1907 * వ రోజు....           31-Jan-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1907* వ నాటి శ్రమదాన వేడుక.

 గతవారం రోజులుగా చల్లపల్లి తూర్పు చివర నుండి- పడమర దిశలోని పోతురాజు గుడి దాక-2 ½ కి.మీ.  దూరం సాగిన స్వచ్చోద్యమ ప్రస్థానం ఈ నాటి వేకువ 4.01 కి నాగాయలంక బాటలోని శ్యామలాంబ గుడి దగ్గర మొదలై 6.15 దాక జరిగింది. హాజరైనది 30 మంది.

 

ఇందులో ఆరేడుగురు బస్టాండులోని గోడలను గోకి, కడిగి, ప్రైమరు పూయడంలోను, నిన్న ప్రైమరు పూసిన చోట రంగులద్దడంలోను తీరిక లేకుండ గడిపారు. కోనేరు హంపి గారి “జలసుధ”, తన్మూలంగా బస్ ప్రాంగణం ఇప్పుడు మరింత అందంగా కన్పిస్తున్నవంటే- అది సుందరీకరణ బృందం యొక్క 5 రోజుల – 50 గంటల కృషి ఫలితమే! ( అసలు ఈ బస్ ప్రాంగణమంతా మరొక మారు రంగుల హరివిల్లుగా మార్చి చూపాలని ఈ ముఠా నాయకురాలి అత్యాశ!)

 

నాగాయలంక దారిలో నిన్నటి తరువాయిగా కొనసాగిన 20 మంది కార్యకర్తల పట్టుదల మరొకమారు పోతురాజు గుడి దాక, ప్రదర్శితమైంది. దుమ్ము, డ్రైనేజీ ల వ్యర్ధాలు పోగేయడం కన్న రోడ్ల అంచున రెండడుగుల మేర-నాలుగంగుళాల మందాన పేరుకొని, చట్టుబడిన ఇసుక రాళ్లు- మట్టి మిశ్రమాలను పెకలించి, గుంటల్ని చదును చేయడమే కష్టమైన పని!

 

వేకువ 5.00 కే టీ- కాఫీలను సేవిస్తూ డజన్ల కొద్దీ గ్రామస్తులు కనిపించారు గాని, వారిలో ఎక్కువ మంది ఈ స్వచ్చ కార్యకర్తల కృషి నొక చోద్యంగా చూసేకంటే- ఒకరిద్దరైన తమ ఈ గ్రామ శుభ్రతా ప్రయత్నంలో పాల్గొంటే ఎంత బాగుంటుందో గదా!   

 

ఈ వీధిలోని నాలుగు దేవాలయాలకు పోయే భక్తులు కూడ – ఈ పవిత్ర దేవాలయాలను, పరిసరాలను శుభ్రంగా- అందంగా ఉంచే ప్రయత్నం చేయడం కూడ అవసరమే.

 

వివేకానంద కళాశాల యువ విద్యార్ధులు నిన్నటి నుండి పాగోలు మార్గం ఇరువైపులా చేస్తున్న స్వచ్చ-శుభ్ర సుందరీకరణం అభినందనీయం, అన్ని విద్యా సంస్థలకూ అనుసరణీయం! నిన్నటి వీరి కృషితో ఉత్పన్నమైన రకరకాల వ్యర్ధాలను ఈ వేకువన “ చల్లపల్లి సంరక్షణ దళం” చెత్త కేంద్రానికి తరలించింది.

 

రాళ్లు, మట్టి, ఇసుక వ్యర్ధాలను అవసరమైన చోట్ల- గ్రామంలోని దారుల ప్రక్కన సర్దడం కూడ ఈ దళం పనే!

 

ఈ నాటి 6.40 నిముషాలకు జరిగిన దైనందిన స్వచ్చోద్యమ సమీక్షా సమావేశంలో:

 

- బస్ ప్రాంగణాన్ని ఇప్పటికన్న మరింత శోభాయమానంగా చేసేందుకు అధిక వ్యయ ప్రయాసలతో ప్రతి గోడకూ అందమైన రంగులు వేసే ఆలోచన-

 

నిన్న, నేడు ఉద్యోగ విరమణ చేస్తున్న ఇద్దరు కార్యకర్తలను మాలెంపాటి, ప్రాతూరి శాస్త్రి వలె పూర్తి కాల బాధ్యులుగా ఉండాలనే అభ్యర్ధన-

 

డా. టి. పద్మావతి గారు గత ఐదారు రోజుల నుండి గ్రామ స్వచ్చంద శ్రమదానంలో పాల్గొనలేని నిస్సాహయతను వివరించి, ముమ్మారు ప్రకటించిన చల్లపల్లి స్వచ్చ సంకల్ప నినాదాలతో 6.50 నిముషాలకు నేటి మన స్వచ్చ కార్యక్రమం పరిపూర్తి.

 

రేపటి మన స్వచ్చంద శ్రమదానం పోతురాజు గుడి- పడమర వీధి మలుపు నుండి మొదలు పెడదాం! దీనికోసం నాగాయలంక రోడ్డు లో స్వచ్చ టాయిలెట్ల వద్ద కలుసుకొందాం.

 

          సగం మందికి పట్టకున్నవి.

ఉన్న జీవన మార్గములలో ఉత్తమం అనిపించుకొన్నవి

శరీర స్వస్తతతొ బాటుగ మనః తృప్తి లభించునట్టివి

సగం గ్రామస్తులకు ఎందుకొ స్వచ్చ సేవలు పట్టకున్నవి

భావ సంపద లోపమో-ఒక వల్లమాలిన బద్దకమొ అది!

 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

శుక్రవారం – 31/01/2020

చల్లపల్లి.