2432* వ రోజు.......           08-May-2022

 ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎవ్వరమూ, ఎప్పటికీ వాడమని ప్రతినబూనుదాం!

2432*వ నాటి స్వచ్చ సుందరోద్యమ చల్లపల్లి!

 

            చిన్నా-పెద్దా, ఆడా-మగా, పండిత-పామర స్వచ్చంద స్వగ్రామ సేవకులు 38 మంది వేకువ 4.19-6.15 నడిమి కాలం! బెజవాడ-బందరు, అవనిగడ్డ రోడ్ల కూడలి నుండి RTC బస్ ప్రాంగణం దాక- అక్కడ దుమ్మే లేచిందో, కార్యకర్తల చెమట శరీరాల కంటుకొని మంచి పేస్టులుగా నిలిచిందో- ఆ రెండు గంటల్లో ఉక్కకు శ్రమదాతలెన్ని  సీసాల మంచినీరు త్రాగారో – వాళ్లలో ఎవరు, ఎందుకు, ఏ డ్రైన్లు శుభ్ర పరిచారో- ఈ అర కిలో మీటరు సువిశాల రహదారి 6.15 తరువాత చూసుకొంటే- ఏ కార్యకర్త మనసు ఎంతగా నిండి పోయిందో పట్టించుకొన్న గ్రామస్తులెందరు? స్వచ్చ సైనికుల శ్రమ స్ఫూర్తికి ఖరీదు కట్టే షరాబు లెవ్వరు?

 

            2 గంటల వీధి శుభ్రతా పరిశ్రమలో నడక సంఘ మిత్రుల విన్యాసాల్ని ప్రత్యక్షంగా వీక్షించిన అదృష్టం నాది! ఎనిమిదేళ్ల బాల సైనికుడి ఉత్సాహాన్నీ,  84 ఏళ్ల వైద్యుని ప్రయత్నాన్నీ – అవి సొంత లాభం కోసం కాక- గ్రామాభ్యుదయ పరంగా జరిగిన ప్రత్యేకతను మెచ్చుకోకుంటే ఎలా?

 

            ప్రత్యక్షంగా వచ్చి – పాల్గొని-సామూహిక సామాజిక శ్రమ సౌందర్యాన్ని గమనించలేని చల్లపల్లి సోదరులు వాట్సాప్ మాధ్యమంలోనైనా ఈ రెండు మూడు సచిత్ర సన్నివేశాల్ని గమనించవచ్చు:

 

1. ఎక్కడో బెంగళూరులో ఉంటూ తాత రాజారావు గారి దగ్గర కొచ్చిన చిన్నారి కృతిక్ సాయి తేజ్  చీపురుతో ఊడ్చిన, తన కిడ్డీ బ్యాంకులో దాచుకొన్న డబ్బు- 1419/- ను స్వచ్చోద్యమార్పణం చేస్తున్న దృశ్యాలు,

 

2. క్షణం తీరిక లేని ఇంటి పనుల్ని తెముల్చుకొని శ్రమదాతలతో మమేకమైన ఒక నడిమి తరగతి – నడిమి వయస్కురాలైన గృహిణి మురుగు గుంట వ్యర్థాల్ని తొలగిస్తున్న సన్నివేశం,

 

3. కొందరు ఉషఃకాల నడక మిత్రులు గోకుడు పారలతో రోడ్డు మార్జిన్లను గోకి, ఎండు-పచ్చి గడ్డినీ, దుమ్మునూ ఇసుకనూ గుట్టలు చేస్తున్న శ్రమనూ,

 

4. తక్కిన వట్లా ఉంచి, సుందరీకర్తల చెమట ధారల సంగతట్లా వదిలేసి, 6.20 సమయంలో నేటి శుభ్ర-సుందరీకృత సుమనోహర వీధినీ...

 

            పరిశీలిస్తే- కాస్త తీరికగా ఆలోచిస్తే- చల్లపల్లి స్వచ్చోద్యమ కారణమూ, చరిత్రా, ప్రత్యేకతా, డజన్ల కొద్దీ గ్రామాలకు పంచుతున్న స్ఫూర్తీ వగైరాలన్నీ ఒక రీలు లాగా కంటి ముందు కనిపించవా?(అలా కనిపించని వాళ్లను- వాళ్లు నవయువకులైనా సరే- మహాకవి శ్రీ శ్రీ “ ఎముకలు క్రుళ్లిన-వయస్సు మళ్లిన సోమరులారా....”! ఆని సంబోధించాడు!)

 

            6.25-6.40 మధ్య – ఆ 15 నిముషాల 4 విశేషాలేమంటే:

 

- దాసరి రామ కృష్ణ ప్రసాదు గారి గత వారాంత వనపర్తి యాత్రానుభవాలు, అక్కడి మారుమూల పల్లెలు కూడ స్వచ్చ సుందర చల్లపల్లి తో పోటీ వస్తున్న సంగతి,

 

- మాలెంపాటి గోపాల కృష్ణయ్య గారి క్రమం తప్పని నెల వారీ చందా -2000/-,

 

- చల్లపల్లి శ్రమదాన వైభవానికి సాంస్కృతిక రూపాలుగా కాంపౌండర్ శేషు, నందేటి శ్రీనివాసులు ఉత్తేజకరంగా పాడిన 2-3 పాటలూ,

 

- మన శ్రమదాన బాధ్యతను ముమ్మార్లు నినదించి, తన అనుభవాన్ని పలవరించిన విశ్రాంత బ్యాంకు మేనేజర్ ఆరజా రాజేంద్ర ప్రసాదు గారు..  

 

సోమ, మంగళ వారాల రెస్క్యూ టీం వారి ప్రణాళిక నాకు తెలియదు గాని, మనం బుధవారం వేకువ(09.05.2022)కలిసి శ్రమించదగు చోటు మాత్రం సంత మార్కెట్ వద్ద!

 

       ఈ సుందర స్వచ్ఛ ఉద్యమం

 

ఒక సుందర స్వచ్ఛ ఉద్యమం ఒనగూర్చిన ఫలితాలెన్నో

సామూహిక శ్రమదానంతో సమకూడిన మేలదేమిటో

                                    ఒక సుందర స్వచ్ఛ ఉద్యమం ॥

 

ఉన్న ఊరి స్వస్తత కోసం స్వచ్ఛ సైనికుల తపస్సు లెన్నో

ప్రతి వేకువ గ్రామ వీధిలో పారిశుద్ధ్య ప్రయత్నమెంతో

ఎండల - వానల - మంచు - తుఫానుల నెదిరించిన ఘట్టాలెన్నో

శ్మశానమున - చెత్త కేంద్రమున - సాగించిన సమరములెన్నో

                                      ఒక సుందర స్వచ్ఛ ఉద్యమం ॥

 

స్వచ్చోద్యమ నేపథ్యంగా సాగిన మేధోమధనమ్ములు

రెండొ - మూడొ లక్షల గంటల శ్రమజీవన సన్నివేశములు

మురుగు కాలువలు, రహదారులపై మొగ్గ తొడిగిన హరిత సంపదలు

పొరుగూళ్లకు - రాష్ట్రమంతటికి పోటెత్తిన స్ఫూర్తి మంత్రములు

                        ఒక సుందర స్వచ్ఛ ఉద్యమం- సాధించిన ఫలితాలెన్నో ॥

 

ఏ ఉద్యమ మెన్నాళ్ళుందో ఏ స్వార్ధం నెరవేరిందో

గుర్తింపులు గొప్పలు మెప్పులు ఇవి కావోయ్ చరిత్రకర్ధం

ఏ ఉద్యమమే సమయంలో జనహితమేం సాధించిందో

స్వచ్చోద్యమ చల్లపల్లిలో సాధించిన పరిణతి ఏదో...

                  మా సుందర స్వచ్ఛ ఉద్యమం -సాధించిన ఫలితాలెన్నో॥

 

నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త,

ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు

08.05.2022.