2414*వ రోజు....           20-Apr-2022

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరించలేమా?

శ్రమ దినాల సంఖ్య 2414* - బుధవారం (20-4-22).

          మరొక మారు సాగర్ టాకీస్ బైపాస్ ఉపమార్గంలోని పాతకాలపు ప్రభుత్వాసుపత్రి శిధిల భవన ప్రాంతమే! సమయం వేకువ 4.13! అప్పటి 15 మందికి తోడైన మరో 15 మంది! 30 మంది శ్రమదానంతో మెరుగుపడింది. ప్రధానంగా వంపులు తిరిగిన యడ్లవారి వీధే! ఐతే - ఎప్పటిలాగే దీనికి కొసర్లున్నాయి – బైపాస్ వీధిలో 100 గజాలూ - బాలికల హాస్టలు ఎదురుగా మరికాస్త సుందరీకరణమూ!

          స్వచ్చ కార్యకర్తల్లో కొందరైతే అత్యాశాపరులు! సుమారు రెండుగంటల్లో ఎంత మేరకు వీధి శుభ్రత నిర్వర్తించగలమో అనే అంచనాను దాటి, ప్రక్క వీధిలో కూడ కాలుపెడుతూనే ఉంటారు. అసలా మాటకొస్తే - స్వచ్చ స్త్రీ – బాల - వృద్ధ సైనికుల్లో ఒళ్ళు దాచుకొనే రకాలుంటే గదా! ఆ లక్షణమే ఉంటే – 3.30 కే లేచి, 4.13 వేళకే ఎందుకు వస్తారు? మురుగు కాల్పల్నీ, వీధి కశ్మలాల్నీ ఎందుకు వేటాడతారు?

          గంట కాలం పైగా 16 మంది పాటుబడితే గాని ఈ యడ్ల వారి వీధి 6.00 తర్వాత ఈ మాత్రం శుభ్రంగా కనిపిస్తున్నదని గుర్తుంచుకోవాలి! అరె! ఇంత చిన్న వీధిలో ఇన్ని సిగరెట్ పీకలా? వక్కపొడి ఖాళీ పేకెట్లా? గతం కన్నా కాస్త తగ్గినవి గాని, రోజూ చెత్తబండి వస్తున్నా ఇంకా రోడ్డు మీదే ప్లాస్టిక్ గ్లాసులూ, కప్పులూనా?

          వచ్చిన చిక్కంతా యజమానులు పట్టించుకోని ఖాళీ స్థలాలతోనే! అక్కడ దోమల కాశ్రయాలుగా పిచ్చి మొక్కలు సరే - ఎవరికైనా చేతిలో వ్యర్ధాలను అక్కడనే విసరాలని సహజం గానే అనిపిస్తుంది! ఈ ఇరుకు వీధిలో ఈ వేకువ బాగుపడిన భాగాల్లో అలాంటి ఖాళీ స్థలం కూడ ఒకటే!

          ఈ 2 గంటల్లో – వీధులు ఊడ్వడం కాక, హాస్టల్ దగ్గర సుందరీకరణం కాక, ఊడ్చిన - ఏరిన నరికిన వ్యర్ధాలను డిప్పల్తో ట్రాక్టర్‌ కెత్తి, చెత్త కేంద్రానికి చేర్చింది కాక, ఖాళీ స్తలాల బాగు చేత కాక, ఏ ఊళ్ళో - ఎవరైనా ఇంతకన్న ఏం చేయగలరో నేను ఊహించలేను!

          లక్షల కొద్దీ పని గంటల శ్రమదాతల్ని మనసారా అభినందించగలను గాని, కలిసిరాని గ్రామ సోదరుల్ని తప్ప పట్టలేను! ప్రత్యక్షంగా చూసి, పాల్గొని, గ్రామ మెరుగుదల ఫలితాల్ని అనుభవించి – శ్రమయేవ జయతే అని పునరుద్ఘాటించడమే – “ఐకమత్యమే బలం”, “వ్యక్తికి బహువచనం శక్తి అని వల్లె వేయడమే ఇప్పటి అవకాశం!

          కాఫీల కాలం తర్వాత 6.40 కి తన గ్రామ స్వచ్చ – శుభ్ర సౌందర్య ప్రణాళికను ముమ్మారు నినదించిన వ్యక్తి పలనాటి అన్నపూర్ణ!

          రేపటి కార్యకర్తల శ్రమదాన ప్రదేశం యడ్ల, షాబుల వీధులనీ, వారి పరస్పరాభివాద స్థలం సినిమా హాలు వెనుక గల “తటవర్తి” భవనం దగ్గరే అని నిర్ణయింపబడింది!

 

ఈ నిస్వార్థపు టడుగులు ఏ ప్రగతికి – ఏ సుగతికి?

ఈ చెమటల దుర్గంధం ఏ సుందర భవిత కొరకు?

ఈ సుదీర్ఘ శ్రమదానం ఏ ఊరికి మేలుకొలుపు?

ఈ లోకోత్తర త్యాగం ఏ సమాజ మేలి మలుపు?

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   20.04.2022.