2428* వ రోజు.....           04-May-2022

 ఒక్కసారికి పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎవ్వరమూ, ఎన్నటికీ వాడవద్దు.

 

2428* (బుధవారం) వ నాటి సంత వంతు 22 మందిది!

 

అందులో తొమ్మిది మందైతే మరీ 4.18 కే వార సంత బాగు చేసేందుకు ఉద్యుక్తులై పోయారు. మరో 13 మంది నిముష క్రమాన చేతులు కలిపారు. ఇక అది మొదలు 100 నిముషాలు వాళ్లు రకరకాల కాలుష్యాల మీద చేసిన తిరుగుబాటుకు నాతో బాటు స్తంభించిన వాయు దేవుడు, చీకటి వెలుతురులు 20 మందివి. చెమటకు తడిసిన బట్టలు, పదేపదే త్రాగిన మంచి నీళ్లు, 6.00 సమయానికి సంతలో కనిపించిన కశ్మలాల గుట్టలు.... కూడా సాక్ష్యాలే!

 

ఆ సంతేమో ఏ రెండెకరాల మేరకో పెద్దది! కార్యకర్తలేమో పట్టుమని, రెండు పదుల మంది! పెరిగిన సన్నాసి పిచ్చి కంప, సోమవారం కూరల అవశేషాలు, ఆకులలమలు .... అసలక్కడ ఏం తక్కువని? వారం రోజుల పైగా ఈ సంత వీధి పరిసరాల్లోనే గదా స్వచ్చ కార్యకర్తల కృషి? ఇక్కడ పోలీసు సోదరులు సహా చాలమందిని బొట్టు పెట్టకుండా  ముందు రోజే కార్యకర్తలు పిలుస్తూనే ఉన్నారు కదా! మరి ఏది తగిన స్పందన ?

 

వందల మంది సంత వినియోగ దారుల్ని వదిలేద్దాం- 60-70 -80 మంది చిన్న- పెద్ద వ్యాపారులు, ఆశీలుదారులు అందరూ కాకున్నా అందుబాటులో ఉన్న- అవకాశమున్న కొందరైనా స్వచ్చ కార్యకర్తలతో వచ్చి కలవాలా వద్దా? వీధుల్ని- డ్రైయినుల్ని సంతల్ని కలుషితం చేయడం మా వంతు, శుభ్ర పరచడం పంచాయతీదో స్వచ్చ కార్యకర్తలదో వంతు అనే ధోరణి ఇంకా ఎన్నాళ్లు?

 

మనం చాల మార్లు ప్రస్తావించు కొన్నట్లు చల్లపల్లి స్వచ్చ సైనికులు నిష్కామ కర్ములూ, పుట్టి పెరిగి, బ్రతుకుతున్న తమ ఊరి పట్ల సమాజం పట్ల  పూర్తిబాధ్యులూ కనుకనే- వాళ్లకు పంచాయతీ గాని, రాజకీయులు గాని, ఊరి పెద్దలు, అధికారులు గాని కొంత సహకరించ బట్టే- ఇది స్వచ్చ-శుభ్ర-సుందర చల్లపల్లి గా నిలుస్తున్నది!

 

వాళ్ల శ్రమ జీవన తత్త్వాన్ని, అందు మూలంగా నేటి సంతలో 6.00 తరువాత కనిపించిన ఫలితాన్ని పాఠకులెవరైనా జై స్వచ్చ చల్లపల్లి సైన్యంవాట్సాప్ లో పరిశీలించండి.

 

నేటి గ్రామ పరిశుభ్ర- సౌందర్య స్ఫోరక నినాదాలను ముమ్మారు దబాయించినదీ, తన పుట్టిన రోజు గుర్తుగా మనకోసం మనంట్రస్టుకు 1000/- విరాళమిచ్చినదీ దేసు మాధురి గారు!

 

చల్లపల్లి లో నిన్న, మొన్నటి ఒకటి రెండు సంఘటనలను వివరించాలి: అది ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ వ్యాప్త ఆందోళనకర వాతావరణంలో ఆదర్శమూ అవసరమూ కూడ! గత వారంలో చల్లపల్లి శ్రీ నగర్ లోని ముస్లిం సమాజ సామూహిక ప్రార్థనా స్థలాన్ని స్వచ్చ కార్యకర్తలు , నమాజు కారులూ కలిసి రెండు రోజుల పాటు శుభ్ర పరిచారు. నిన్న మన ఉస్మాన్ షరీఫ్ తదితరులు అక్కడ ఐదారొందల మంది తో నమాజు నిర్వహించి, చిక్కని, కమ్మని మజ్జిగను ప్లాస్టిక్ గ్లాసులలో కాకుండా స్టీలు గ్లాసులలో , అందరికీ పంచడమూ, ముస్లిమేతర-హైందవ యువకులు కార్యకర్తలుగా పని చేయడమూ, రోడ్ల మీద యాచక- అనాధ ప్రజలకు కూడ ఆ పంపిణీ జరగడమూ విశేషం!

 

రెండో సంఘటన గత బుధవారం నాటిది- మోపిదేవి వార్పు దగ్గరి తన నివాసంలో స్వచ్చ కార్యకర్త శివబాబు ఆరేడు వందల మందికి తన తల్లి గారి సంస్మరణ గా పెట్టిన భోజనాలు- అది హరిత పద్ధతిగా నిర్వహించడం!

 

రేపటి వేకువ సైతం శుభ్ర-సుందరీకరణ కోసం మనకు సవాలు విసురుతున్నది సంత అంతర్భాగమే ! అక్కడే అందరం కలుద్దాం!

   

సమర్పిస్తున్నాం ప్రణామం 112

 

కల్లబొల్లి కబుర్లతో కాల క్షేపము లెందుకు?

మన విలువగు గంట టైము మన ఊరికి వెచ్చిస్తే

మనకూ, మన గ్రామానికి మంచి జరుగ వచ్చునే

అను సందేశం ఇచ్చిన అందరికీ ప్రణామం!

 

- నల్లూరి రామారావు,

   ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు,

   స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త   

   04.05.2022.