2417* వ రోజు....           23-Apr-2022

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం!

2417* వ నాటి 34 మంది వీధి పారిశుద్ధ్య పరిశ్రమ!

          ఔను నిజం! ఈ శనివారం వేకువ 4.15 - 6.12 సమయాల నడుమ సంత వీధి కేంద్రంగా జరిగిన శ్రమదానం – ఒక దశలో – 5.40 ప్రాంతంలో సమీపం నుండి పరిశీలిస్తే నాకనిపించిన పదం పరిశ్రమే’!30 + మందీ గ్రామ స్వచ్చ కార్మికులే! బైపాస్ కూడలి నుండి పోలీసు క్వార్టర్ల దాక - 150 గజాల సిమెంటు దారి మీద చీపుళ్ల నుండి ఎగసిపడుతున్న దుమ్ము, గొర్రుల - కత్తుల రాపిడుల శబ్దాలు, నికృష్ట చౌక మద్యం ఖాళీ సీసాల ఏరుడులు, పార్ధీనియం అనే దోమల పెంపక పిచ్చి మొక్కల పీకుడులు, ఇంకొన్ని ఛలోక్తులు... చూస్తూ – వింటూ - అలోచిస్తుంటే నేనెప్పుడో చదివిన :

“కమ్మరి కొలిమీ - కుమ్మరి చక్రం/జాలరి పగ్గం - సాలెల మగ్గం

శరీర కష్టం స్ఫురింపజేసే/ గొడ్డలి - కొడవలి - నాగలి - రంపం.

సహస్రవృత్తుల సమస్త చిహ్నాల్అనే శ్రీ శ్రీ మహా ప్రస్థానంలో “ప్రతిజ్ఞ”

కవిత్వపంక్తులు చప్పున గుర్తొచ్చాయి!

          కార్యకర్తల నిన్నటి ముందస్తు అంచనా ప్రకారమైతే బందరు రోడ్డు దాక ఈ రహదారంతా శుభ్రపడి పోవాలి. కాని - పోలీసు నివాస భవనాల దగ్గరే ఆగిపోయింది. కారణమేముంది -  ఈ 30 మంది శ్రమించక కాదు; వాతావరణ ప్రభావంతో ఒక్కొక్కళ్లకు చెనుట దిగ కారిపోక కాదు; మరేమనగా -

1. సినమా హాలు గేటు ఎదుట తూర్పు పడమరల రోడ్డొకటి – అది లారీ కూడ వెళ్లగలిగినదే గాని, మొక్కలు పెరిగి, అన్ని కశ్మల దరిద్రాలు చేరి లోతట్టు ఇళ్ల వారు నడుస్తున్నది మాత్రం మూరెడు సన్నని కాలిబాటే! ఆ ఇళ్ల వాళ్లు ఏ నలుగురు తలుచుకొని ఒక్కపూట పనిచేసుకొన్నా ఇట్టే బాగుపడుతుంది - లేదా స్వచ్ఛ కార్యకర్తల్తో కలిసొచ్చినా పని పూర్తయ్యేది. ఊహూ! ఒక్కళ్లైనా వచ్చి అడిగింది లేదు - మరి అడక్కుండానే వాళ్ళే సుందరీకరిస్తారనే గట్టి నమ్మకం వాళ్లది! వాళ్ల నమ్మకమే – 12 మంది వాలంటీర్లకు ఆ చిన్న వీధే గంటన్నర పాటు పని కల్పించింది!

2. సుందరీకర్తల ముఠాతో చిక్కేమంటే – ముఖ్యంగా అందులో పరిపూర్ణతా వాదులు (పర్ఫెక్షనిస్టులు) ఇద్దరున్నారు - వాళ్లకేమో రాశి కన్న వాసే ముఖ్యం!

          నిన్ననే ఆప్రాంతం వారికి నేటి కార్యక్రమం చీటీలు పంచాక కూడా క్రొత్త కార్యకర్తలు వచ్చి కలిసింది ఇద్దరంటే ఇద్దరే! (పోన్లే – ఊరి జనం ఎన్నాళ్లిలా పొదుపు పాటిస్తారో చూద్దాం!)

          6.30 దాటాక – చేతుల, ముఖాల, చెమటలు తుడుచుకొన్నాక – కొద్దిపాటి సరస సల్లాపాలయ్యాక – కూరల సంత ప్రక్కన – రోడ్డు మీదే – ఒక సుందరీకర్త చిత్రించిన జాతిపిత సమక్షంలో జరిగిన సమీక్షా సమావేశంలో;

బత్తుల రవి అనే హాస్పిటల్ ఉద్యోగి తడబాటు లేకుండ ముమ్మారు నినదించిన గ్రామ స్వచ్చ – పరిశుభ్ర – సౌందర్య సంకల్పతోనూ, దాసరి రామకృష్ణ వైద్యుల వారి నేటి కృషి ప్రశంసలతోనూ శనివారం నాటి 2 గంటల కార్యక్రమం ముగిసింది.

          నడక సంఘం వారి అభ్యర్థన మేరకు మన రేపటి పొరుగూరి వీధి పారిశుద్ధ్యం కోసం బందరు మార్గంలోని 6 వ నంబరు కాలువ వంతెన దగ్గరే మన పునర్దర్శనం!

 

ప్రతి ఫలితం శ్రమతోనే ప్రత్యక్షం ఔతది

సామాజిక స్పృహ ఉంటే శ్రమ సార్థక మౌతది

స్వచ్చోద్యమ చల్లపల్లె సజీవ సాక్ష్యం దానికి

సహస్రధా ఋజువైనది - సందేహం దేనికి?

 

- నల్లూరి రామారావు

   ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు    

   23.04.2022