2425* వ రోజు....           01-May-2022

 ఒక్కసారికి పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎవ్వరమూ, ఎన్నటికీ వాడవద్దు.

36 మందితో ముఖ్య వీధి కాలుష్యాల తొలగింపు - @2425*

            ఆదివారం (1.5.22) నాటి వేకువ - సమయం (4.19 నుండి) 100 నిముషాలు నికర పని గంటలు 55 - గ్రామ ప్రముఖ బందరు మార్గంలో - 150 గజాల రద్దీ ప్రాంతం. అందులోనే 60 - 70 చిన్నా పెద్దా దుకాణాలు, బంకులు, చిరుతిళ్ల బళ్లు, పిండి మిల్లులు, హాటళ్లు, బ్యాంకులు, కూరల అంగళ్లు, మరీ ముఖ్యంగా నడక మరచిన మురుగు కాల్వలు- వీటన్నిటికీ పరిష్కారంగా - తమ ఊరిని 8 ఏళ్లుగా శ్రమదానంతో ఆశీర్వదిస్తున్న చిన్నా - పెద్దా స్వచ్ఛ కార్యకర్తలు!

            మరి - వాళ్ళు శాశ్వతంగా - దృఢంగా నిశ్చయించుకొన్నారు - ఈ చల్లపల్లి గ్రామం తమదనీ, దాని మంచి చెడ్డల - అంటే పరిశుభ్ర - స్వస్త - సౌందర్య - ఆహ్లాద, బాధ్యతలు తమవి కూడా అని! ఏమైనా సరే - అది మురికి కొట్టుకొని, దుమ్ము - ధూళి - దుర్గంధాలతో కళాహీనంగా - దేశంలోని ఐదారు లక్షల ఊళ్లలో చాలా వాటి లాగా ఉండకూడనేకూడదని! అందుకు వాళ్ల దగ్గర బోలెడంత ఓపిక, ప్రణాళికలు కూడ ఉన్నవనీ!

            ఇక వాటి ప్రకారం ఎండో - వానో - మంచో - తుఫానులో - వడగాలులో - వేటినీ లెక్కచేయడంలేదు. రోడ్లు గుంటలు పడితే - ఏ బాటలోనైనా పచ్చదనం తగ్గితే - అది సంతో, రైతు బజారో, బస్టాండో, శ్మశానమో, గుడులో, బడులో, ప్రభుత్వ కార్యాలయాలో, వీధుల మొండిగోడలో....ఏవైనా సరే - శుభ్రపరచక, సుందరీకరించక, చెట్లు నాటక, పూలు పూయించక, రోడ్లు మార్జిన్లనాక్రమించే వాళ్లకి నమస్కరించక, ఒక్కమాటలో చెప్పాలంటే - ఊరి మెరుగుదల కోసం తపస్సు చేయక వదలడం లేదు!

            2425* రోజుల బ్రహ్మాండమైన సదరు దినచర్య జరుగుతుంటే - పత్రికలూ సామాజిక కార్యకర్తలూ దాన్ని మెచ్చుతుంటే - నాబోటివాళ్ళు దినదినమూ, సవివరంగా ఉన్నదున్నట్లు వర్ణిస్తుంటే - 3 ½ లక్షల పని గంటల పిమ్మట కూడ ఆ 100 - 150 మంది కార్యకర్తల శ్రమలూ చెమటలూ తప్పడం లేదే!

            నేను చూశాను - 50 ఏళ్లుగా ఈ ఊరి స్వచ్ఛ - శుభ్రతల దీన చరిత్రని! చాల మందిమి గమనించాం కొందరు చైతన్యవంతులైన గ్రామస్తులు సైతం తమ ఊరి ఉమ్మడి బాధ్యతలో చేతులు కలపని వింతని!

            ఈ ఆదివారం వేకువ సైతం 30 మందికి పైగా శ్రమదాతలది అదేవరవడి! రోడ్ల దుమ్ము ఊడ్చి, ఇతర వ్యర్ధాల పనిబట్టి, డ్రైను వ్యర్దాల్ని తోడి, పేడ పెచ్చులు ఎత్తి, సంత వీధి మొదలు ఊరి ప్రధాన -  మూడు రోడ్ల కూడలి దాక తామున్న ఊరి మరికాస్త మెరుగుదల కోసం రకరకాల ప్రయత్నాలు! నాకైతే -  ఇందరు సామాజిక బాధ్యతతో ఉషోదయానికి  ముందే - చల్లగాలికి మొక్కలు తలలూపినంత సహజంగా - సమన్వయంగా పనిచేసుకుపోతున్న సుందర దృశ్యం పదేపదే గుర్తొస్తున్నది!

            ఇది మేడే! ప్రపంచ కార్మిక దినోత్సవం! వందేళ్లకు పైగా కష్టజీవుల చైతన్య ప్రతీకం! తమ ఊరిని చాతనైనంత సుందరీకరిస్తూ స్వచ్ఛ కార్యకర్తలు ఈ రోజును సార్థకం చేసినందుకు ధన్యవాదాలు!

            ఇది తూము వేంకటేశ్వరుని జన్మదినమట - అతడు ముమ్మారు గ్రామ స్వచ్చ శుభ్ర - సౌందర్య సంకల్ప నినాదాలు పలకడంతో నేటి మన శ్రమదానానికి స్వస్తి!

            బుధవారం నాటి వేకువ మనం సంతలో ఆగి కలిసి, ఈ శ్రమదానాన్ని కొనసాగిద్దాం!

 

       సమర్పిస్తున్నాం ప్రణామం - 110

ఎవరు మురుగును తోడినారో వీధి వీధిని ఊడ్చినారో

ఎన్ని శ్రమలకు ఓర్చినారో - స్వచ్ఛ సంస్కృతి తీర్చినారో

స్వచ్ఛ సుందరచల్లపల్లికి సార్థకత చేకూర్చినారో

అట్టి ధన్యుల ప్రశంసిస్తా అందజేస్తా నా ప్రణామం!

 

- నల్లూరి రామారావు

   ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు

   01.05.2022