2439* వ రోజు.......           19-May-2022

 ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎప్పటికీ వాడమని ప్రతినబూనుదాం!

స్వగ్రామ సంక్షేమ కృషిలో 2439* వ నాడు.

        ఇది గురువారం (19-5-22) వేకువ - సమయం 4.16! ఊరి స్వచ్ఛంద శ్రామికులు డజను మంది! నిముషాల్లో ఈ డజను రెండు డజన్లై – శ్రేయోభిలాషుల, అతిథి – అభ్యాగతుల రాకతో ఒక దశలో 31 మందిగా మారి, అగ్రహార ప్రధాన వీధి గంటన్నరకు పైగా శ్రమదాన సందడి నెలకొన్నది! సదరు వీధికి తూర్పు పడమరల అడ్డ రోడ్డ్లు, బైపాస్ మార్గం దాక, 3 రోడ్ల కూడలిలోని పెద్ద ఖాళీ స్తలమూ దర్శన రమణీయంగా మారిపోయినవి!

        మన పెద్దలు చెప్పారో – లేదో గాని, “శ్రమయేవ జయతే” అనే నానుడి న్యాయమూ, శాశ్వత సత్యమూ! శుష్క వాగాడంబరాలూ, శూన్య హస్తాలూ బైట ప్రపంచంలో నిత్యం గమనిస్తూనే ఉన్నాం! స్వచ్ఛ కార్యకర్తలది ఆ పద్ధతి కానే కాదు. ఎప్పుడో 8 ½ ఏళ్ల క్రిందట - రాష్ట్రానికి, గ్రామానికి ఆశాకిరణంగా మండలి బుద్ధ ప్రసాదు గారు నిర్వహించిన స్వచ్ఛాంధ్ర సన్నాహక సభ లో మన స్వచ్చోద్యమ సంచాలకుడు - డాక్టర్ రామకృష్ణ ప్రసాదు గారు ఆఖరికి మేం నలుగురుమైనా - కనీసం సంవత్సరం పాటు గ్రామాన్ని శుభ్రపరుస్తాం...” అనే ప్రకటన ఇప్పటికి ఎనిమిదేళ్లుగా ఆచరణలో ఉన్నది!

        సందర్భాన్ని బట్టి రోజుకు 30 40 - 50 మంది కార్యకర్తల కృషితో మన చల్లపల్లి న్యూజిలాండో – స్వీడనో ఐపోలేదు గాని, కనీసం మన రెండు మూడు రాష్ట్రాలకు

ఆదర్శంగాను, 40 గ్రామాల్లో ఆచరణాత్మకంగాను నిలిచింది.

“వట్టి మాటలు కట్టి పెట్టోయ్ – ప్రజలకు గట్టిమేల్ తలపెట్టవోయ్!

దేశమంటే మట్టి కాదోయ్ – దేశమంటే మనుషులోయ్...”

అనే గురజాడ మహా కవితా సూక్తికి నిదర్శనంగా మారింది.

        ఏ క్రొత్త పనికైనా తొలుత కొన్ని ఆటంకాలూ, అవహేళనలూ, అనాలోచిత వ్యాఖ్యాలూ తప్పనట్లే - చల్లపల్లి స్వచ్చోద్యమానికి కూడ కొన్ని ఆటుపోట్లు వచ్చేవి! ఇప్పుడైతే స్వచ్ఛ భారత్ వాళ్లు’, స్వచ్ఛ చల్లపల్లి వాళ్లు గాని ఒకానొక దశలో చురుకైన, తెలివైన కొందరి దృష్టిలో ఈ కార్యకర్తలు పిచ్చోళ్లూ, వింత మనుషులూ!”

అసలింతకీ ఈ గురువారం శుభోదయాన జరిగిన శ్రమదాన వివరాలేమంటే :

- రెండు - మూడు రోడ్ల బాగు చేత, కొంత మేరకు మురుగు కాల్వల చెత్త వెలికి తీత!

- స్థానిక పెద్ద, విద్యా - వయోధికులూ “పత్రి హనుమంతరావు గారి రాక, స్వచ్ఛంద శ్రమదానానికి వారి ప్రశంస, అశంస!

- మొత్తం ఐదుగురు అగ్రహారికుల ప్రమేయం, అందులో ఇద్దరు - న్యాయవాది కేశవుడి, రిటైర్డ్  KCP ఉద్యోగి రమణారావుల శ్రమదానం!

- ఈ వేళ 8.00 నుండి గంగులవారి పాలెం బాటలో గస్తీగది వద్ద మజ్జిగ వితరణా ప్రకటన!

- 6.25 కు నేటి శ్రమదాన సింహావలోకనా సమయంలో - కళాశాల పౌర శాస్త్రోపన్యాసకుడు వేముల శ్రీను 3 మార్లు నినదించిన, కార్యకర్తలు ప్రతిధ్వనించిన గ్రామ స్వచ్చ – శుభ్ర – సౌందర్య సాధనా సంకల్ప నినాదాలు!

        డాక్టరు DRK గారి ముగింపు మాటలు!

        రేపటి మన శ్రమదానం కోమలా నగర్ దగ్గరనే అనే నిర్ణయం -

       

        సమర్పిస్తున్నాం ప్రణామం – 120

ఎవరి స్వేద జనితములో ఈ వీధుల శుభ్రతలు

ఎవ్వరి కష్టార్జితములో ఈ రహదారుల సొగసులు

ఎవరి శ్రమకు సాక్ష్యములో ఈ గ్రామం మెరుగుదలలు –

ఆ స్వచ్చోద్యమకారుల కందిస్తా ప్రణామములు!

 

- నల్లూరి రామారావు,

  స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త,

  ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు

 19.05.2022.