2415*వ రోజు....           21-Apr-2022

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరించలేమా?

గ్రామ వీధుల్లో శ్రమదాన వీచిక - @2415*

          గురువారం (21-4-22) వేకువ 27 మందితో 4.17 నుండి 6.08 దాక వీచిన శ్రమదాన కెరటం సినిమా హాలు వెనుక బైపాస్ మార్గంలోని మెండు (పోస్టల్) శ్రీనివాస్ ఇంటి దగ్గర బయలుదేరింది! అది అక్కడి నుండి మూడు దిశల్లో

1) కస్తూర్పాయి శిధిల ఆస్పత్రి భవనాల దగ్గర,

2) షాబుల్ వీధి పొడవునా,

3) సాగర్ టాకీస్ బారునా గట్టిగానే తగిలింది!

కొసరుగా 2 మురుగుకాల్వల మరమ్మత్తులు కూడ! ఒక వరుస క్రమంలో వీటిని ప్రస్తావించుకొందాం :

A) శిథిల ఆస్పత్రి ఆవరణనూ, మొండి గోడల నడుమ నా స్వచ్ఛ కార్యకర్తల పరిశుభ్ర - సుందరీకరణ కృషి ఇప్పటికి ఏడవ/ఎనిమిదవ మారు!

B) షాబుల్ వీధిలో నిన్న స్వచ్ఛ కార్యకర్తలు నేటి శ్రమదానం గురించి వివరించినా, క్రొత్త స్థానికుల ప్రమేయం నామమాత్రమే గాని, ఒక చోట ఒక మురుగు కాల్వ తప్పుడు ప్రవర్తన తప్ప - వీధంతా శుభ్రంగానే ఉన్నది! బహుశా - ఇందుకు కారణం వీధినడాన ఉన్న పల్నాటి భాస్కర - అన్నపూర్ణమ్మాదుల చొరవ కావచ్చు!

C) తటవర్తి అప్పారాయ భవనం (పాత చల్లపల్లి వైద్యశాల) దగ్గరి రోడ్డు కిరు ప్రక్కలా నలుగురు కార్యకర్తల తీవ్ర కృషితో రెండు డ్రైన్లలో చలనం వచ్చి, కంపు తగ్గడం గమనించాను!

D) మరో ఐదారుగురు కార్యకర్తలదైతే మరికొంత కఠిన శ్రమే! సినిమా హాలు ప్రహరీ వెలుపల వీధి ఉద్యానాన్ని కలుపు తీసి, పూల మొక్కల పాదులు తీసి, రాళ్ల నడుమ దిక్కుమాలిన పిచ్చి - ముళ్ల మొక్కల్ని నరికి.. గంటన్నర శ్రమించారు.

          మరొక గమనిక : నిన్న కూడ బైట దేశం నుండీ, చల్లపల్లి నుండీ ముగ్గురు వాట్సప్ లో రోజు వారీ స్వచ్చంద శ్రమదానాన్ని మీరు మంచి భాషతో చక్కగా వర్ణిస్తున్నారు కళ్ళకు కట్టినట్లే మేము దగ్గరగా ఉండి చూస్తున్నట్లే చదివి సంతోషిస్తున్నాం...” - అని మెచ్చుకొన్నారు! గమనించదగ్గ రెండు సంగతులేమంటే -

1) ఒక బాధ్యతాయుత అదర్శ శ్రమతో ఊరి కోసం చెమటలు చెందించేది స్వచ్చ కార్యకర్తలు, దాని వెనక చోదక శక్తులు ఇంటా బైటా స్వచ్చోద్యమ దాతలు, రధసారధులు! ఈ చల్లపల్లి స్వచ్ఛ సినిమాకు మాటలూ, అడపాదడపా పాటలూ మాత్రమేనావి!

2) దైనందిన శ్రమదానంలో పాల్గొనాలనే కోరిక ఉన్నా - ప్రవాసులకెట్లాగూ సాధ్యపడదు - కావాలంటే, తలచుకొంటే స్థానికులు మాత్రం (వాట్సప్ చదువరులు) శ్రమదాతలుగా మారగలరు!

          దాలిపర్రు ప్రవాసీ, రామానగర నివాసీ ఐన బొందలపాటి నాగేశ్వరరావు నేటి స్వచ్ఛ సుందరోద్యమ నినాద ప్రవర్తకుడు!

        రేపటి వేకువ వీధి శ్రమదానం కోసం మనం కలసి పాటుబడ దగిన చోటు సినిమాహాలు ఉత్తరపు - CPM కార్యాలయ భవన ప్రవేశ మార్గం దగ్గరే!

 

          నదురు - బెదురు లేని....

ఏ నష్టమూ ఎదురొచ్చిన ఏ కష్టం బెదిరించిన

ఏ అనూహ్య పరిణామా లెంతెంతగ అడ్డొచ్చిన

స్వచ్చోద్యమ చల్లపల్లి పయనం ఆగింది లేదు

ఆ సామాజిక చేతన కదురు లేదు బెదురు లేదు!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   21.04.2022.