2435* వ రోజు..........           15-May-2022

 ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎప్పటికీ వాడమని ప్రతినబూనుదాం!

2435* వ నాటి గ్రామ పరిశుభ్ర సంకల్పం 29 మందిది!

          ఆదివారం (15-5-22) వేకువ 4.20 - 6.12ల మధ్య కాలపు శ్రమదానం సమర్పితమైనది ఊరి ముఖ్య 3 రోడ్ల కూడలి మొదలు బెజవాడ రోడ్డులోని శివాలయం దాక! ఈ ½ కిలోమీటరు రహదారిలో 110 నిముషాలలో ఏ కార్యకర్త ఎంత దీక్షగా ఏ పనిని ఏపాటి నిబద్ధతతో నెరవేర్చిందీ వివరించడం కుదరదు గాని, స్థూలంగా వీళ్ళ పని పద్ధతినీ, ప్రయోజన సిద్ధినీ తెలుసుకుందాం!

          కోటకు ఉత్తర దిశగా రెండు మలుపుల ఈ మార్గం ముమ్మరంగా వాహనాల రాకపోకలకూ, వ్యాపారాలకూ నెలవు! టీ కొట్ల గ్లాసుల, ప్లేట్లతోను, భోజనశాలల, బడ్డీ కొట్ల నుండి వ్యర్ధాలతోను, మరో వంక శీతల పానీయ జాతరతోనూ ఈ రోడ్డు తక్కిన ఏ ప్రధాన వీధులకూ కాలుష్యం విషయంలో తీసిపోదు.

          బస్సులు, లారీలు, ఆటోలు, ఇక్కడే ఆగి, ఆయా ప్రయాణికుల్లో కొందరు, విసిరే వ్యర్ధాలు, రెండు పక్కలా గోడల మీద అంటించిన సినిమా పోస్టర్లు, మేకలు వాటిని లాగితే వేళ్లాడే పీలికలు, ఇసుక మట్టి టిప్పర్ల నుండి జారిపడే వాటిని స్వచ్చ కార్యకర్తలు కాక ఎవరు శుభ్రం చేయాలి?

          నాటి - పెంచింది తామైనా, కాస్త హద్దు దాటి పెరిగిన చెట్ల కొమ్మల్ని ఎవరు కత్తిరిస్తారు? ఎవరి దుకాణాల ముంగిళ్లను వారు అందంగా, శుభ్రంగా అమర్చుకోకపోతే - వాటికి కూడ ఈ స్వచ్చ కార్యకర్తలే బాధ్యత తీసుకొంటారు!

కావాలంటే మచ్చుకు రెండు మూడు వాట్సప్ చిత్రాలను గమనించండి.

- 84 ఏళ్ల ఒక వృద్ధ వైద్యుడు - ఒంట్లో ఓపిక తగ్గుతున్నా, అప్పటి దాక కార్యకర్తలకు మంచినీళ్లందించి, నిలబడలేక కూర్చొని, చీపురుతో ఊడ్చే విధం;

- ఇంకో 75 ఏళ్ల ఛాయాగ్రాహక వృద్ధుడు మరింతగా అసౌకర్యం గానూ, ఆయాసంగాను తన పని చేసుకుపోతున్న వైనం;

- రోడ్డు మీద, ప్రక్క దుకాణాల దగ్గర - ఎక్కడ ఏ ఇసుక, దుమ్ము, కాగితం ముక్కలు, తుక్కులు, ప్లాస్టిక్ లు ఉండడాన్ని ఒప్పుకోమని, చెమటలు కారుస్తూ శ్రమిస్తున్న నలుగురైదుగురు మహిళామతల్లులూ;

- ప్రోగుబడిన వ్యర్ధాలను సకాలంలో డిప్పలతో ట్రక్కులో నింపి, చెత్త కేంద్రానికి చేరుస్తున్న ఐదారుగురి పట్టుదలా,

          ఇంకా చెప్పాలంటే – “అబ్బా! ఎంత బాగా వీధుల్ని శుభ్రపరుస్తున్నారయ్యా! మీ వల్లే చల్లపల్లి ఇంత చూడచక్కగా ఉంది...అని మెచ్చుకొంటూ తప్పుకొన్న వారు తప్ప కార్యకర్తలతో కలిసి శ్రమించని కొందరు గ్రామ సోదరులు.....ఇదీ ఈ ఆదివారం ఉషోదయాన చల్లపల్లి శ్రమదాన కాల విశేషం!

          6.35 వేళకు 3 రోడ్ల కూడలి దగ్గరి దాసరి శ్రీను హీరో షోరూం ఎదుట సమీక్షా సమావేశమూ, ఆ సందర్భంగా అకుల దుర్గా ప్రసాదుని గ్రామ స్వచ్ఛ - శుభ్ర - సౌందర్య సంకల్ప నినాదాలూ... ఆ విధంగా ఆదివారపు శ్రమదాన ఘట్టం ముగిసింది!

          బుధవారం నాటి వేకువ సైతం మనం విజయవాడ మార్గంలోని శివాలయం పరిసరాల్లోనే కలుసుకొందాం!

       సమర్పిస్తున్నాం ప్రణామం 117

నాల్గు మాటలేమున్నది నాలుకతో పలుకవచ్చు

ధన సహాయమొంతైనా ఘన రీతినె జరుపవచ్చు

సమయ శ్రమదానాలు ద్వి సహస్ర దినాలుగ చేసే

స్వచ్చోద్యమ కారులకే సముచిత తొలి ప్రణామం!

 

నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త,

ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు

15.05.2022.