2418* వ రోజు....           24-Apr-2022

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం!

2418* వ వేకువ (ఆదివారం-24.04.2022) స్వచ్చంద శ్రమ వీర విహారం!

 

          4.18 – బ్రాహ్మీ ముహూర్తానికి డజను మందితోనూ- ఒక్కో నిముషం గడిచే కొద్దీ సంఖ్యా బలం పెరిగి- పెరిగి అది నాలుగున్నర డజన్లు (54) గాను (కొందరు నడక మిత్ర కార్యకర్తలు ఈ రోజు మరొక అరగంట శ్రమదానం చెయ్యక తప్పదని ముందుగానే హెచ్చరించారు కూడా) మారి 6.35 దాకా – 2 ¼ గంటల పాటు – రామానగరం ప్రారంభపు- బందరు రహదారిలో-150 గజాల నిడివిలో – అత్యుత్సాహంతో - గ్రామ సామాజిక బాధ్యతతో- ప్రత్యక్షంగా చూస్తే తప్ప నమ్మ లేనంత నిబద్ధతగా- స్ఫూర్తి మంతంగా జరిగిన శ్రమదానం అది.

 

          ఒక్క సంగతి ముందే చెప్పాలి-నేటి స్వచోద్యమ బలం 54 కు చేరిందంటే- అందుకు తొలి బాధ్యత నడక సంఘానిది ! సకుటుంబంగా పాల్గొని ప్రేరణ నింపిన చల్లపల్లి, లక్ష్మీపురం గ్రామ సర్పంచులది! 74-84 ఏళ్ల మలి వయస్సు వాళ్లది! వంటిళ్లలో ముడుచుకోక గ్రామ బాధ్యత పంచుకొంటున్న గృహిణులది!  ధ్యాన మండలి వాళ్లది! ఇంకా లక్ష్మీపురం పంచాయతి కార్మికులది! ఎందరెందరో మహానుభావులది!

 

          మరి ఈనాటి పొరుగు గ్రామ వీధి స్వచ్చోద్యమ ఉత్సాహాన్ని – ఉద్వేగాన్ని- క్రమ శిక్షణని-ఈ కష్టతరమైన శ్రమదాన ప్రదర్శనని వర్ణించాలంటే నాకు 4 సన్నివేశాలు గుర్తొస్తున్నవి:

 

 1)ఇసుక-దుమ్ము-ధూళి దురాక్రమణలతో సగం దారి మూసుకుపోగా పాతిక మంది పారలు / రైల్వే పారలు/గోకుడు పారలు / చీపుళ్లు – డిప్పలు వాడుతూ రహదారి వైశాల్యాన్ని రెట్టింపు చేసిన వైనం,

 

2) కళ్యాణ మండపం వైపునా, సదరు రోడ్డుకు ఉత్తర దిక్కునా రెండు ట్రక్కుల దిక్కుమాలిన కశ్మలాల పనిబట్టి- చిట్టడవిని బలిపెట్టి- రెండు గోనె సంచుల ఖాళీ సీసాలను ఏరుతూ చూపిన ఉత్సాహం – పొందిన ఆనందం,

3) రెండు ట్రక్కుల వ్యర్థాల్ని ఒకే ట్రక్కులో నొక్కి, త్రొక్కి, సర్దిన విజయ గర్వంతో ఒకాయన-(అంజయ్య) ఆకాశంలో కి చేతులు చాపిన దృశ్యం,

 

ఇక 4 వది: సమీక్షా కాలంలో నందేటి శ్రీనివాసుడు రెండు కిక్కిచ్చే పాటలతో ఉర్రూతలూగించిన గానం!

 

          వీటన్నిటి నడుమా ఒకే వెలితి! స్వచ్చోద్యమ చల్లపల్లిని నరనరానా జీర్ణించుకొని, సొంతం చేసుకొన్న- అందుకోసమే తన బెజవాడనూ- ఐన వాళ్లనూ వదలి చల్లపల్లి కంకితమైన ప్రాతూరి ఉదయ శంకరుడూ, ఏ 20 వేల కిలోమీటర్ల దూరంలోనో ఉన్నా – ప్రతిక్షణం ఈ స్వచ్చోద్యమానికై ప్రతీక్షించే మండవ- నాదెళ్లాది  ప్రవాసులూ ఈ సామాజికోద్యమానందం ప్రత్యక్షంగా పొందలేక పోవడం!

 

          వాళ్లకు భిన్నంగా ఈ రోజు నేనదృష్టవంతుడినే! చిన్నతనం నుండే నా మనస్సు కాస్త కవితాత్మకం కావడాన్నేమో – ఈ శ్రమ వినోద ఘట్టాల్ని చూస్తే ఈ ఆదివారం నాకు 2 కవిత్వాలు గుర్తొచ్చాయి!

 

1. మహాకవితోద్రేకి ఐన స్విన్ బర్న్ మీద శ్రీశ్రీ గేయం:

“కదం త్రొక్కే తురంగాలో – మదం పట్టిన మాతంగాలో-

 విలయ సాగర తరంగాలో- వలయ విచల ద్విహంగాలో.... కవీ! నీ కవితల్!”

 

II “ ఎన్నెన్ని వంపులో- ఎన్నెన్ని సొంపులో –నాకున్నవేమో రెండే కన్నులు

ఏవి చూసేదీ – ఎలా చెప్పేదీ...” అనే ఒక సినిమా గేయం!

 

          7.00 సమయంలోని సమావేశంలో లక్ష్మీపురం – చల్లపల్లి ఉభయ గ్రామ స్వచ్చోద్యమ  ఆశయాన్ని ముమ్మారు నినదించినదీ, రేపటి నుండి తాను  విధిగా శ్రమదానంలో పాల్గొంటానని ప్రకటించినదీ లక్ష్మీపురం సర్పంచ్ శ్రీ కొల్లూరి కోటేశ్వర రావు గారు.

 

          నేటి కాఫీ ఖర్చుల నిమిత్తం 1100/- వితరణ దామినేని ధర్మారావు గారిది.   

          నేటి 54 మంది శ్రమదాతల్ని మెచ్చినది దాసరి రామకృష్ణ ప్రసాద మహోదయులు !

 

          నిన్నటి సంత బజారు సుందరీకరణ కృషికి పొడిగింపుగా బుధవారం నాటి వేకువ మనం కలిసి శ్రమించదగిన చోటు- రైతు బజారు వద్ద నుండే!

 

          చల్లపల్లి సంగతి ?

“ అత్యుత్తమ శ్రమ ఫలితం” అనేదెక్కడుంటది?

అది స్వార్థమ- పరార్థమా అను విషయమె దొడ్డది

నట్ట నడుమ కాడి పార వేయకుంటె మంచిది

స్వచ్చోద్యమ చల్లపల్లి సంగతి ఎటువంటిది!

 

- నల్లూరి రామారావు

   ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు    

   24.04.2022