2421* వ రోజు....           27-Apr-2022

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం!

మన స్వచ్ఛ చల్లపల్లి కోసం – 2421* వ నాటి కృషి

          బుధవారం (27-4-22) వేకువ కూడ అదే సంతలో - అదే సమయం - 4.15 కి ఠంచనుగా -  పట్టుదలకు సాక్ష్యాలుగా – 15 మంది. కొన్ని నిముషాల్లో మరో 14 మంది! ఇక సుమారు 100 నిముషాల పాటు ఇటు సంత వీధిలో, అటు బెజవాడ రోడ్డులో చీపుళ్లతో ఊడ్పుడే... ఊడ్పుడు! టిప్పర్ల నుండి కారిన ఇసుకను మోసుడే...మోసుడు! 6.15 కు కూడ కొందరు వ్యర్ధాల గుట్టల్ని ఎత్తుడే... ఎత్తుడు!

          ఏ మాటకామాటే అనుకోవాలి - ఈ 100 - 150 మంది స్వచ్ఛ శ్రమదాతలు ఇలా 8 ఏళ్లుగా ఊరి కాలుష్యాల మీద తిరగబడకుంటే గ్రామ శుభ్ర సౌందర్యాల కొంప మునుగుడే...మునుగుడు! ఏ రోజుకారోజు మా అశ ఏమంటే - చల్లపల్లిలో మాదిరే రాష్ట్రంలోని 30 – 40 గ్రామాల్లోనే కాక, 13000 పంచాయతీల్లో సైతం ఇక్కడి లాగా రోజూ 30 – 40 - 50 మంది కాకున్నా 10 మందైనా వాళ్ల సౌకర్యాల, అహ్లాదాల, స్వస్తతల కోసం ఎప్పటికైనా పూనుకోకపోతారా అని! ఒకసామాజిక స్పృహ - ఒక సమైక్యతాశక్తి బైటపడవా అని!

మాయమైపోతున్నడమ్మా! మనిషన్నవాడూ,

మచ్చుకైనా లేడు చూడూ - మానవత్వం మిగిలి నేడూ......

అని ఒక తెలంగాణా నిరక్షరాస్య కవి (అందె శ్రీ) పాట అర్ధాన్ని దాటి - మరింత ముందుకు పోయి, క్రౌర్యం, కౌటిల్యం, దుర్మార్గం తాండవిస్తున్న కాలంలో అలాంటి పేరాశ ఎందుకంటే - మనం ఆశాజీవులం కాబట్టి! వ్యక్తి స్వార్థం తగ్గి, గ్రామ సామాజిక సమష్టి ప్రయోజనకర స్వచ్చోద్యమ కారులం కాబట్టి !

          గత 2420* రోజుల్లాగే ఈ బుధవారపు శ్రమదానం కూడ జరిగింది! 29 మంది తమ విలువైన రెండేసి గంటల సమయాన్ని, కష్టాన్ని సంత మొదలుకొని బందరు రహదారి దాక సుందరీకరించి చూపారు. కొసరుగా పడమరగా ఉన్న ఇరుకు సందునూరక్షక భట భవనాలలో కాస్తంత భాగాన్ని కూడ!

          ఈ పనిలో వాళ్ల బట్టలు చెమటతో తడిసి, ఊడుస్తున్న దుమ్ములు అంటుకొని, 6.00 వేళకు కొందరి ఆకారాలు మారితే మారవచ్చు! మానసికంగా వాళ్లిలాంటి అన్నిటికి సంసిద్ధులే!

          ఇందులో ఆరుగురు కార్యకర్తల పని చోటు మారింది విజయా కాన్వెంటు ఎదుట - ఇసుక టిప్పర్ నుండి చాల ఇసుక జారి ప్రయాణికులకు వాహనాలకూ కష్టదాయకం కావడాన్ని గ్రహించి, వీళ్లు గంటన్నర పాటు శ్రమించి, ఆ ఇసుకను తొలగించి వచ్చారు. బహుశా ఆ ఇసుక నిధి ఎప్పుడో ఏ వీధి రోడ్ల గుంటల్ని పూడ్చేందుకో  రెస్క్యూ టీం వాళ్ళు సద్వినియోగిస్తారనుకొంటా!

          నేటి స్వగ్రామ స్వచ్చ సౌందర్య సంపాదక నినాదాల్ని దంచి కొట్టిందీ, వివేకానందుని సూక్తులు గుర్తు చేసిందీ అడపా గురవయ్య గురువర్యుడు!

          ఈ మధ్యాహ్నం 12.00 - 1.00 నడుమ మోపిదేవి వార్పు దగ్గర శివబాబు గారి ఇంటి దగ్గర స్వచ్చ కార్యకర్తలు కలుసుకోవలసి ఉన్నది.

          రేపటి వేకువ నడకుదురు బాట దగ్గరి శ్రీ నగర్ లో, హైందవ - ముస్లిం సోదర భావానికి ప్రతీకగా ఈద్గా స్వచ్ఛ సుందరీకరణ కోసం మనం ప్రయత్నించవలసి ఉన్నది!

 

     సమర్పిస్తున్నాం ప్రణామం - 108

ఈ సమాజ పోకడలను ఎందరో గ్రహించి కూడ

చర్విత చరణం గానే స్వార్థంలో మునుగు చుండ

సామాజిక నిర్లక్ష్యం చక్కగా గ్రహించి కూడ

ఊరి మంచి కుద్యమించు ఉన్నతులకు ప్రణామాలు!

 

- నల్లూరి రామారావు

   ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు   

   27.04.2022