2441* వ రోజు....           21-May-2022

 ఒక్కసారికే పనికి వచ్చే పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులు ఎప్పటికీ వాడమని ప్రతినబూనుదాం!

స్వచ్చ - సుందర చల్లపల్లి” ని సార్థకం చేస్తూ – 2441*వ నాటి శ్రమదానం.

          21-5-22 - శనివారం నాటి గ్రామ కాలుష్యాల శని వదలించేందుకు వేకువ 4.20 కే సగం మంది స్వచ్చకార్యకర్తలు, ఇంకొన్ని నిముషాల్లో మిగిలిన వారు - మొత్తం ఒక దశలో 42 మంది - అందులో అరేడుగురు స్థానికులు – కోమలా నగర్ లో చూపిన పట్టుదలతో – 2 చిన్న వీధులూ, రెండు చిన్నా - పెద్దా ఖాళీ స్థలాలూ బాగుపడినవి.

          ఇంత అందమైన భవంతుల నడుమ – ఆ గ్రహస్తులు కష్టమనుకోకుండా కనీసం వారానికొకమారు తలో గంట ప్రయత్నిస్తే, తమ పరిసరాలెంత ఆహ్లాదకరంగా మారతాయో తెలిసి వచ్చేట్లుగా ఉన్నది స్వచ్చ సుందర సైనికుల నేటి కృషి!40 మంది శ్రమదాతల 60 పని గంటల శ్రమతో క్రొత్త పరిసరాల అనుభూతిని పొందిన పరిసర కుటుంబీకులు దాన్ని చిరస్థాయిగా చేయాలని ఆశిద్దాం!

          ఎందుకంటే - ఎనిమిదేళ్ల మన ఊరి మెరుగుదల కృషి దిక్కుల్ని ఊపేసే - కొండల్ని పిండి కొట్టే - ఊరినో, దేశాన్నో అమాంతం ఉద్ధరించే ఒక లోకోత్తర సేవ కానే కాదనీ, తమ కోసం, తమ గ్రామ సమాజ ఔన్నత్యం కోసం తాము చేసుకొంటున్నది ఆఫ్ట్రాల్ తమ కనీస కర్తవ్యమేననీ ప్రతి స్వచ్చ కార్యకర్తకూ తెలుసు!

          ఈ ఊరు మనది, వార్డూ - వాడకట్టూ మనవీ ఐనప్పుడు మన పరిసరాల పరిశుభ్రత, పచ్చదనాలు, తద్వారా కొంత ఆహ్లాదం ఆనందాల్ని మాత్రం 50 100 మంది స్వచ్చ కార్యకర్తలే తమకోసం శాశ్వతం చేయాలనే కోరిక సమంజసం కాదు.

          మనం ఎన్నుకొన్న పంచాయితీలు, ప్రభుత్వాలు పూర్తిగా బాధ్యత వహించనప్పుడు – గెలిపించిన పౌరులు తమ పరిసరాల పారిశుద్ధ్య బాధ్యతల్ని పంచుకొంటే తప్పేమిటి?

          నేటి వేకువ స్వచ్ఛ కార్యకర్తలతో అలా చేతులు కలిపిన వారిలో కృష్ణారావు గారనే గృహస్తుడు, తన టెన్త్ క్లాసు మనవడితో సహా శ్రమదానంలో పాల్గొన్న నర్రా శాయి గారు, మరికొందరూ ఉండడం ముదావహం! ఇది అన్ని వార్డుల వారికి తక్షణావశ్యకమూ - ఆదర్శమూ కూడా!

          సరే - బాగానే ఉన్నది. రోజూలాగే ఈ 30 - 40 మంది గంటన్నరకు పైగా రోడ్లు ఉడ్చారు, ఖాళీ ప్రదేశాల్లో ముళ్ల - పిచ్చి చెట్లు నరికారు, ఎగుడు దిగుడు నేల మీద బ్యాలెన్సు చేసుకొంటూ ప్లాస్టిక్ సీసాలు, కప్పులు, ప్లేటులు, మద్యం సీసాలు, మరికొన్ని దిక్కుమాలిన కశ్మలాలను ఏరి, డిప్పలకెత్తి,

ట్రాక్టర్ లోకి ఎక్కించి డంపింగ్ కేంద్రానికి చేర్చారు - ఇవన్నీ వాళ్ల దైనందిన చర్యలే గాని - ఇవికావు - ఇప్పటి ప్రశ్నేమంటే –

          “ప్రతి రోజూ చెత్తబండి వస్తుండగా – ఖాళీ జాగాల్లో, రోడ్ల పక్కన ఇన్ని చెత్త గుట్టలెలా వచ్చాయి? వేసేవాళ్ళు మతి మాలి వేస్తుంటే – చూసే విజ్ఞులైనా వారించరెందుకు? ఆ మాత్రం రెండు మంచి పలుకులే బంగారమాయెనా?...

నేటి అనుభవాలు కలబోసుకొనే 6:25 సమయంలో కొన్ని విషయాలు:

- కోమలా నగర్ నివాసితులందరికీ ప్రబోధాత్మకంగా మూడు మార్లు మన గ్రామ స్వచ్చ – శుభ్ర – సౌందర్య సాధక నినాదాల్ని ప్రకటించిన ఆకుల దుర్గా ప్రసాదు,    

- నేను వ్రాసిన పాటను ట్యూను కనువుగా మార్పులు చేసి, పాడి, కార్యకర్తల్ని ఉత్సాహపరచిన నందేటి శ్రీనూ,

- ఈ ఉదయం సబ్బినేని బోసు – తగిరశ సాంబశివరావు గార్ల – గస్తీ గది దగ్గరి మజ్జిగ పంపకం,

- 12:00 కు దేసు మాధురీ - ప్రభాకరుల భోజన భాజనాలు....

          రేపటి - ఆదివారం వేకువ మన గ్రామ కర్తవ్య నిర్వహణ కోసం మనం కలిసి నడవవలసిన చోటు – బెజవాడ దారిలోని శివాలయం!

 

      సమర్పిస్తున్నాం ప్రణామం – 122

గ్రామ వీధులు – శ్మశానాలూ - కాల్వగట్లు - ప్రధాన కూడలి

గుడులు - బడి - కార్యాలయములూ – మోటబావులు – మారు మూలలు

శుభ్రపరచిన - అందగించిన – శోభ నిచ్చు మహానుభావులు

స్వచ్చ - సుందర కార్యకర్తలు - సమర్పిస్తాం మా ప్రణామం!

- నల్లూరి రామారావు,

  స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త,

  ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు

 21.05.2022.