2426* వ రోజు.......           02-May-2022

 ఒక్కసారికి పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎవ్వరమూ, ఎన్నటికీ వాడవద్దు.

2426* (సోమవారం) నాటి గ్రామ భద్రతా వీరుల కృషి.

            వెనకటికొక ముఖ్యమంత్రి సోమవారాన్ని పోలవారంగా మార్చుకొని, ప్రాధమ్య మిచ్చుకొని, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని తపనపడే వారట! చల్లపల్లి రెస్క్యూటీమ్ కూడ అంతే - సోమవారం నాటి తమ పని బరువు - సులువు ఆలోచించుకొని, రోడ్డు గుంటలు ముందా, 50 టన్నుల టిప్పర్ల వేగానికి పాడైన రహదార్ల మరమత్తు ముందా శ్మశానంలో మిగిలిపోయిన సౌకర్యాలు తక్షణ కర్తవ్యమా - అని తేల్చుకొని, వాలవలసిన చోట వాలిపోతుంటారు.

            ఈ సోమవారమైతే చివరిదే అంటే దహన వాటికల దగ్గర వీడ్కోలు తదితర వాహనాల పార్కింగ్ స్తలం మెరుగుదలే వాళ్ల ఎంపిక! అందుకోసం 4:20 కే 4+1+1 మంది కార్యకర్తలు తరిగోపుల ప్రాంగణం (C/o చిల్లలవాగు ఉత్తర గట్టు) దగ్గర ప్రత్యక్షం.

            వాళ్లది అదొక పిచ్చో వ్యసనమో కాకపోతే అంత చీకట్లో శ్మశానంతో అనుబంధమేమిటి?  - ఇంత అందమైన, అద్భుతమైన, మళ్లీ మళ్ళీ చూడాలనిపించే మహాప్రస్థాన రుద్ర భూమిలో ఇంకా ఏం మెరుగుపరచాలని?

            అంతకుముందే పార్కింగ్ స్తలం చదునులై పోయినా, ఈ వేకువ కూడ దాన్ని తూర్పు దిశగా మరికొన్ని అడుగులు పెంచారు. అందుగాను ఇంకొన్ని తారు పెచ్చుల్నీ - రద్దునీ ట్రక్కులో నింపుకొని తెచ్చి, కార్చి, సర్దుతున్న కార్యకర్తల పనిని సామాజిక మాధ్యమంలోని దృశ్య శ్రవణం (వీడియో)లో పరిశీలించగలరు.

            తమ పని పూర్తి చేసిన ఆనందాన్ని 6.20 సమయంలో మాలెంపాటి అంజయ్యముమ్మారు గ్రామ స్వచ్చ శుభ్ర సౌందర్య నినాదాలుగా ప్రకటించారు.

ఒక ముఖ్య గమనిక:

            స్వచ్చోద్యమకారులైన మన డాక్టర్లిద్దరూ రెండు రోజుల పాటు పొరుగు రాష్ట్రంలోని వనపర్తిలో గడిపిన, జరిపిన మనలాంటి/ మనను మించిన 50 మంది సామాజిక సేవాతత్పరుల అనుభవాలను కలబోసుకొన్న సంఘటనను గూర్చి - బుధవారం ఉదయం మన వైద్యుల మాటల్లోనే తెలుసుకొందాం.

 

    సమర్పిస్తున్నాం ప్రణామం - 111

ఆ శ్రమ స్వార్థం లేనిది - అందరి నుద్దేశించిన

దది సమష్టిలోనె వ్యష్టి స్వస్తత కలదని నమ్మిన

దది సమస్త కాలాలకు అన్వయించు కోదగినది

స్వచ్చోద్యమ చల్లపల్లి కందుకె మా ప్రణామం!

 

- నల్లూరి రామారావు

   ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు

   02.05.2022