2429* వ రోజు....           05-May-2022

 ఒక్కసారికి పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎవ్వరమూ, ఎన్నటికీ వాడవద్దు.

 

గురువారం(05.05.2022) వేకువ మరీ 4.14 కే –  14 మందీ, మొత్తం ముప్పదిన్నొక్క మందీ గురి పెట్టింది సంతలో తూర్పు వైపున్న ఎగుడు దిగుడు చిట్టడవి అస్తవ్యస్తాల మీదే! అక్కణ్ణుండి 112 నిముషాల పాటు- అందరి నేటి శ్రమ సమయం సుమారు 58 పని గంటలు! వాళ్లు పడిన ప్రయాసనూ, క్రక్కిన చెమటనూ, అందుకోగలిగిన గ్రామస్తులుంటే పంచిన సామాజిక స్ఫూర్తినీ కొలిచేందుకు నా దగ్గర కొలబద్దలూ లేవు- వివరించేందుకు సరిపడా సరైన మాటలూ లేవు!

 

వందల- వేల మంది వివిధ గ్రామస్తులు వినియోగించే ఈ వార సంత ఇంకా ఇంకా శుభ్రంగా అందంగా ఆహ్లాదకరంగా రూపొందించేందుకు ఈ స్వచ్చ కార్యకర్తలు గతంలోనూ, ఈ వేకువా చేయని ప్రయత్నం మేముంది!  దాసరి స్వర్ణలత రామ మోహనులు దీని మెరుగుదల కోసం ఎంత ఖర్చు చేశారో దాసరి స్నేహ –V. నాగేంద్రు లెన్ని లక్షలు త్యాగం చేశారో- స్వచ్చ కార్యకర్తలీ సంత రైతు బజార్ల పరిసరాలలో ఎన్ని నెలలు- ఎన్ని వేల గంటలు శ్రమించారో

 

వాటి వినిమయ దారులు, పరిసర నివాసులు గుర్తిస్తే, ఆ స్ఫూర్తి నందుకోగలిగితే  చాలు- దాతల, నిత్య శ్రమదాతల ఉద్దేశాలు నెరవేరినట్లే! కార్యకర్తలకు కాదు గాని, నాకు అప్పుడప్పుడూ వచ్చే ధర్మ సందేహం ఒక్కటే- సంత, రైతు బజారు, ఊరి ప్రధాన వీధుల, మురుగు కాల్వల, పంట కాల్వ గట్ల, కర్మ భవనాల, శ్మశానాల, రహదార్ల, రోడ్ల గుంటల, ఇంకా ఊరి పచ్చదనాల.....  ప్రతి సమస్యా, అటు పంచాయతీకో ఇటు 100/150 మంది స్వచ్చ కార్యకర్తలకో మాత్రమే పరిమితమా? పంచాయతీకి పన్ను కట్టితేనో ఎన్నికలప్పుడు (డబ్బు తీసుకొనో, తీసుకోకనో) ఓట్లేస్తేనో ప్రజల బాధ్యత తీరినట్లేనా?

 

తక్కిన రోజుల శ్రమదానం అట్లా ఉంచితే-నేటి వేకువ కార్యకర్తల కాయకష్టం, వాతావరణ సంక్లిష్టం మరీ గడ్డుగా ఉన్నాయి!

 

1) ఎప్పటి నుండో సంత తూర్పు షెడ్ల లోనూ, ఆరు బయటా పడేసి, తుప్పు పట్టిన రకరకాల పాతిక- ముప్ఫై పంచాయతీ వారి పనికిరాని వాహనాల్ని పెకలించి, మోసి, ఒక చోట సర్దిన పనిని చూసినా-

 

2) ఉపయోగంలో లేని మత్స్య విక్రయ దుకాణాల ఎదుట ఏడెనిమిది మంది సుందరీకర్తల పరిశ్రమను గమనించినా-

 

3) కత్తులతో గడ్డీ, పిచ్చి, ముళ్ల పొదల్ని నరికే- దంతెలతో, చీపుళ్లతో వాటిని ప్రోగులు చేసే- ట్రక్కులోకి ఎక్కించే సన్నివేశాల్ని పరిశీలించినా-

 

4) ఈ గ్రామంలో ఎనిమిదేళ్లుగా నిరాటంకంగా జరుగుతున్న అరుదైన- నిస్వార్థ శ్రమ జీవన సౌందర్యాన్ని మొత్తంగా అంచనా కట్టినా-

 

నాబోటి వాళ్ళకు ఉత్తేజం కలగదా! పద్యాలూ, పాటలూ ఒద్దంటున్నా తట్టవా?

 

నేటి శ్రమ వైభవానికి మచ్చుగా ఒక చిన్న సన్నివేశాన్ని వాట్సాప్ లో గమనించండి. ఒక పెద్ద సిమెంటు  ఒర వలయం, అందులో పెరిగిన గడ్డి, షరా మామూలుగా అందులోనే ప్లాస్టిక్ తుక్కులూ, పగిలిన ఖాళీ మద్యం సీసాలూ, వాటిని తొలగించే పనిలో నిమగ్నమై, బట్టలు చెమటతో ముద్దయిన ఒక సీనియర్ మహిళా!  స్వచ్చోద్యమ చల్లపల్లికి ఈ  దృశ్యమే ఒక బ్రాండు!

 

నిన్న మొన్నా రా వీలుపడక, ఈ ఉదయం సదరు  శ్రమదాన బకాయిని కూడ చెల్లించిన ఒక BSNL నరసింహారావు కసిగా ముమ్మారు హుంకరించిన గ్రామ స్వచ్చ-పరిశుభ్ర- సౌందర్య సంకల్ప నినాదాలతోనూ, ఎంతగా ప్రయత్నించినా  పంచాయతీ పరంగా తాననుకొన్న ఫలితాలు సాధించలేకపోతున్న సర్పంచమ్మ ఆవేదనతోను 6.40 కి నేటి స్వచ్చంద కార్యక్రమానికి ముగింపు!

 

రేపటి వేకువ కూడ మన కర్మ క్షేత్రం సంతలోనే!

 

సమర్పిస్తున్నాం ప్రణామం 113

 

స్వచ్చోద్యమ కారుల ఈ స్వగ్రామ సుదీర్ఘ సేవ

వినోదమో-వివేకమో వినమ్రమో విలాసమో-

సామాజిక ఋణ విముక్తి సాధనమో కావచ్చును

అది ఆదర్శమె ఎవరికైన- అందుకె మా ప్రణామం!

 

- నల్లూరి రామారావు,

   ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు,

   స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త   

   05.05.2022.