1905 * వ రోజు....           29-Jan-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులను వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1905* వ నాటి శ్రమదాన వివరాలు.

ఈ బుధవారం వేకువ 3.58 నుండి 6.26 నిముషాల నడుమ- వరుసగా 4 వ రోజు కూడ బస్ ప్రాంగణం లో నిర్వహింపబడిన స్వచ్చ-శుభ్ర-సుందరీకరణలో పాల్గొన్న కార్యకర్తలు 29 మంది. ఏ రోజూకారోజు R.T.C ప్రాంగణంలోని పని పూర్తవుతున్నట్లే ఉంటుంది గాని, మరింతగా శుభ్రతా పరిపూర్ణత కోసం మరుసటి నాటికి మిగులుతూనే ఉన్నది! నేటి కార్యకర్తల కృషిలోని మూడు విభాగాల వివరాలిలా ఉన్నాయి:

 

- నిన్న, మొన్న కత్తులకు పని చెప్పి, నరికి కోసిన కొమ్మ రెమ్మలు, గడ్డి, ఇంకా జారిపోయిన పనికి మాలిన మొక్కల ఈ నాటి తొలగింపు, ఏరివేత లతో తయారైన వ్యర్ధాలు, రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన కొత్త ప్లాస్టిక్ సంచుల, ఖాళీ మద్యం సీసాల సేకరణ, ఈ అన్నిటినీ ఒకే ట్రాక్టర్ ట్రక్కు లోకి ఎక్కించడమే ప్రధాన కృషి! ట్రాక్టర్ లోకి నింపిన పచ్చి వ్యర్ధాలలో ముళ్ల కొమ్మలు, తీగలు ఎక్కువగా ఉండి, ఆ తడి వ్యర్ధాలను ట్రక్కులో సర్దుతున్న కార్యకర్త- 6 అడుగుల-5 అంగుళాల ఆజానుబాహుడు-కాలుజారి ఆ ముళ్ల లోనే పడిపోయి, రెండు నిముషాల్లోనే లేచి, సర్దడం! ఇలాంటివి ఈ స్వచ్చోద్యమ కృషిలో మామూలే!

 

- ఇక రెండవది ఖాళీ మద్యం సీసాలన్నిటినీ ఒక చోటకు చేర్చే పని-నలుగురు కార్యకర్తలకీ పనితోనే సగం సమయం గడిచింది.

 

- రంగుల మేస్త్రీ తో బాటు ముగ్గురు సుందరీకరణ సభ్యులు కోనేరు హంపీ సమర్పిత నీళ్ల ట్యాంకును గోకి, కడిగి, తుడిచి, ప్రైమరు పూసి, అది ఆరిన తరువాత  తెల్ల రంగు పూసే పనిలో ఉన్నారు. పనిలో పనిగా ఆ ప్రక్కన మంచి నీటి కుళాయి ల దిమ్మెలకు దుమ్ము-మురికి- పాకుడు పట్టి పోవడం చూసి, శుభ్రంగా మెరిసేలా మూడేసి మార్లు కడిగారు.

 

6.00 దాటాక ఇద్దరు కార్యకర్తలు బస్ ప్రాంగణమంతా కలయ తిరుగుతూ – ఇంకా ఎక్కడైనా శుభ్రపరచవలసింది మిగిలిందేమోనని వెదకడం చూశాను. ఆ దగ్గర్లోనే ఉండే ఒక కొబ్బరి బొండాల వ్యాపారి పిలవకుండానే స్వయంగా వచ్చి, స్వచ్చ కార్యకర్తలతో కలిసి, పని చేస్తూ ఆనందించడం కనిపించింది.

 

ఐతే ఈ నిస్వార్ధ శ్రామికుల ఆదర్శ కృషిని, స్ఫూర్తినీ అర్థం చేసుకోని, అందుకోని అమాయక సోదర గ్రామస్తులు ఊళ్లో ఇంకా మిగిలి ఉండడమే వింతల్లో వింత-దయనీయమైన చింత!

 

బుధవారం శ్రమదాన సంప్రదాయానుగుణంగా లయన్స్ క్లబ్ ప్రతినిధి కస్తూరి వరప్రసాద్ నేటి స్వచ్చంద గ్రామ శుభ్రతా కృషిలో పాల్గొనడం 6.40 నిముషాలకు గత నాలుగు నాళ్ల కార్యకర్తల శ్రమ ఫలితంగా అందంగా రూపొందిన బస్ ప్రాంగణం పట్ల సంతృప్తి ప్రకటించడం, చల్లపల్లి స్వచ్చ- సుందర సంకల్ప నినాదాలను-మూడు కాదు- నాలుగు మార్లు ప్రకటించడం తో మన నేటి సామాజిక కర్తవ్యం ముగిసింది.

రేపటి మన కృషి కూడ బస్టాండు ఎదుట రహదారి వద్దే ప్రారంభించుదాం!      

      స్పష్టంగా ప్రకటిస్తా

ఆచరణే గీటురాయి-అంతరాత్మె సాక్ష్యం అని...

లక్షా ఎనభై వేల శ్రమ గంటలు కష్టిస్తామని..

గ్రామ సుఖంలోనే తమ బ్రతుకు ధన్యమౌతుందని..

స్వచ్చోద్యమ చల్లపల్లి చాటి చెప్పి  చూడండని...

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

బుధవారం – 29/01/2020

చల్లపల్లి.