2422* వ రోజు.......           28-Apr-2022

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం!

స్వచ్చోద్యమంలో మరొక ప్రత్యేకతగా – 2422* వ నాడు!

          గురువారం (28.04.2022) నాటిదనే ఏముంది? చల్లపల్లి స్వచ్చ సుందరోద్యమమే దేశంలో ఎక్కడా కనిపించని ఒక విశిష్టత! 30 కి పైగా గ్రామాల్లో - అభిమానులతో అనుకరింపబడే -10 - 12 దేశాల్లోని ప్రవాసులు డజన్ల కొద్ది మంది అనునిత్యం తన ద్విగ్విజయాన్ని ఆకాంక్షించే సామాజిక అత్యవసర సంఘటన అది!

మరి ఈ 2422* వ నాటి వింత విశిష్టత ఏమిటట?

- చాల రోజుల కరోనా కష్టాల తర్వాత నేటి శ్రమదానంలో 61 మంది కలిసి రావడం,

- భారత దేశ నిజమైన లౌకికత్వానికీ, చల్లపల్లి గ్రామ శ్రమదాన సమైక్య శక్తికీ ప్రతీకగా ప్రముఖ మత వర్గాల సమగ్ర - సంఘటిత కృషి,

- 2 ఎకరాల సువిశాల ఈద్గా అవరణలో వేకువ 4.19 కే మొదలైన శ్రమదాన సంరంభం దాదాపు 2 గంటలు విజయవంతంగా కొనసాగడం,

మరి, ఈ నాటి స్వచ్చంద శ్రమదాన ఫలితం? స్వచ్చోద్యమ సందేశం?

1) గడ్డి దుబ్బులు పెరిగిన పిచ్చి మొక్కలు క్రమ్మిన - గజాల పొడవునా ఏవో తీగలు ప్రాకిన -ఎగుడుదిగుడుగా మారిన రెండెకరాల ఆవరణను 60 మంది ప్రయత్నించినా సరే - వారం రోజుల్లో గాని శుభ్రపరచలేరు! అలాంటిది ఆ కార్యకర్తలు 100 పనిగంటల్లో రెట్టించిన ఉత్సాహంతో సంపూర్ణంగా కాకున్నా పాక్షికంగా నైనా, సమగ్ర సుందరంగా కాకున్నా సాధ్యపడిన మేరకైనా శ్రమించి, ఎక్కువ భాగాన్ని మెరుగుపరచడం చిన్న విషయమా?

2) స్త్రీలు, వయోవృద్ధులు, ఏడెనిమిది మంది పిల్లలు పారల్తో, రైల్వే పారల్తో, కొడవళ్లతో ఎగుడు దిగుళ్లను తట్టుకొని, సరిజేసి, వేకువ చీకట్లో ఈ మాత్రం పాటు బడ్డారంటే చెమటల్తో బట్టలు తడిసి, దుమ్మంటించుకోవడమంటే - అది చల్లపల్లి పౌర సమాజానికి ఒక సకాల సముచిత - సందేశం కాదా?

3) అసలీ సమాజం ప్రస్తుతం ఎంత సుందర ముదనష్టంగా ఉన్నది? కాలేజీల్లో బురఖా వివాదాలు, బైట గుడుల - విగ్రహ విధ్వంసాలు మనుషుల్ని మనుషులుగా కాక మత, కుల, వర్గ, ప్రాంత ఓటర్లుగా చూసే దౌర్భాగ్యాలు... వీటన్నిటి కతీతంగా కాస్త మానవత్వమున్న కొందరు ఉన్న ఊరి స్వచ్ఛ- శుభ్ర - సౌందర్య బాధ్యతలు నిర్వర్తించేందుకు ముందుకొచ్చిన సంగతి ఎంత ఆదర్శం - అద్భుతం ఆవశ్యకం!

          అందుకే మేమంటున్నాం స్వచ్చోద్యమ చల్లపల్లి ఒక సామాజిక స్ఫూర్తి! మత కుల ప్రాంత - వర్గాల సంకుచితాన్ని అధిగమించిన ఒక సమైక్య శక్తి! ఆరేడు లక్షల ఊళ్లలో ప్రతి చోటా -  ప్రతి నోటా కనిపించాల్సిన - వినిపించాల్సిన ఉద్యమాను రక్తి!

          6.20 సమయంలో - కాఫీ కబుర్లకు ముందే - ఉస్మాన్ షరీఫ్ ముమ్మారు గ్రామ స్వచ్చ పరిశుభ్ర సౌందర్యాకాంక్షా నినాదాలిచ్చి, ఉద్యమ సారథి, ముస్లిం పెద్ద నసీమ్ ఘోరి చల్లపల్లి స్వచ్చోద్యమ పరిణామాన్ని అంచనాలు కట్టి, ఆనందించి, అభినందించి, ఆశీర్వదించి....

          రేపటి వేకువ మన శ్రమదాన బాధ్యత సైతం ఇదే దర్గా ఆవరణలో మరింత మంది - బహుశా 100 మందితో మరింత స్ఫూర్తిమంతంగా జరగాలని ఆశిద్దాం!

 

     సమర్పిస్తున్నాం ప్రణామం - 109

ముప్పేటగ - ముప్పూటల స్వచ్ఛ సమారాధనతో

ట్రస్టు వారొ స్వచ్చ కార్యకర్తలొ, రెస్క్యూదళమో

గ్రామంలో ఏదో ఒక ప్రాంతంలో కృషి చేసే

స్వచ్చ మాన్య చల్లపల్లి సాధకులకు ప్రణామం!

 

- నల్లూరి రామారావు

   ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు   

   28.04.2022