2404*వ రోజు....           10-Apr-2022

  

         ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం.

 

          బందరు రోడ్డు సుందరీకరణ దృశ్యం- @2404*వ రోజు

 

         ఈ ఆదివారం (10.4.2022) నాటి శ్రమదానానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి !

మొదటిది – ఈ నడుమ కొన్ని రోజులుగా 30-40 మందికే పరిమితమౌతున్న కార్యకర్తల సంఖ్య అవలీలగా 51 కి చేరడం –కాస్తంత ఆలస్యమయితే అయింది గాని – ఈ జాతీయ రహదారి కిలోమీటరు మేర-ఇటు భారత లక్ష్మి వడ్లమర నుండి ATM కేంద్రం దాక –గంటకు పైగా  వీధి శ్రమదాతలదే ఇష్టా రాజ్యమైపోయింది!

 

         ఇక రెండో ప్రత్యేకత – ప్రతి రోజు లాగా ఏ 150 గజాల వీధి పరిశుభ్రత తోనో సరిపెట్టుకోక- ఏకంగా నాలుగైదు వందల గజాల బారునా ఊరి ప్రధాన వీధిలో కశ్మలాలకు కాలం మూడడం! మూడో విశేషం స్వచ్చ శ్రమదాతల స్థైర్యం పరాకాష్టకు చేరి – ఎందరెన్ని రకాలుగా రోడ్ల మీద, డ్రైన్ల లో ఎంతగా మలిన పరచినా- షాపుల వాళ్లు ఉపేక్షించినా – ఊళ్లో ప్రతివీధిని, స్వచ్చ-శుభ్ర-సుందరీకరించగలం అనే ధీమా కలగడం.....

 

         బహుశా ఈ పరిణామానికి ప్రథమ కారణం నడక సంఘం వాళ్లే కావచ్చు- వాళ్లు ఎప్పుడో ఒక మారు – మెరుపు మెరిసినట్లు- ఏ ఆదివారమో వచ్చినా- అప్పుడు మాత్రం స్వచ్చ చల్లపల్లి ఉద్యమం మీద బలమైన ముద్రే వేసి వెళతారు! తమ పని వేగంతో, దూకుడుతో, శ్రమదానానికొక ఊపు తెస్తారు!

 

         (అది అత్యాశో- పగటి కలోగాని- అప్పుడప్పుడూ నా కనిపించేదేమంటే – “ ఇలాగే నడక సంఘం వాళ్లు బల ప్రదర్శన రోజూ చేస్తే – ధ్యాన మండలి వాళ్లు పూర్తిగా విశ్వరూపం చూపిస్తే – వృత్తి సంఘాల వాళ్లు, లయన్స్, రోటరీ, వాసవీ... సేవా సంస్థలన్నీ పూర్తిగా కలిసి వస్తే – ఇప్పటి దాక గ్రామ శుభ్రత పట్ల పూర్తిగా దయ చూపని మేధావులు, వ్యాపారులు, విద్యార్థులు, ప్రస్తుత / విశ్రాంత ఉద్యోగులు సైతం చేతులు కలిపి – రోజూ ఏ 400 మందో గ్రామ మెరుగుదలకు పూనుకొంటే- ఈ ఊరి స్వచ్చ –స్వస్త- పరిశుభ్ర- సౌందర్యాలు ఏ స్థాయి కి చేరుతాయో...” అని! ఎక్కడో అమెరికాలో కూర్చొన్న నాదెళ్ళ సురేష్, మండవ శేషగిరుల కలలు కూడ ఇలాగే ఉంటాయి!)

 

         మన ఊహలకు భిన్నంగా కొందరి ఆలోచనలు- ఆ ! చీపుళ్లతో బజార్లు ఊడవడమూ, ప్రసార మాద్యమాల్లో ప్రచారం పిచ్చీ... అన్నట్లుంటే ఉండనిద్దాం!  “యద్భావం తద్భవతి” అని పెద్దలెప్పుడో చెప్పారు.

 

         నేటి కార్యకర్తల శ్రమ సంస్కృతి గురించి ఒక్క మాట: రోజుటి లాగానే ఈ వేకువ కూడ 45 నిముషాల పాటు అందరి పని తీరునూ పరిశీలించాను!

 

         చీపుళ్లతో రోడ్డు దుమ్ము దులిపిన వాళ్లు, మురుగ్గుంటల్ని శోధించి, దిక్కు మాలిన ఛండాలాన్ని సాధించిన మహిళలు, ముఖ్య రహదారితో బాటు ప్రక్క సందుల్లో సైతం వేలు పెట్టిన గృహిణులు, మెలకువగా – జాగ్రత్తగా అడుగులేస్తూ తోచిన – చాత నైనంత  పని చేసిన వృద్ధులు... అందరూ మహానుభావులే- ఎందరికని నా వందనమ్ములు?

 

         6.40 వేళ 25 నిముషాల సమీక్షా సమావేశంలో తమ్మన సతీష్ గారి గ్రామ మెరుగుదల నినాదాలు, గ్రామ భవితవ్య ప్రణాళికల తో బాటు శ్రమ జీవన సంస్కృతీ సమ్మిళిత సాంస్కృతిక వేడుక- నందేటి శ్రీనివాసుని గళ వినిర్గళ చైతన్య గీతికలూ, అందరి చప్పట్లూ- ఒకరి స్టెప్పులూ... ఇవన్నీ చల్లపల్లి స్వచ్చోద్యమ అష్ట వర్ష విజయ సూచికలు!

 

         బుధవారం వేకువ సైతం మన శ్రమదానానికర్హం- బైపాస్ రోడ్డు లోని భారత లక్ష్మి రైస్ మిల్లు దగ్గరే  కలుసుకుందాం !

 

సమర్పిస్తున్నాం ప్రణామం – 103

    

సేవలేవొ – బాధ్యతేదొ – చేసేపని కర్థమేదొ

సంఘ జీవులైన వారి సార్థక శ్రమ దానమేదొ

నిర్వచించి, నిదానించి, నిబ్బరముగ సాగుతున్న

స్వచ్చ కార్యకర్తలకివె సాష్టాంగ ప్రణామాలు!

 

నల్లూరి రామారావు

సభ్యులు- మనకోసం మనం ట్రస్టు

10 .04.2022.