికనుగుణంగా పాటలు విన్నారు;

 

- పనిలో పనిగా రేపటి తమ శ్రమదాన ప్రదేశం ఎన్నుకొన్నారు;

 

-6.12 కు పని విరమించి, వెను దిరిగి వస్తూ నేటి తమ శ్రమతో మెరుగుపడిన బాట  స్వచ్చ శుభ్రతల్ని చూస్తూ-సంతృప్తి చెందుతూ-కాఫీ కబుర్లు ముగించారు;

 

          6.40 కి కనీసం 2 వార్డుల వాళ్ళకి వినిపించేంతగా  మాలెంపాటి అంజయ్య ముమ్మారు ప్రకటించిన నినాదాలను ప్రతి ధ్వనించారు. అప్పటికప్పుడు స్వచ్చ- సుందర చల్లపల్లి మీద నందేటి శ్రీనివాసుడు పాడిన హుషారైన పాటనూ – దాన్ని నృత్యంగా అభినయించిన BSNL బాబూరావు ఆటనూ మెచ్చారు.

 

          అధిక సంఖ్యాక  కార్యకర్తల చేరికతో  మరింత ఉత్సాహంగా జరగబోయే ఆదివారం నాటి- తూర్పు రామాలయం నుండి జరిగే శ్రమదాన సందడి కోసం రేపటి వేకువ కలుసుకొందాం!      

    

      సమర్పిసున్నాం ప్రణామం 102  

 

ఊరు దాటి, వార్డు దాటి, పొలి మేర్లకు శ్రమదాతలు

వీధి సరే- డ్రైను సరే – శ్మశానాలలో సేవలు!

కాల్వ గట్లు, రహదారులు-కావేవీ అనర్హాలు!

మీ- హద్దులు దాటిన బాధ్యత కందిస్తాం  ప్రణామాలు !    

 

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   09.04.2022