1908* వ రోజు....           01-Feb-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1908* వ నాటి వీధి శుభ్రతలు.

 ఈ నాటి శుభోదయంలో 3.58 నుండి 6.22 నిముషాల వరకు అవిఘ్నంగా సాగిన గ్రామహిత శ్రమదానంలో వివిధ బాధ్యతలు నిర్వహించిన దార్శనికులు 30 మంది. శుభ్ర-సుందరీకృత ప్రాంతాలు –

1) RTC వాహన ప్రాంగణం .

 

2) కప్తానుపాలెం దారి మలుపులో పోతురాజు గుడి నుండి బండ్రేవుకోడు మురుగు కాల్వ వంతెన దాక.

 

పునః పునః సుందరీకృత బస్ ప్రాంగణంలో 6 వ రోజు గూడ పాత మరుగుదొడ్ల గోడ మీద చిత్ర లేఖన సన్నాహక కృషి పూర్తి కాలేదు. కళాత్మక దృష్టిలో వీళ్ల అత్యాశ వల్ల –(అందులో అసలు రాజీ పడని ఒక పరిపూర్ణకుడు (పర్ఫెక్షనిస్టు) కారణంగా, ఈ ప్రాంగణం పనులు మరొక వారం పట్టినా ఆశ్చర్యం లేదు!

 

ఎక్కువమంది కార్యకర్తలకు మాత్రం నేటి పని పోతురాజు గుడి ముందు నుండి ఉత్తరం దిశగానే. కత్తులకూ, చీపుళ్లకూ, గొర్రులకూ, డిప్పలకు చేసినంత పని. మురుగు కాల్వ సమీపంలోనైతే రెండు ఇళ్ల ముంగిట, ఖాళీ స్తలం ఎదుట 10 మందికి పిల్ల మురుగు కాల్వ తూర్పు గట్టున దట్టంగా పెరిగి, మురుగునీటిని అడ్డగిస్తున్న రకరకాల పిచ్చి ముళ్ల మొక్కల్ని నరకడంతోనే సరిపోయింది. నలుగురికి ఆ ఖండిత వ్యర్ధాలను గొర్రులతో లాగడమే పని.

 

ఒక వంక రహదారి మలుపులు, పాగోలు వైపు నుండి చెరుకు ఎడ్ల బళ్లు, నిముషానికి నాలుగైదు చిన్న, పెద్ద వాహనాలు, ఆ ప్రాంతంలో వెలగని వీధి దీపాలు- మరొక వంక అక్కడ 25 మంది కార్యకర్తల త్రివిధ గ్రామ సేవా విన్యాసాలు!

 

తీరా 6.10 కి స్వచ్చ శ్రమదాన ముగింపు వేళకు- వెలుతురు ప్రసరించాక చూస్తే- మురుగు పిల్ల కాల్వ నిండా- తూముల నిండా రకరకాల చెత్త, తుక్కు కనపడి, అప్పటికప్పుడు- నలుగురు గొర్రులతో చకచకా అన్నిటినీ లాగి, పోగులు పెట్టారు.

 

నేనిలా స్వచ్చ కార్యకర్తల దైనందిన గ్రామ కర్తవ్య నిర్వహణను చూసి, చేస్తున్న స్థూల వర్ణనలు చదివేవారు – ముఖ్యంగా గ్రామస్తులు కుదిరినప్పుడైనా వచ్చి, ప్రత్యక్షంగా చూసి, ఈ వ్రాతలన్నీ అతిశయోక్తులని భావించకుందురు గాక.

 

ఆస్పత్రి పని వల్లనేమో-మన వైద్యులుభయులూ స్వచ్చ శ్రమదానం మధ్యలోనే నిష్క్రమించారు.

6.45 నిముషాలకు నేటి స్వచ్చోద్యమ సాంప్రదాయక గ్రామ సంకల్ప నినాదాలను ముమ్మారు ప్రకటించే ముగింపు బాధ్యతను గౌరుశెట్టి (BSNL) నరసింహారావు తీసుకొన్నారు.

 

మన రేపటి స్వగ్రామ కర్తవ్యం గంగులవారిపాలెం దారిలోని మా ఇంటి వద్ద ఆగి, ప్రారంభించాలని నిర్ణయం!

 

    స్వచ్చ చరిత్రలో మరియొక పుట

ఈ విశాల దేశంలో-రాష్ట్రంలో-మారుమూల-

చల్లపల్లి అనబడు ఒక జనపదమును మార్చగోరి-

పందొమ్మిది వందల దిన యజ్ఞంగా సేవజేసి-

కేవలమొక వందమంది కృత కృత్యులై నిలిచిరి!

 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

శనివారం – 01/02/2020

చల్లపల్లి.