2405*వ రోజు.....           11-Apr-2022

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం.

రెస్క్యూ టీం వారి శ్మశాన సౌకర్య కృషి - @2405*

          సోమవారం - (11-4-22) సమయం వేకువ 4.30అక్కడెందుకో చీకటి స్థలమేమో –"ఛ! అది శ్మశానన మేంటి? సకల విధ పుష్ప విలాస - హరిత సుందర - బహుళ సౌకర్య -  సుమనోహర - వర్ణరంజితారామం...." అని చూసిన భావుకులంతా మెచ్చుకొనక తప్పని రుద్రభూమి! శ్మశాన పరమైన సెంటి మెంట్లు లేని గ్రామస్తుల అంతిమ ప్రస్థానంలో మరికొన్ని వసతులు కల్పించే పట్టుదల గల నలుగురైదుగురు స్వచ్చ కార్యకర్తలు అప్పుడక్కడ ప్రత్యక్షం!

          కరోనా కష్టకాలం నుండే సోమవారం కాస్తా గ్రామ రక్షక దళ వారంగా మారిపోయింది! కాస్త చురుకైన - తెలివైన గ్రామస్తులప్పుడే రెస్క్యూ టీం వాళ్లను తమ వీధి గుంటల పూడిక కోసం సంప్రదిస్తున్నారు కూడ! ఈ రోజు ఎందుకో రెస్క్యూటీం సభ్యులిద్దరో ముగ్గురో రాలేదు గాని - వాళ్ల స్థానాల్ని నలుగురు ట్రస్టు కార్మికులు నింపారు!

గంటన్నరకు పైగా నేటి శ్రమదానమేమంటే

- ప్రధాన రుద్రభూమికి పడమరగా - పార్థివ దైహిక వీడుకోలు, ఇతర ట్రస్టు వాహనాల నిలుపుదల కోసం ఖాళీ స్థలం మెరుగుదల చర్యే!

- ఇందుకు గాను, తామెప్పుడో భవిష్యత్తు అవసరాల కోసం సేకరించి, భద్రపరచుకొన్న తారు పెచ్చుల నిధి నుండి కొంత బైటకు తీసి, ట్రక్కులోని కెక్కించి, పైన చెప్పిన చోటికి చేర్చడం

- ఇక తొలుత తారు పెచ్చుల్తోను, తరువాత కొంత మట్టి సర్దుడుతోను, వర్షాల్లో నైనా వాహనాలు నిలుపుకొనే లాగ చదునుచేయడం

          యధా ప్రకారంగానే 6.30 కి మనకోసం మనంట్రస్టు పర్యవేక్షకుడు కస్తూరి శ్రీనివాసుడు ముమ్మారు గ్రామ భవిష్య సముజ్జ్వలా కాంక్షా నినాదాలు పలికి మిగిలిన పనిని రేపటికి వాయిదా వేశారు!

    సమర్పిస్తున్నాం ప్రణామం 104    

మీ గ్రామం మెరుగుదలే మీకున్న ఒకే గమ్యం

ప్రజా స్వస్త - సౌఖ్యములే పరమాద్భుత ఆశయం

అందుకె మీ ఎనిమిదేళ్ల నిరంతరమగు పోరాటం

ఆశయ పూర్తికి శ్రమించు అందరికీ ప్రణామం!

 

నల్లూరి రామారావు

సభ్యులు- మనకోసం మనం ట్రస్టు

11.04.2022.