2438* వ రోజు....           18-May-2022

 ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎప్పటికీ వాడమని ప్రతినబూనుదాం!

స్వచ్చోద్యమ పనిదినాల వరుస సంఖ్య 2438*

          13 వ వార్డు (అగ్రహారం) లో ప్రధాన వీధి; 4.16 వేకువ సమయానికే ప్రారంభమైన స్వచ్చంద కార్మికుల ప్రయత్నం; తదాదిగా 6.00 దాక - అనగా 100 నిముషాల పర్యంతం - 27 మంది గ్రామ స్వచ్చ శుభ్ర సౌందర్య వ్యవసాయం! అందులో వార్డు సభ్యురాలైన అల్లంశెట్టి శ్రీరంగనాయకమ్మ, గ్రామ సర్పంచమ్మ వంటి బాధ్యుల భాగస్వామ్యం!

          మరి ఇక చెప్పేదేముంది తెల్లవారే సరికి వీధంతా ఒక క్రొత్త స్వచ్చ కళ! వీరి గంటన్నరకు పైగా శ్రమదానం దెబ్బకు వీధిలో అంతకు ముందున్న దుమ్ము - ధూళి - ఇసుక - పుల్ల - పుడక - ప్లాసిక్ కప్పులు గ్లాసులు సీసాలు - ఆఖరికి కాగితం ముక్కలు సైతం లేని ఒక ఆహ్లాదకరమైన అగ్రహారం వీధి మనకిప్పుడు కనిపిస్తున్నది వాట్సప్ చిత్రంలో గమనించండి.

          ఐతే - ఈ వార్డులో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు సరే తక్కిన వారికి మాత్రం బాధ్యత లేదా అనేదే స్వచ్ఛ కార్యకర్తల ధర్మ సందేహం! నాలాంటి నిత్య శంకితులకైతే గ్రామంలోని 22 వార్డుల సభ్యులూ, వారి అనుయాయులూ, కుటుంబ సభ్యులూ, ఊరి ఉమ్మడి శ్రేయోభిలాషులూ ప్రతిరోజూ కాకున్నా - అప్పుడప్పుడైనా రోజుకొక గంట పాటైనా శ్రమదానంలో ఎందుకు పాల్గొనరనే ప్రశ్న పుట్టుకొస్తూనే ఉంటుంది!

          చేసేదేముంది - ఇలాంటి సందేహ జీవుల మందైక భావుల ప్రశ్నలు 2438* పని దినాల శ్రమదానం తర్వాత కూడ ప్రశ్నలు గానే మిగిలిపోతున్నాయి!

          అయ్యా! అమ్మా! (13వ) వార్డు నివాసులారా! స్వచ్చోద్యమ చల్లపల్లిలో నివసించే 25 వేలకు పైగా అదృష్టవంతులారా! స్వచ్చ సైనికుల రేపటి శ్రమదానం సైతం అగ్రహారంలోనే ఉండబోతున్నది  -మీ వార్డుకు, గ్రామానికి చెందని కొందరు డాక్టర్లు, వృద్ధులు, మహిళలూ మీ వార్డు గ్రామ వీధి  - శుభ్రత నిమిత్తం వేకువనే 2 గంటల సమయ - శ్రమ - అర్ధ దానాలు చేస్తున్నారు. వీలైన ప్రతి ఒక్కరూ వచ్చి - పాల్గొని సంఘీభావం తెలపండి!

          నేటి కార్యకర్తలు గ్రామ సామాజిక ప్రయోజనార్థం నిర్వహించిన వీధి పారిశుద్ధ్య కృషిలో నన్ను మరీ ఆకర్షించిన కొన్ని దృశ్యాలు:

1) రోడ్డు మార్జిన్లలో పెరిగిన పిచ్చి - ముళ్ల మొక్కల్ని సమూలంగా కత్తులకు బలిచేస్తున్న పీకేస్తున్న ఏడెనిమిది మంది కత్తి వీరులు

2) నరికిన పీకిన వ్యర్ధాలతో సహా సకల కశ్మలాలను చీపుళ్లతో ఊడుస్తున్న మహిళలు

3) డిప్పల్తో వ్యర్ధాల ప్రోగుల్ని ట్రాక్టర్లో కందిస్తున్న కార్యకర్తలు, ట్రాక్టర్ లో చిద్విలాసంగా నిలబడి అందుకొంటున్న ట్రస్టు కార్మిక పర్యవేక్షకుడు

4) యధాప్రకారం - ప్రతి రోజులాగే తన ఊరిలో జరిగే ఈ సామూహిక సామాజిక - సమైక్య శ్రమదానాన్ని చూసి తరించిపోతున్న ఈ ఉద్యమ సంచాలకుడు -

నేటి మరొక ముఖ్య విశేషం :

మొన్నటి గాలివానకు మండల రెవిన్యూ కార్యాలయాలలోని ఒక చెట్టు అంబేద్కర్ విగ్రహం ప్రక్కన కూలిపోగా, దాసి సీతారామరాజు గారి అభ్యర్ధన మేరకు స్వచ్ఛ సుందర కార్యకర్తలు ఆ చెట్టు కొమ్మలను నరికి, ఆవరణను శుభ్రపరచి మన రాజ్యాంగ నిర్మాత పట్ల తమ గౌరవాభిమానాలు చాటుకున్నారు.

          6.25 సమయంలో తన గ్రామ స్వచ్ఛ శుభ్ర సౌందర్య సంకల్ప నినాదాల్ని ముమ్మారు అదరగొట్టింది BSNL గౌరుశెట్టి నరసింహారావు నామధేయుడు!

          క్రమం తప్పని 5000/- విరాళ మందించినది ప్రాతూరి ఉదయ శంకర శాస్త్రి!

          గతంలోనూ ఆమె స్వచ్ఛ సుందర చల్లపల్లి కోసం అనేక విరాళాలు ఇచ్చారు. విశ్రాంత ఉపాధ్యాయిని శ్రీమతి యార్లగడ్డ పుష్పసుందరావతి గారు మళ్లీ ఈరోజు కూడా 2 వేల రూపాయలు "మనకోసం మనం" మేనేజింగ్ ట్రస్టీకి సమర్పించారు.

          గత నెల స్వచ్చోద్యమ జమా ఖర్చుల్ని ప్రకటించినది డాక్టర్ DRK!

          రేపటి మన స్వచ్చంద శ్రమదాన గ్రామ భాగం కూడ 13 వ వార్డులోని అగ్రహార ప్రధాన వీధే!

          సమర్పిస్తున్నాం ప్రణామం 119

మద్య సంస్కృతి క్షుద్ర రాకడ - మత్తు మందుల చిత్ర పోకడ

నాది నాకనువరుసె గానీ, “మనది మనకనుమాట ఎక్కడ?

సంకుచితమును అధఃకరించి - సమాజ శ్రేయము నభిలషించిన

ఒక సలక్షణ - ఒక విలక్షణ ఉద్యమానికె నా ప్రణామం!

 

- నల్లూరి రామారావు,

  స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త,

  ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు

 18.05.2022.

క్రమం తప్పని 5000/- విరాళ మందించినది ప్రాతూరి ఉదయ శంకర శాస్త్రి!
గతంలోనూ ఆమె స్వచ్ఛ సుందర చల్లపల్లి కోసం అనేక విరాళాలు ఇచ్చారు. విశ్రాంత ఉపాధ్యాయిని శ్రీమతి యార్లగడ్డ పుష్పసుందరావతి గారు మళ్లీ ఈరోజు కూడా 2 వేల రూపాయలు "మనకోసం మనం" మేనేజింగ్ ట్రస్టీకి సమర్పించారు.