2423* వ రోజు, 2424* వ రోజు....           30-Apr-2022

ఒక్కసారికి పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎవ్వరమూ, ఎన్నటికీ వాడవద్దు.

46 గురు, 26 గురు కార్యకర్తల రెండునాళ్ళ కృషి – @2423*, @2424* వ రోజులు!

శుక్ర, శనివారాల (29, 30 తేదీలు) లోనిది పై సంఖ్య

1. ఈద్గా ఆవరణలో

2. సాగర్ టాకీస్ జంక్షన్ కు ఉత్తర (జాని, ఉస్మాన్ షరీఫ్ ల) వీధిలో స్వచ్చ కార్యకర్తల శ్రమదానం చోటు చేసుకున్నది.

            గురువారం నాటి అసంపూర్ణ పరిశుభ్రతా ప్రయత్నం శుక్రవారం ఉదయం కూడా కొనసాగి, 46 మంది విభిన్న కుల మత వర్గాలకు చెందిన ఐనా ఒకే గ్రామానికి సంబంధిచిన జీతభత్యాలెన్నడూ ఆశించని గ్రామ ప్రయోజనకర శ్రమదానం తప్ప ఇతర విషయాలు పట్టించుకోని స్త్రీ - బాల - వృద్దుల శ్రమ సన్నివేశం చల్లపల్లి శ్రీనగర్ లో జరిగింది.

            గడ్డి దుబ్బుల్ని పెళ్లగించడం, మామిడి చెట్ల పాదుల్ని సవరించడం, రాళ్ళు, పుల్లలు, పుడకలు డిప్పలతో ఏరడం, మళ్ళీ ఇవన్నీ ట్రాక్టర్ లోకి ఎక్కించి డంపింగ్ కేంద్రానికి ఎగుమతి చేయడం ఇలాంటి మొరటు, అనాగరిక పనులు అదీ వేకువ 4 - 6 గంటల మధ్యలో జరిగితే ఇది స్వచ్ఛ చల్లపల్లి కాబట్టి సరిపోయింది ఇంకెక్కడన్నా ఐతే ప్రజలు నమ్మే, హర్షించే సంగతంటారా?

            ఇక ముగింపు సమావేశంలో ముస్లిం పెద్ద నసీమ్ ఘోరీ స్వచ్చోద్యమానికి 2 వేల రూపాయలను చందా ఇవ్వడం, స్వచ్చ కార్యర్తల తరపున శాస్త్రి గారు ముస్లిం సోదరులకు కర్జూర పండ్ల పంపకం చేయడం, నారాయణరావు నగర్ కు చెందిన స్వచ్చ కార్యకర్త నబీ ఘోరి ముమ్మారు నినాదాలు ప్రకటించడం విశేషాలు.... 

**

            ఇక శనివారం సంగతంటారా? గత వారం రోజులుగా సాగర్ టాకీస్ ప్రాంతంలోనే స్వచ్ఛ సుందరీకరణ విహారం చేస్తున్న ధన్యులు బైపాస్ మార్గానికి ఉత్తరంగా మళ్ళీ ఆ 150 గజాల రోడ్డును, కొసరుగా ఒక చిన్న సందును - (కావడానికి చిన్న సందైనా పిచ్చి మొక్కల, రాళ్లు రప్పల, ప్లాస్టిక్ తుక్కుల వైభవంలో ఏం తక్కువ తినలేదు) - దాని నిష్ఠ దరిద్రాలు వదిలిపోయి ఇప్పుడు చూడబుద్దౌతున్నది.

            ఉస్మాన్ - జానీల రోడ్డు కూడా అంతే! లోతట్టున ఒక కాలనీ ఉన్నా, వాళ్లంతా దీనిమీద రాకపోకలు సాగిస్తున్నా ఎందుకో ఎవ్వరూ వీధి శుభ్రతకు పూనుకోరే! 'మరి ఇందరు స్వచ్ఛ కార్యకర్తలు ఉన్నదెందుకో?' అని బహుశా ఆ ప్రాంత నివాసుల అనుభవ పూర్వక ఆలోచన కాబోలు!

            నేటి శ్రమదాన ముగింపు సమయంలో - తన గ్రామ ఉమ్మడి సౌఖ్య స్వచ్ఛ సౌకర్య సౌందర్య సంపాదక నినాదాలు ముమ్మారు పలికింది గోళ్ళ విజయ కృష్ణ.

            రేపటి మన గ్రామ వీధి మెరుగుదల కోసం కలుసుకోవలసినదీ, శ్రమ వేడుకకు పాల్పడవలసిందీ బందరు మార్గంలోని ATM కేంద్రం దగ్గరే!

- నల్లూరి రామారావు

   ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు   

 

   30.04.2022