2408*వ రోజు.......           14-Apr-2022

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం.

మూడున్నర వీధులు - 28 మంది - గంటా 55 నిముషాల చొప్పున @2408*

        సూక్ష్మంగా చెప్పాలంటే - అదీ గురువారం (14.4.22) నాటి వేకువ వేళ - 4.16 నుండి బైపాస్ మార్గం కేంద్రంగా జరిగిన శ్రమదానం! ఈ స్వచ్చోద్యమమ కారుల, గుంపులో ముగ్గురు 8 - 10 ఏళ్ల బాల కార్మికుల్నుండి 84 వసంతాల వృద్ధ కార్మికుల దాక ఉన్నారు. అశోక్ నగర్ కు చెందిన 2, 3 వీధులు, బైపాస్ మార్గంలో 100 గజాల వీధి అద్దం నేడు ముస్తాబు చేసుకొన్నాయి!

        డబ్బుకు బొత్తిగా విలువ లేని నేటి  ఆంధ్ర రాష్ట్రంలో ఈ గ్రామం ప్రత్యేకతేమంటే - అవకాశాన్ని బట్టి ప్రతి రోజూ 30 – 40 – 50 మంది ఐచ్చికంగా విలువైన తమ కాలాన్నీ, మురికి పనుల కోసం తమ శ్రమనూ - తమ కోసం కాక, గ్రామ సమాజ బాధ్యతగా త్యాగం చేయడం! ఇది వేలరోజులుగా - లక్షల పనిగంటలుగా జరిగే నిరంతర ప్రక్రియ!

        ఇంకో కోణం నుండి దాన్ని చూడాలనుకొంటే : ఇందరి సమయ అర్థ శ్రమ సమర్పణల్ని చూస్తున్న - అంతరార్థం గ్రహిస్తున్న ఎంతో కొంత సామాజిక స్పృహ ఉన్న స్వచ్చ కార్యకర్తల కృషి పట్ల గౌరవం కూడ ఉన్న - కొందరు గ్రామ సోదరులు సైతం కనీసం తమకు వీలైన - వారంలో ఒక రెండు రోజుల్లోనైనా వచ్చి, కలిసి, ఉన్న ఊరి కోసం పాటుబడక పోవడం నాణానికి మరో పార్శ్వం!

        150 ఏళ్ల నాడో - వేరే సందర్భంలో కారల్ మార్క్స్ అనే తత్త్వ వేత్త చమత్కరించినట్లుగా -  సానుకూల దృక్పధం కల చల్లపల్లి పౌరులు నెలకు నాలుగైదు రోజులో వారానికొక రోజులో ఒకటి రెండు గంటలో -  ఊరి మేలు కోసం జరుగుతున్న ఈ సామూహిక శ్రమదానంలో పాల్గొంటే వాళ్లకు పోయేదేమిటి - చిన్నా - చితకా అనారోగ్యాలు తప్ప? పైగా కొంత లబ్ది కూడ ఉండవచ్చు - తమ ఊరి ప్రజల కోసం బాధ్యతగా శ్రమించిన సంతృప్తి రూపంలో!

        చల్లపల్లిలో జరుగుతున్న గ్రామ స్వచ్చోద్యమమేమీ ఆషామాషీ సంగతి కాదే - ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడి, ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించబడి, భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల దృష్టిలో పడి, ఇప్పటికే ఉభయ రాష్ట్రాల్లోని 40 గ్రామాల్లో అనుసరింపబడి, ఋజువైన ఒక యదార్థమే!

        భారతీయుల్లో - ఆంధ్రుల్లో ఒక ముఖ్య లక్షణమేమంటే : మనలో చాలా మంది మంచి - క్రొత్త పనుల్ని అర్థం చేసుకొంటాం - ఆమోదిస్తాం. అభినందిస్తాం - ఆనందిస్తాం కాని సాధ్యమైనంత మందిమి ఆచరించం!

        నేటి గంటన్నర పైగా సమష్టి కృషితో – 2 ½  వీధుల పిచ్చి, ముళ్ల మొక్కలకు కాలం చెల్లి, ఏలిన్నాటి శనిలా పట్టుకొన్న ప్లాస్టిక్ తుక్కులు, ఖాళీ మద్యం సీసాలు, దుమ్ము ధూళీ ట్రక్కులో నిండి, బైపాస్ వీధిలో 100 గజాలు అద్దంలా మారి - నేటి కృషిని సమీక్షిస్తున్న స్వచ్చ వైద్యునికి ఆశ్చర్యాన్నీ, కార్యకర్తలకు తగినంత సంతృప్తినీ మిగిలించాయి!

        ఒక బాల కార్యకర్త మణికంఠ ప్రవచిత గ్రామ స్వచ్ఛ సౌందర్య సాధనా సంకల్ప నినాదాలతో నేటి శ్రమదాన బాధ్యత ముగిసింది!

        రేపటి వేకువ సైతం - బైపాస్ మార్గంలోని భారత లక్ష్మి ధాన్యం మర కేంద్రం గానే మన శ్రమదానం సాగవలసి ఉన్నది!

 

        సంకుచితత్వం జిందాబాద్!

నేను నాదే నాకె సర్వం – ‘మనంఅన్నది మరచి పోదాం

భవితలెందుకు - నవత లెందుకు? పాత రోతతొ బ్రతుకుతుందాం

ఆరేడు ఏళ్లుగ చల్లపల్లిలొ స్వచ్ఛ సైన్యం పట్టనట్లే

ఎవరి స్వార్థం వాళ్లు చూస్తూ గ్రామ స్వస్తత మరచి పోదాం!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   14.04.2022.