2437* వ రోజు....           17-May-2022

 ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎప్పటికీ వాడమని ప్రతినబూనుదాం!

2437* వ నాటి పర్యావరణ పరిరక్షణ చర్యలు.

            మంగళవారం (17.5.22) వేకువ కూడ 2 గంటల సమయం పైగా స్వచ్చ కార్యకర్తల వీధి శుభ్రతా కృషి కొనసాగింది. తొలుత బందరు మార్గంలో కొద్ది చోట్ల, నాగాయలంక బాటలో వీర బ్రహ్మం గుడి దాక, NTR పార్కు నుండి డంపింగ్ కేంద్రం దాక ప్లాస్టిక్ వస్తువుల ఏరివేతల పనిలో నలుగురు నిమగ్నులయ్యారు.

          ఇక్కడితో మూడు ముఖ్య వీధుల – ఏక మాత్ర ప్రయోజనకర ప్లాస్టిక్ వస్తువుల ఏరివేతల కృషి ముగిసిందనుకోవాలి. కాని, ఈ బహుదూరపు బాటసారుల గ్రామ సుందరీకరణ సంకల్పం మాత్రం బహుశా మరికొన్ని ఏళ్ల పాటు సశేషమే!

          గ్రామస్తులు వీళ్ల శ్రమదానంతో మమేకులై – సానుకూలురై – ఈ స్వచ్చ కార్యకర్తలు కూడ మరింతగా వివిధ వర్గాల ప్రజల సున్నిత అంశాల పట్ల మరికొంత అప్రమత్తులై – సర్వజనామోద సమైక్య గ్రామభ్యుదయ కృషి నిర్విఘ్నంగా జరిగే శుభ తరుణం కోసం ఎదురు చూద్దాం!

          శంకర శాస్త్రి గారి చల్లపల్లి స్వచ్చ - శుభ్ర - సౌందర్య సంకల్ప నినాదాలు ముమ్మారు వినిపించాక 6.30 కి నేటి రైస్క్యూ టీం కృషి ముగిసింది.

          రేపటి మన (బుధవారపు) శ్రమదాన ప్రణాళిక అమలు కోసం - ఆదివారమే నిర్ణయించినట్లు - బెజవాడ రోడ్డులోని శివాలయం దగ్గర కలుసుకొందాం!

 

      సమర్పిస్తున్నాం ప్రణామం – 118

మీది ప్రగతికి రాచమార్గం, సమష్టి మేలుకె మీ ప్రయత్నం

ప్రతి శుభోదయ మొక ప్రమోదం, గ్రామ ప్రగతె విశిష్ట లక్ష్యం

ఎన్ని నాళ్ళో – ఏళ్ళో గడచిన వన్నె తగ్గని ఒక విచిత్రం

ఆ విలక్షణ – మీ సలక్షణ ఉద్యమానికె నా ప్రణామం!

 

నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త,

ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు

17.05.2022.