2420* వ రోజు....           26-Apr-2022

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం!

 

   రెస్క్యూ టీం వాళ్ళది వరుస మొత్తం పని దినాల సంఖ్యగా  -2420 * వ రోజు

 

          గ్రామ భద్రతా దళం మరో మంగళ వారం వేకువ (26.04.2022) కృషి !

 

బందరు రహదారిలోను, గంగులవారిపాలెం వీధిలోను అది విస్తరించింది. పది మందికి పైగా కాలూ, వేలూ పెట్టిన ఈ క్రొత్త రకం గ్రామ ప్రయోజనకర చర్య కాస్త ఆసక్తి కరంగానే ఉంటుంది:

 

సంగతేమంటే అసలిది తాపీ పని. ఉదర పోషణార్థమ్ బహుకృత వేషమ్అనే పాత సామెత ఉంది గాని, అది రెస్క్యూ టీం వాళ్ళకు వర్తించదు. వాళ్ళ ఈ క్రొత్త తాపీ మేస్త్రీల అవతారం పొట్ట కూటికి కాదు ఏదో కొంత ఊరి సామాజిక బాధ్యత మోస్తున్న ఆత్మ సంతృప్తికే! కావాలంటే మచ్చుకు 68 ఏళ్ల కోడూరు వారిని చూడండి- కొత్తరకం చొక్కా చెమటకు తడిసినా-ముఖంలో ఆనందం గమనించండి.

 

ఈ కాస్తపాటి పరోపకార పరమానందం కోసమే  స్వచ్చ కార్యకర్తలు తమ 3 ½ లక్షల పని గంటల శ్రమతో 40 ఊళ్లకూ, రాష్ట్రానికీ- ఇంకా చెప్పాలంటే 6 లక్షల గ్రామాలకీ ఆదర్శంగా నిలుస్తున్నది! సక్రమంగానో అక్రమంగానోమిలియన్లో బిలియన్లో పోగేస్తే వచ్చే ఆనందం కాదిది!

 

ఈ ఇద్దరు తాపీ మేస్త్రీలూ, నలుగురైదుగురు తాపీ కూలీలూ, ఇంకో నలుగురు హంగుదారులూ ఈ వేకువ 4.25 – 7.00 సమయాల నడుమ-2 ½ గంటలు చల్లపల్లి గ్రామస్తుల కోసం ఏం సాధించారయ్యా అంటే:

 

1) షాబుల్ వీధి, బందరు రోడ్ల కలయిక దగ్గర గుంటలు పడి సదరు ఇరుకు వీధి వాడకం దారులకు అసౌకర్యంగా, ప్రామాదికంగా ఉన్న చోటును,

 

2) ప్రభుత్వ బాలికల హాస్టల్ పడమర కూడలిలో పడిన గుంటలను,

 

3)గంగులవారిపాలెం వీధిలో జల నాట్య కేంద్రం దగ్గరి మరో గుంటను-

 

మిల్లర్ లో గాదు- పారల్తో సిమెంటు ఇసుక- రాతి కంకర మిశ్రమం తయారు చేసి, గుంటలు పూడ్చి- మెత్తి, చదును చేసి అందుకు గాను చెమటలు దిగకారి-ఎట్ట కేలకు 7.00 కు అనుకొన్నది సాధించారు!(ఇందులో  పెద్ద మేస్త్రి గంధం బృందావనుడు-స్వచ్చోద్యమ సంచాలంలో అతడు ఆల్ రౌండర్ సకల కళా వల్లభుడు!)

 

మరి నేటి కార్యకర్తల శ్రమ సరే- ఖర్చు? ఇనుప కొట్టు ఉరిమి సాయి గారిది- సిమెంటు, డా. శిర్విశెట్టి వేణు గారిది రాతికంకర, లారీల నుండి కారిపోయి, కార్యకర్తలు సేకరించిన ఇసుక-ఇలా సముద్రంలోని ఉప్పూ, చెట్టు మీది ఉసిరి కలిసి గ్రామస్తుల సౌకర్య భుక్తి  కోసం కమ్మని పచ్చడి తయారీ!

 

ఆదివారం నాటి, నేటి స్వచ్చోద్యమ అతిధి BDR ప్రసాదు ప్రవచించిన గ్రామ స్వచ్చ-పరిశుభ్ర- సౌందర్య సాధక నినాదాలతో నేటి బరువు పనికి స్వస్తి!

 

రేపటి వేకువ వీధి పారిశుద్ధ్య చర్యల కోసం మన పునర్దర్శనం సంత వీధిలోనే!

 

సమర్పిస్తున్నాం ప్రణామం -107

 

ఏ మనిషికి ప్రాథమ్యం ఉమ్మడి స్వస్తత అగునో-

గ్రామ సమగ్రాభ్యుదయం కలగను నైజం కలదో-

తనతొ బాటు సమాజమూ తరించాలి అనుకొనునో-

అతడె స్వచ్చ ధన్య మూర్తి- అతనికె నా ప్రణామం !

 

- నల్లూరి రామారావు

   ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు    

   26.04.2022