2416* వ రోజు....           22-Apr-2022

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం!

 

ముప్పదిన్నొక్క కార్యకర్తల 115 నిముషాల వీధి పారిశుద్ధ్యం-@2416*

 

శుక్రవారం (22.4.2022) వేకువ కూడ ఇంచుమించు అదే బైపాస్ మార్గం ప్రారంభ సమయం -4.14 AM. సాగర్ సినిమా ప్రదర్శన శాలను దాటుకొని, బెజవాడ రోడ్డు దిశగా మరో 150 గజాల శుభ్ర-సుందరీకరణం! వేసవి ఉక్కపోత వల్లనేమోగాని, అప్పటికి అక్కడి వారు కొందరు రోడ్డు పైన కనిపించారు గాని, తమ ఇళ్ల ముందు, దుకాణాల ఎదుట కార్యకర్తలు చేసే పనిలో మాత్రం పాల్గొన లేదు!

 

స్వచ్చ కార్యకర్తలు ఎనిమిదేళ్లుగా ఊరి ఆహ్లాదం కోసం చాలా పనులు చేసి, చేసి రాటు దేలి పోతున్నట్లే గ్రామస్తులు సైతం ఆ పనులు చూస్తూ నిర్మొహమాటంగా ప్రక్క నుండి తప్పుకు పోవడం అలవాటు చేసుకొన్నారు! ఒకే సమాజంలో కొందరిదేమో బాధ్యత పరుల సమస్యల పట్ల అవగాహన- చాతనైనంత సహకారం సంఘీభావం ఎంతో కొంత త్యాగం ఐతే; మరోవంక కొందరివి మంచిదనుకొన్న పనుల పట్ల ఉదాసీనత- గ్రామ సమాజం నుండి తీసుకోవడం తప్ప తిరిగి చెల్లించని బలహీనత రానున్న పర్యావరణ ప్రమాదం పట్ల నిరాసక్తత కనిపించడం కాస్త వింతే గాని- వాస్తవం!

 

ఇతర గ్రామస్తులు వైయక్తిక బాధ్యతల పూర్తి కోసం రోజువారీ నెలవారీ సాంవత్సరిక ప్రణాళికల ప్రకారం పని చేసుకుపోతున్నట్లే స్వచ్చ కార్యకర్తలు కూడ తమ 24 గంటలలో రెండు గంటల కాలాన్ని తమ గ్రామ బాధ్యతల నిర్వహణ కనుగుణంగా ఎన్నో ప్రణాళికలు వేసుకొని, తదనుగుణ కార్యాచరణ చేస్తుంటారు.

 

ఆ కాల పట్టిక (టైం టేబుల్) ప్రకారమే 10 రోజుల్నుండి ఈ బైపాస్ వీధిని తీర్చిదిద్దుతున్నది. ఈ శుక్రవారం తెల్లవారే 6.00 సమయానికి క్రమబద్ధ శ్రమ కు సాక్ష్యంగా :

 

- ఒక పెద్ద గోనె సంచి నిండా రకరకాల మద్యం బ్రాండ్ల గాజు సీసాలు మరో గోనె సంచీడు ప్లాస్టిక్ సీసాలు, గ్లాసులు, కప్పులు, ప్లేటులూ- రోడ్డు మార్జిన్ల శుభ్ర ప్రయత్నంలో ఆకులు, పిచ్చి మొక్కల, తీగల వంటివొక ట్రక్కు వ్యర్థాలూ దొరికి,

 

ఇది వేసవి కావడాన కనీసం మరో 2 నెలలు దాకా గడ్డీ , పిచ్చి మొక్కలు పెరగక, సినిమా హాలు యాజమాన్యపు సమీప గృహస్థుల కొద్దిపాటి జాగ్రత్తలతో ఇతర వ్యర్థాలు కూడ లేక ఈ 1 ½  కిలో మీటర్ల బైపాస్ రహాదారి స్వచ్చ-శుభ్ర-సుందరంగా ఉండగలదని ఆశిద్దాం!

 

కాఫీ సమయపు చర్చల, ఊరి మెరుగుదల సంప్రదింపులలోకాభిరామాయణాల పిదప మోటారు మెకానిక్ ఉస్మాన్ షరీఫ్ మూడు మార్లు ఊరి త్రివిధ మెరుగుదల నినాదాలు వినిపించి, కార్యకర్తల్ని నడకుదురు మార్గంలో ఒక్క రోజు శ్రమదానానికి కాహ్వానించగా,

 

తరువాతి వారంలో తన మాతృ మూర్తి సంస్మరణ కార్యక్రమానికి శివబాబు కార్యకర్తల్ని సపరివారంగా ఆహ్వానించగా 6.45 కు నేటి స్వచ్చ దినచర్య ముగిసింది!

 

రేపటి మన శేష బాధ్యతల కోసం కలువదగిన చోటు సంత మార్కెట్ వద్ద!

 

       ఎవరి స్వచ్చోద్యమం సంస్కృతి ?

 

ఎవరి సంచిత స్వచ్చ సంస్కృతి! ఎవరి నిర్మిత శుభ్ర సత్కృతి!

ఎట్టి భవితల కిట్టి విస్తృతి ! ఏ మహోన్నతి కింత సన్మతి!

కీర్తి కాంక్షల కాక లేపక- కేవలం నిస్వార్థ ముగనే

నడచు స్వచ్చోద్యమ రథానికి నా సవినయ ప్రణమాంజలి!

 

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   22.04.2022