2433* వ రోజు....           13-May-2022

 ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎవ్వరమూ, ఎప్పటికీ వాడమని ప్రతినబూనుదాం!

ఇది 2433* వ నాటి గ్రామ సామాజిక బాధ్యతా పరిపూర్తి!

          శుక్రవారం (13.5.22) వేకువ 4.16 నిముషాల సమయం. 25 వేల మంది గ్రామస్తుల్లో మూడు వంతుల మందిని నిద్రా దేవత లాలిస్తున్న ప్రశాంత కాలం! సంత వీధిలో - సినిమా హాలు దక్షిణంగా 20 - 25 సెంట్ల నీళ్ల టాంకుల ప్రదేశంలో తమ పౌర బాధ్యతలు మరవని 21 మంది 2 గంటల పాటు ఊరి మేలు కోసం చేసిన ప్రయత్నం!

          అసలే చీకటి స్థలం అదెంత మాత్రం కానే కాదు సమతల ప్రదేశం! పైగా - ఎందుకో, ఎవరో త్రవ్విన గుంటల మయం - మొత్తం మీద డబ్బులిచ్చినా, ఇష్టపడి ఎవ్వరూ చేయని కష్టకార్యం - మరి అక్కడనే ఈ స్వచ్చ కార్యకర్తల శ్రమదానం! సుదీర్ఘకాల ఈ గ్రామ పరిచర్య కాదు గదా స్వార్థపూరితం! అందుకే గదా చాల మంది సామాజిక వేత్తల దృష్టిలో ఇదొక ఆదర్శ స్ఫూర్తిదాయకం! ఈ ఒక్క కారణంగానే స్వచ్చ సైనికులకు నా పునః పునరభివందనం!

          ఎనిమిదేళ్ల చల్లపల్లి స్వచ్చంద శ్రమదానం తరువాత కూడ తమ గ్రామాభ్యుదయ శ్రమదానంలో పాలు పంచుకోని అత్యధిక గ్రామస్తుల పట్ల ఏదో నా బోటి ఒకరిద్దరికి కొంత అసంతృప్తి ఉంటే ఉండవచ్చు గాని - స్ధూలంగా కార్యకర్తల దృక్పథం ఏమిటి? “ఏమో ఎప్పటికైనా గుర్రం గాల్లో ఎగరదా? మరో 8 ఏళ్లకో 16 ఏళ్లకో తమ ఊరి జనంలో ప్రతిరోజూ ఏ 500 మందో శ్రమదానం వైపు అడుగువేయరా....అనేదే మెజారిటీ స్వచ్చ కార్యకర్తల నమ్మకం! ఓ సమంజస సానుకూల సదాలోచనమా - వర్థిల్లు వర్థిల్లు!

          శంకర శాస్త్రి గారి కెమేరా కన్ను సాక్షిగా నేటి శ్రమదాన విశేషాలివి :

- కత్తుల వారి పనితనానికి అదృశ్యమైపోయిన ఎన్నో పిచ్చి చెట్లు, సమూలంగా కొందరు పీకేసిన దోమల పెంపక కంపలు, వాళ్లే పీకిన, చెక్కిన గడ్డీ

- ఏరేసిన ఖాళీ సారా సీసాలు, కొన్ని ప్లాస్టిక్ గ్లాసులు, సీసాలు, కొన్ని రాళ్లు -  రప్పలూ;

- ముఖ ద్వారం లోతట్టున సుందరీకర్తలు చెక్కి, గడ్డి ఏరి, చదును చేసి, నారుమడిగా మార్చిన ఒక చిన్ననేలా ;

- ముగ్గురు కార్యకర్తలు డిప్పల్తో ఎత్తి, ట్రక్కులో నింపితే చెత్త కేంద్రానికి చేరిన రకరకాల తుక్కులూ

          ఇవన్నీ చల్లపల్లి వేకువ శ్రమదానంలో సర్వసాధారణ దృశ్యాలే! ఒక ప్రక్క మంచి పనులని మెచ్చుతూనే, కొందరు మిత్రులు వచ్చి, పాల్గొని, నెరవేర్చని బాధ్యతలే! నా దైనందిన వ్రాతల్లో చర్విత చర్వణాలే!

          6.35 సమయంలో కాఫీ కబుర్ల తరువాత - కొందరి చెమటలు కాస్త ఆరిన తర్వాత యధావిధిగా డాక్టరు DRK గారి సమీక్ష, గోళ్ల విజయ కృష్ణుడి గ్రామాభ్యుదయకర నినాదాలూ జరిగిపోయాయి.

          రేపటి వేకువ మన శ్రమదాన క్షేత్రం కూడ నీళ్ల టాంకుల ప్రదేశమే - అనగా సంత, సినిమా హాలు ప్రాంతమే!

         సమర్పిస్తున్నాం ప్రణామం - 115

దేశమంటే మట్టి కాదని - దేశమనగ సజీవ జనులని

వట్టి గొప్పలు చెప్పవద్దని - గట్టి మేల్ నువు చేసి చూపని

మహాకవి గురజాడ పలికిన మంత్ర ముగ్ధ ప్రవచనాలను

ఆచరిస్తూ కదం త్రొక్కిన అందరికి ఇది నా ప్రణామం!

 

నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త,

ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు

13.05.2022.