2434* వ రోజు.......           14-May-2022

 ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎప్పటికీ వాడమని ప్రతినబూనుదాం!

2434* (శనివారం) నాటి 30 మంది శ్రమ వైభవం!

          4.17 మొదలు 6.05 దాక – అందులో గంట సమయం చీకటి – అటూ ఇటూ కాని ఉక్క వాతావరణం! మళ్ళీ సంత ప్రక్క నీళ్ల టాంకుల ఆవరణే! స్థలం అదే గాని, వానతోను, లీకైన నీళ్లతోనూ తడిసి బురదగా మారిన చోటే కార్యకర్తల శుభ్ర – సుందరీకరణ చర్యలు!

          నిన్న మిగిలిపోయిన కొద్దిపాటి ప్లాస్టిక్ తుక్కులు, గడ్డి, గోడల్ని బద్దలుకొట్టే రావి – జువ్వి మొక్కలు, మూలల్లో నక్కిన కొన్ని ముళ్ల, మొండి తీగలు మరింత క్షుణ్ణంగాను, ప్రతి సుందరీకర్తకు పూర్తి సంతృప్తికరం గాను, నిశ్శేషంగానూ తొలగిపోయి, డిప్పల్లోకి - తదుపరి ట్రక్కులోకి చేరి, అంతిమంగా చెత్త కేంద్రానికి తరలి పోయాయి!

          ఇక స్వచ్చ కార్యకర్తల 2 గంటల శ్రమ మూల్య మంటారా? ప్రదర్శించిన ఉత్సాహమా? చీకట్లో కత్తుల విన్యాసాలా? ఉండి ఉండి కొన్ని ఛలోక్తులా? ఇందులో ఏ ఒక్కరి సొంతపని కాకున్నా  - వేల దినాల్లాగే, యధావిధిగా చూపిన అభినివేశమా? అనుకోకుండానే చూపిన ఆదర్శమా? పొందగలిగిన అర్హులకు పంచిన స్ఫూర్తా? లేక నేటి 50 కి పైగా ఊరి ఉమ్మడి ప్రయోజనకర పనిగంటలతో వాళ్ళు పొందిన సంతృప్తా?... అవన్నీ ఇక్కడ వ్రాయాలంటే ఈ వ్యాస విస్తరణ భయం!

          నేటి సంక్లిష్ట ప్రపంచంలో - ఒక గ్రామ సమాజంలో ప్రతివాడూ తానేదో ఆరోగ్యంగా, ఆనందంగా – సంపన్నంగా - సమగ్రంగా - సుఖంగా బ్రతుకుతున్నానని సంకుచితంగా ఆలోచిస్తాడు గాని, ఇవన్నీ వైయక్తికం అయితే మాత్రం శాశ్వతం కాదు! ఎప్పటికైనా ఉమ్మడి సౌఖ్యంలోనే నేటి ప్రతి సామాజికుడికి నిజమైన శాంతి, క్రాంతి! ఇలాంటి ఒక తాత్త్వికతతోనే చల్లపల్లిలో 2434* దినాల – 3 ½ లక్షల పని గంటల స్వచ్చోద్యమ ప్రగతి! ఇలాంటి ఆలోచన కాక – ఆచరణ కాక – నానాటికీ కరడుగట్టుకుపోతున్న నేటి స్వార్థ ప్రపంచానికి ఏది మరో విముక్తి?

          అందుకే ఈ తత్త్వ బోధనను వంట బట్టించుకోనే వారికి చల్లపల్లి స్వచ్ఛంద శ్రమదానమొక అద్భుతం, సమాజ స్ఫూర్తికొక ఇంధనం! ఈ తాత్త్విక ధోరణే పట్టని వాళ్లకిదొక ఛాదస్తం! ఆర్భాటం!

          సరే! నిన్నటి, నేటి మొత్తం 50 మందికి పైగా కార్యకర్తల పూనికతో – ఈ నీళ్ల టాంకుల ఆవరణం, అందులోని నీటి కాల్వలు, కొంత మేరకు ఎగుడు దిగుళ్లు, రాళ్ళు రప్పలు తొలగి,  కనీసం రెండు నెలలపాటైనా అది పరిశుభ్రంగా ఉండబోతోంది!

 

నేటి శ్రమ సమీక్షా సమయంలో :

స్వచ్చ – సుందర – పరిశుభ్ర సాధక నినాదాలు పలికింది అడపా వారు!

కార్యకర్తల గురించి ముఖ్యంగా కత్తి వీరుల మీద పాట వ్రాసింది నల్లూరి వారు!

అద్భుతంగా ఆలపించింది నందేటి వారు!

సదరు పాటను ఆస్వాదించింది ఉద్యమ కర్తలు!

          రేపటి మన శ్రమ త్యాగం కోసం మనం కలిసి సాగదగిన చోటు మెయిన్ సెంటర్ లో!

 

      సమర్పిస్తున్నాం ప్రణామం – 116

జన జాగృతి రగిలించగ - మును ముందుకు కదలించగ

వ్యష్టి ప్రయోజనముతో సమష్టి మేలు లక్ష్యించగ

ఎంత భగీరథ యత్నం - ఇంత సముజ్జ్వల ఘట్టం

నడిపించిన స్వచ్చోద్యమ నాయకులకు ప్రణామం!   

 

నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త,

ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు

14.05.2022.