2431* వ రోజు.......           07-May-2022

 ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎవ్వరమూ, ఎప్పటికీ వాడవద్దని ప్రతినబూనుదాం!

శనివారం (07.05.2022) 2431*వ నాటి శ్రమదాన వేడుక!

            వేకువజాము 4.15 ని.లకు మొదలై మొత్తం 27 మందితో జరిగిన స్వచ్చ సేవలు దగ్గరగా గమనించిన వారికీ చాలా ఆసక్తికరంగాను, ఆశ్చర్యంగాను ఉంటాయి. 4 రోజుల క్రితం మనం చూసిన సంత ప్రదేశం ఈ రోజు నిజంగా ఇదేనా అనిపిస్తుంది. గడ్డి కోసిన పిమ్మట ఎత్తు పల్లాలు దిబ్బలుగా ఉన్న ప్రదేశాన్ని సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి గారి అనుమతితో ట్రాక్టరుతో దున్నించగా ఈ రోజు ఆ ప్రదేశమంతా గొర్రులతో లాగి సమానంగా సంత వ్యాపారులకు అనువుగా తీర్చిదిద్దటం నిజంగా అబ్బురపరచే విషయమే. ఆ దున్నిన నేలలో మట్టి గడ్డలతో చెత్తనంతా జల్లెడపట్టినట్లు తీసి గంపల కెత్తి ట్రాక్టరులో లోడు చెయ్యటం.

            పంచాయతీ వారు ఏర్పాటు చేసిన చేపల మార్కెట్ సముదాయాన్ని సుందరీకరణ బృందం 4 రోజుల పాటు వారి నైపుణ్యంతో ఆ ప్రదేశమంతా సుందరంగా, అద్దంలా మెరిపించిన తీరు చూస్తే  గ్రామ ప్రధాన రహదారుల ప్రక్కనే అభ్యంతరకరంగా ఉన్న చేపల మార్కెట్లు ఈ రోజు నుండే సంతలోని చేపల మార్కెట్ మారుస్తారేమో అన్న ఆశ కలిగింది.

            8 ఏళ్ల స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమం చల్లపల్లి ప్రజలకు, స్వచ్చంద సేవలను ప్రశంసించడం, అభినందించడం నేర్పింది కానీ ఆ సేవలో మరికొంత మంది భాగస్తులవడం నేర్పలేకపోయిందనే బాధ కలుగుతుంది.

            ఏది ఏమైనప్పటికీ 3 రోజుల పాటు స్వచ్చ కార్యకర్తల స్వేద జలంతో తడిసి పునీతమైన సంత ప్రాంగణం క్రయ విక్రయాలకు సౌకర్యంగా, చూపరులకు సుందరంగా తీర్చిదిద్దబడింది.

            స్వచ్చ కార్యకర్త కోడూరు వేంకటేశ్వరరావు గారు ప్రతి నెలా క్రమం తప్పకుండా ఇచ్చే 520/- విరాళాన్ని మేనేజింగ్ ట్రస్టీ గారికి అందజేయడం విశేషం.

            6.15 కి కాఫీ సేవనానంతరం గ్రామ స్వచ్చ శుభ్ర- సౌందర్య నినాదాలను ముమ్మారు ఎలుగెత్తి చాటినది రిటైర్డ్ VRO వీర సింహుడు గారు.

            రేపటి వేకువ మన స్వచ్చ సేవ మెయిన్ రోడ్డు లోని హీరో షోరూమ్ వద్ద.

అపరిశుభ్రత పై అలుపెరుగని పోరాటం - 8 వసంతాల స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమం.   

           

నందేటి శ్రీనివాస రావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త

 

            ఒక తీపి పాట

ఔను సుమా! నేనన్నది ఔను నిజం! ఔను నిజం!

చల్లపల్లి స్వచ్చోద్యమ సంరంభం తీపి నిజం!

జన జాగృతి పెరగాలని-శ్రమ సంస్కృతి విరియాలని

గ్రామస్తులు స్వచ్చ కార్యకర్తలుగా మారాలని

స్వస్తతకై నిత్యం శ్రమదానం చేస్తుండాలని

దేశానికి చల్లపల్లె దిక్సూచిగ నిలవాలని

అది    కష్టంగా కాక బాగ ఇష్టంగా జరగాలని

ఈ ఉద్యమ రథసారథి స్వప్నం ఋజువవ్వాలని ....

ఔను సుమా నిజం - నిజం! నేనన్నది నిజం - నిజం!

 

నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త

ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు

07.05.2022.