2410*వ రోజు....           16-Apr-2022

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం.

2410* వ నాటి వీధి శుభ్రతా విన్యాసం!

          ఇది శనివారం (16.4.22) వేకువ! తమ ఊరి మరొక వీధి కాలుష్యపు శనిని తరిమికొట్టే ప్రయత్నంలో 4.18 నుండి 6.12 దాక 28 మంది పట్టువదలని విక్రమార్కుల మరో ప్రయత్నం! అది ఉప్పల వారి వీధి! (పాతకాలం నాటి సూరి డాక్టరు బజారు!”) ఊరి ఇరుకు దారుల్లో ఇదొకటి! ఈ వేకువ అవసరమైన అన్ని ఆయుధాలతో గంటకు పైగా డజను మంది కార్యకర్తల పోరాటంతో 6.00 తరువాత దర్శనీయంగాను, విహరణ యోగ్యంగాను మారిపోయింది!

          ఇదే సమయంలో వీరి కృషికి సమాంతరంగా కస్తూర్బాయి పాత భవనం చుట్టుకొని, బైపాస్ వీధిలో మరో 10 మంది ప్రయత్నం! ఒక భారీ వృద్ధ కార్యకర్త, ఇంకొక అత్యంత వృద్ధ శ్రమదాత అక్కడి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర గోకుడు పారతో దంతెతో - చీపురుతో చేసిన శ్రమదాన విన్యాసాలు వాట్సప్ మాధ్యమంలో గమనించారా?

          వీళ్ళకు అర కిలోమీటరు దూరంలో - వడ్లమర సమీపంలో ఐదారుగురు సుందరీకర్తలు నిన్న - మొన్నటి తమ వీధి సుందరీకరణకు మరిన్ని మెరుగులు దిద్ది, 6.10 దాటాక ఒకామె చీపుళ్లు, గొర్రులు మోసుకొంటా, మరొకతను నిచ్చెన చాపుకొంటూ ఎంత సంతృప్తితో, ఇంకా ఆరని చెమటలతో తిరిగి వస్తున్న దృశ్యం కూడ గుర్తించగలరు!

          {ఈ పాతిక ముప్పైమంది శ్రామికుల్లో ఏ ఒక్కరి గ్రామ మెరుగుదల మనః పూర్వక ప్రయత్నాన్ని సవివరంగా వ్రాయాలన్నా కనీసం ఒక పేజీ ఐనా నింపాలి. ఏం చేయను? నాకేమోఈ వ్యాస విస్తరణ భయం! పాఠకులకేమో విసుగొచ్చే అవకాశం! సరిగా వ్రాయలేకపోతున్నానేది నా సంశయం - చదువరుల సహనాన్ని పరీక్షిస్తున్నానని మరొక సందిగ్ధం!}

          తమ గ్రామ మెరుగుదల కోసం ప్రతి అవకాశాన్ని సద్వినియోగించే స్వచ్చోద్యమకారుల 3 ½ లక్షల పనిగంటల శ్రమదానాన్ని, కీర్తి కాంక్ష లేని స్వార్ధం గాలి సోకని - ప్రతి ఆటంకాన్నీ అవకాశంగా మార్చుకొని పరిష్కరించుకొని - అప్రతిహతంగా - స్థిరంగా ముందడుగులేస్తున్న ఒక మహత్తర స్వచ్చ సుందరోద్యమాన్ని సుమతూకంగా వర్ణించాలనేదేనా ప్రయత్నం! తడబాటులూ - పొరపాటులూ పడకూడదనే మా అందరి నిశ్చయం!

          గత 15 రోజుల శ్రమదానకాలంలో కార్యకర్తల అనుభవంలో వచ్చిన ఒక శుభపరిణామమేమంటే - అటు సజ్జా వారి వీధి మొదలు ఇటు షాబుల్ బజారు దాక ప్లాస్టిక్ తుక్కులు తగ్గి, రోజు వారీ చెత్త సేకరణ విజయవంతమై ఊరంతటికీ ఈ భాగం మార్గదర్శకం ఔతున్నదని!

          6.45 కు కృషి సమీక్షా కాలంలో భోగాది సూర్య ప్రకాశరావు ముమ్మారు నినదించిన గ్రామ స్వచ్చ శుభ్ర సౌందర్య సంకల్పంతోను, రేపటి శ్రమదాన ప్రదేశ నిర్ణయం మీద తర్జన భర్జనలు వచ్చి, చిన్నపాటి ఓటింగుతోను కార్యకర్తలు గృహోన్ముఖులయ్యారు!

          ఇంతకీ - రేపటి కార్యకర్తల వేకువ శ్రమదానానికర్హతగల చోటు బందరు రహదారిలోని ATM సెంటర్ ప్రాంతమే!

          ప్రతి ఊరొక ప్రతిబింబం

సాహసాలు చేయగలుగు స్వచ్చ వీరులున్న చాలు

పొరుగు వారి మేలు కోరు బుద్ధి కాస్త ఉన్న చాలు

ఐక్య రాగ మాలపించు అంతరంగ మున్న మేలు

ప్రతి ఊరొక చల్లపల్లి ప్రతిబింబం కాకపోదు!

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   16.04.2022.