2419* వ రోజు....           25-Apr-2022

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం!

 

ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం!

 

ఆది తప్ప-అంతం లేని చల్లపల్లి స్వచ్చ-సుందరోద్యమంలో -2419 * వ రోజు

 

ఇది సోమవారం(25.04.2022) వేకువ సమయం 4.30 ; ఎక్కడందురా- రామానగరం బందరు మార్గం- 6 వ నంబరు కాలువ, సినిమా హాళ్ల మధ్యస్త ప్రదేశం! తొలుత పంచ కార్మికులే గాని కొద్ది వ్యవధిలో ఇంకో ఐదుగురు! బ్రహ్మ ముహూర్తం లో జాగృతులై, రెండేసి-మూడేసి కిలో మీటర్ల దూరం వచ్చి-(మళ్లీ ఇందులో ఒక గృహిణి కూడ!) చేస్తున్నది ఆధ్యాత్మిక చింతనా? ఖాళీ జాగాల కబ్జాలా?

 

సామాజిక చైతన్యంఅనేది ఇప్పటి తరం మరిచిపోతున్న మాట! ఊరుమ్మడి బాధ్యతఅనేది అత్యధికులకు బొత్తిగా అర్థం తెలియని కఠిన పదం! సొంత లాభం కొంత మానడం’, ‘ పొరుగు మేలుకు పాటుబడడంవంటి గురజాడకవితా సూక్తులు కేవలం చాదస్తాలు! ఏ పౌర సమాజం మనకు బ్రతుకు పాఠాలు నేర్పిందో- ఏ గ్రామంలో మనం పుట్టి-పెరిగి- దాన్నుండి ఏమేమి తీసుకొని ఇంత వాళ్లమయ్యామో, ఏమైనా తిరిగి ఇచ్చామో లేదో...... అనే భావాలూ, మొహమాటాలూ.... ఇప్పుడొక బ్రహ్మ పదార్థం !

 

ఎందుకీ ఉపోద్ఘాతాలూ, సోదిలూ అనగా- అలాంటి చాదస్తాలు, అర్థం, పర్థం లేని పనులు, బ్రహ్మ పదార్థాలు- ఈ 2022 లో ఈ చల్లపల్లిలో సజీవంగా- సగర్వంగా నిలిచి ఉన్నాయని చెప్పడానికే! అవినీతే నీతిగా- అధర్మమే ధర్మంగా- అక్రమమే సక్రమంగా చెలామణి ఔతున్న భ్రష్ట కాలంలో  కనీసం ఒక్క గ్రామంలోనైనా- కనీసం 150 మందైనా-2419 దినాలుగా తమ మేలు కోసం కాక- ఊరి సంక్షేమం కోసం తమ మేధస్సును, సమయాన్ని ధర్మ కష్టార్జితాన్ని ఒక దీక్షగా తపస్సుగా యజ్ఞంగా నిర్వహిస్తున్న వైనాన్ని చాటి చెప్పడానికే ఈ ఉపోద్ఘాతమంతా!

 

నిన్నటి కార్యకర్తలు 54 మంది స్వచ్చ వీర విహారం చేసిన చోటనే నేడు 10 మంది రెస్క్యూ టీం నిన్నటి సుందరీకరణానికి మరికొన్ని మెరుగులు దిద్ది మిగిలిపోయిన దుమ్ము-ఇసుక గుట్టల్ని ట్రాక్టర్లో నింపుకొని- ఊళ్లో ఏ మూల రోడ్డు భద్రతకో దాన్ని  సద్వినియోగించి...

 

ఇక  వీటన్నిట్లో ఒక 84 ఏళ్ల పశు వైద్యుడు చీపురుతో దుమ్ము-ఇసుక ఊడ్చే పనినీ, ఇంటి పనుల్తో ప్రతిక్షణం విలువైన ఒక గృహిణి వీధి శుభ్రతలో నిమగ్నం కావడాన్నీ , ట్రాక్టర్లో కెక్కి మట్టి డిప్పల్ని అందుకొని, నింపి, సర్దే బ్రహ్మం అనే ఒక ఎలక్ట్రీషియన్నీ తప్పక గమనించండి.

 

6.30 కి పల్నాటి అన్నపూర్ణ తమ స్వచ్చ సుందరోద్యమ సారాంశాన్ని ముమ్మారు నినాదాలుగా ప్రకటించి, నేటి తమ శ్రమదానాన్ని ముగించారు!

 

    సమర్పిస్తున్నాం ప్రణామం -106

గతం నుండీ విదేశాల్లో ఘనంగా ఋజువైన మంచిని

ఎవరినీ నొప్పించ జాలని- అందరికీ మేల్ కూర్చు దానిని

స్వచ్చ-సుందర కలల గ్రామం సాధనకు యత్నించు వారికి

చల్లపల్లి స్వచ్చ-సుందర సాహసికులకు మా ప్రణామం!

 

- నల్లూరి రామారావు

   ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు    

   25.04.2022