2436* వ రోజు....           16-May-2022

 ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎప్పటికీ వాడమని ప్రతినబూనుదాం!

సోమవారం సైతం కొందరి శ్రమదానం - @2436*

          16-5-22 నాటి వేకువ సమయంలో కూడా కొద్దిమంది ఊరి మెరుగుదల చర్యలు కొనసాగాయి. అది గ్రామ రక్షక స్వచ్చ కార్యకర్తల చతుష్టయం! బందరు జాతీయ రహదారి కిలోమీటరు పొడవునా -  మూతబడ్డ ఎయి'డెడ్' కళాశాల నుండి పడమరగా రకరకాల ప్లాస్టిక్ తుక్కులు వాళ్ల కంటబడితే ఆ గ్రామహిత చతుష్టయం ఎలా సహిస్తుంది?

          అసలీ ఏడెనిమిదేళ్లుగా వాళ్ల ప్రవృత్తేమిటి? రోజూ ప్రొద్దున్నే కాదు - బ్రహ్మముహూర్తం కన్న ముందే ఏ 3.30 కో మేల్కొనడం సోమ, మంగళ వారాల్లో ఈ ప్రత్యేక బృందం వీధుల శుభ్రతకో, భద్రతకో 4.30 నుండి 6.30 దాక ప్రణాళికాబద్ధంగా శ్రమించడమే కదా! దేశంలోని కనీసం ఒక్క ఊళ్ళోనైనా నిరంతర శ్రమదానం చేస్తూ క్రొత్త పని సంస్కృతిని రూపుదిద్దడం కాదూ?

          ఏ మహత్తర కృషినైనా - ఎప్పుడో ఒకప్పుడు - ఎక్కడో ఒకచోట - ఎవరో ఒక్కరు మొదలు పెట్టవలసిందే కదా! అది ఎనిమిదేళ్ల నాడు చల్లపల్లిలో మొదలయింది. ట్రాక్టర్ అంచు మీద ఎత్తుగా నిలబడి, కరెంటు/టెలిఫోన్ స్తంభాల మీది కొన్ని గలీజుల్ని ఒకాయన తొలగించడాన్ని గమనించండి. అందుకే ఈ బృందానికి రెస్క్యూటీమ్అనే ముద్దు పేరు.

      సమర్పిస్తున్నాం ప్రణామం 117

మెప్పులకో - గొప్పలకో తిప్పలు బడనట్టి వాళ్లు

గత తరాల త్యాగ ఫలం కానుకగా పొందువాళ్లు

భావితరం మేలు కొరకు పాటుబడే మంచివాళ్లు -

అట్టి స్వచ్చ - కార్యకర్తలందరికీ ప్రణామాలు!

నల్లూరి రారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త,

ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు

16.05.2022.