2407*వ రోజు....           13-Apr-2022

ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం.

అశోక్ నగర వీధుల్లో 2407* వ నాటి స్వచ్చ పరిశ్రమ.

          బుధవారం - (13-4-22) వేకువ 4.19 & 6.05 నడుమ జరిగింది 25 మంది గ్రామ బాధ్యుల శ్రమదానం. ముందు అనుకొన్నదీ, ఆగిందీ బైపాస్ లోని భారత లక్ష్మి ధాన్యం మర దగ్గరే గాని, ప్రధానంగా శుభ్రపడింది మాత్రం - అశోక్ నగర్‌ ప్రథమ వీధే! సజ్జా ప్రసాదు గారి ఇంటికి ఉత్తర దక్షిణ బాటతో బాటు పాక్షికంగా ఎదుటి స్థలం కూడ మెరుగయ్యింది! ఇద్దరు ముగ్గురు మాత్రం ఉండబట్ట లేక బైపాస్ వీధి 150 గజాలూ ఊడ్చేశారు!

          గ్రామ వీధుల కాలుష్యం పట్ల అసహన పరులూ, ముఖ్య వీధి శుభ్ర సౌందర్యలాలసులూ ఉన్నచోట ఇలాగే జరుగుతుంది మరి! తుక్కు అడ్డుపడి కుంటి నడక నడుస్తున్న మురుగు కాల్వలూ, ఆకులలములూ, చెత్త, పిచ్చి ముళ్ళ మొక్కలూ ఊరి ఆహ్లాదతకు భంగకరమైతే - తక్కిన గ్రామస్తుల్లాగా ఉపేక్షించ లేక - 2400 రోజుల పైగా శ్రమించే జగమొండి కార్యకర్తలుంటేనే ఇంత పెద్ద గ్రామం వేల కొద్దీ - లక్షల కొద్దీ ఊళ్లలో కెల్లా ఈ మాత్రం ప్రత్యేకంగా నిలుస్తున్నది.

          ఎక్కడ ఏ నోట విన్నా - స్వచ్ఛంద శ్రమదానం గురించిన సంభాషణల్లో తొలుత చర్చకొచ్చేది స్వచ్ఛ సుందర చల్లపల్లి ప్రత్యేకతే! అందుకు మూల కారకులైన - వందకు పైగా ఉన్న నిస్వార్థ శ్రామికుల నిబద్ధతే! పాల మీద మీగడ పైకి తేలినట్లు చల్లపల్లి గ్రామ ఆధునిక చరిత్ర వ్రాస్తే గీస్తే - దాని ప్రపంచ వ్యాప్త గుర్తింపుకు ప్రథమ కారణం సహన శీలురైన - నిష్కామ కర్ములైన స్వచ్ఛ కార్యకర్తల సానుకూలతే!

          మంచి పదాలతో - కాస్త పక్షపాతంతో - నేనిలా కార్యకర్తల శ్రమ దాతృత్వాన్ని అదే పనిగా -  హేతురహితంగా - పొగుడుతున్నట్లు ఎవరికైనా అనుమానం వస్తే - ప్రతి వేకువా జరిగే గంటన్నర 2 గంటల ప్రయత్నాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు! అశోక్ నగర్ తొలి వీధి దక్షిణపు చివర పాతిక ముప్పై గజాల చిట్టడివిని, అందుమూలంగా కనిపించే అస్తవ్యస్తతని, అసౌకర్యాన్ని స్వచ్ఛ కార్యకర్తలెలా దారికి తెచ్చిందీ, సర్పంచి తో సహా మహిళలు వ్యర్ధాలను ట్రాక్టర్ లోకి నింపే దృశ్యాన్నీ చూస్తే నా వ్రాతల్లో అతిశయోక్తులు లేవని అంగీకరించాలి!

          గిన్నెస్ బుక్ కోసం ప్రదర్శనలైతే - ప్రసార మాధ్యమాల్లో గుర్తింపు దురదైతే - అవార్డుల, రివార్డుల ప్రయత్నాలైతే మెరమెచ్చుల బట్టలు నలగని పనులైతే... మూడున్నర లక్షల పనిగంటల శ్రమదానం ఏ ఊళ్ళో - ఎప్పుడైనా సాధ్యపడుతుందా? పాల పొంగై - నీటి బుడగై ఎప్పుడో తేలిపోయేది కదా!

          ఒక బలమైన తాత్త్విక పునాది, దూషణ భూషణ తిరస్కార - పురస్కారాల నధిగమించిన నిబద్ధత లేనిదే ఇంత సుదీర్ఘ స్వచ్చంద గ్రామ పౌర సామాజిక బాధ్యత ఎలా సంభవం?

          6.40 వేళ నేటి కృషి సింహావలోకనానికి ముందు చల్లపల్లి స్వచ్చ పరిశుభ్ర - సౌందర్య సంకల్ప నినాదాలిచ్చినదొక మాలెంపాటి వృద్ధ సింహం! కార్యకర్తలందరికి ద్వారకా తిరుమల లడ్డు ప్రసాదమందించినది మరొక మాలెంపాటి రైతు సింహం! స్వచ్చోద్యమ పెద్దల నిర్ణయానుసారం కాక - ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రేపటి మన వేకువ శ్రమదాన ప్రాంతం మళ్ళీ అశోక్ నగర్ 2,3 వీధులే!

          గురువారం నాటి మన పునర్దర్శనం దివంగత వా.కో. గారి వీధి దగ్గరే!

        కమనీయ వినోదం

చల్లపల్లి విను వీధిన స్వచ్చోద్యమ పతాకం

ఆ రెపరెప లాద్యములై అఖిల రాష్ట్ర ఆకాశం

కాలుష్య విరహితమయ్యే కమనీయ వినోదం

సాక్షాత్కారం అగుటే స్వచ్ఛ సైన్య విజయం!

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   13.04.2022.