2444* వ రోజు....           24-May-2022

 ఒక్కసారికే పనికి వచ్చే పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులు మనం ఎప్పటికీ వాడవద్దు!

మంగళవారం (24.05.2022) నాటి రెస్క్యూ టీం ముందు చూపు @2444*వ రోజు

            నేటి వేకువ గంటన్నర సమయంలోని కథ కూడ అంతే! వాళ్లు ఐదుగురే - అందులో మరీ మాంచి గట్టి సరుకైతే నలుగురే! ఈ స్వచ్ఛ - పంచ పాండవులు 4.30 క ప్రత్యక్షమయింది చల్లపల్లి అగ్రహారంలో ! దారుణమైన ఉక్క వాతావరణంలో- పారల్తో, డిప్పల్తో ఎత్తి, మోసి ట్రక్కులో నింపింది మట్టి - సున్నం - ఇసుక రాళ్ల రద్దే!

ఆ రద్దేమో విశ్రాంత KCP ఉద్యోగి పత్రి నారాయణ గారిది! మరి ఇందులో రెస్క్యూ టీం వారి ముందు చూపేమిటి? అంటే-

1. వీళ్లు తమ తక్కిన ఊరి ప్రయోజనకర చర్యల్ని ఈరోజుకు నిలిపి వేసి, పత్రి వారిని ఊరి కోసమని సదరు రద్దును అడగడం-

2. నారాయణరావు గారు సంతోషంగా ఉచితంగా దాన్ని వీళ్ళ కప్పగించడం – (వీళ్ళ వ్యక్తిగత వాడకానికి కాదనీ, రోడ్ల మరమ్మత్తుకు ఈ శ్రమదాతలు దాన్ని వాడతారనీ గ్రహించడమే పత్రి వారి సంతోషానికి కారణం!)

3. అందుకోసమే ముందు చూపుతో ఈ కార్యకర్తలు రద్దును సేకరించి, ట్రక్కులో నింపుకొని, డంపింగ్ యార్డులో దాచడం!

            ఆలోచించే కొద్దీ ఆశ్చర్యకర విషయం కాదా ఇది? ఎనిమిదేళ్లుగా 30-40-50 మంది స్వచ్ఛ సైనికులు చల్లపల్లిని అక్కున చేర్చుకుని, దాని కాలుష్యాల మీద యుద్ధం ప్రకటించి, సొంత ఇంటినో- పెరడునో శుభ్రం చేస్తున్నట్లు - సుందరీకరిస్తున్నట్లు - ఈ 3 - 4 లక్షల పని గంటల శ్రమదానమేమిటో -

అందులో కొందరు రెస్క్యూ టీం పేరిట ఈ కరకు - మురికి - బరువు - మొండి - బండ పనులకు పాల్పడడమేమిటో -

            దానికి వెన్ను దన్నుగా గ్రామ- గ్రామేతర దాతల సౌజన్య మెందుకో అసలీ స్వచ్చోద్యమాన్ని ఊరి జనంలో కొందరు తప్ప 30 - 40 ఊళ్ల వాళ్లు స్పందించి, అనుసరించి- అనుకరించడాలేమిటో....

            తక్కిన సంగతులట్లా ఉంచి, ఈ సామాజిక చైతన్య కారులకు పదే పదే మాటల్లోకాక చేతల్లో నిరూపించే చల్లపల్లి స్వచ్చంద శ్రమదాతలకు - నా గ్రామస్తుల తరపున, నా తరపున శత శతాధిక అభివందనాలు!

            మంగళవారం నాటి గ్రామ స్వచ్ఛ - శుభ్ర - సౌందర్య సంకల్ప కాంక్షను ముమ్మారు నినదించినది తూములూరి లక్ష్మణరావు గారు.

            బుధవారం వేకువ క్రొత్త ఉత్సాహంతో మనం కలిసి శ్రమించవలసినది కోమలా నగర్ లోనే!  

     

            సమర్పిస్తున్నాం ప్రణామం 125

ఎండమావుల వెంబడించుట- భ్రమల లోకంలోన మునుగుట

ఎవ్వరెవరో గ్రామ స్వస్తత కేదొ చేయాలనే ముచ్చట

లాడుకొను గ్రామీణులకు అన్యాపదేశ ప్రబోధ మిచ్చుట

కై  శ్రమించి-తపించి- కదలిన సాహసికులకు మా ప్రణామం!

- నల్లూరి రామారావు,

   ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు,

   స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త   

   24.05.2022.