2445* వ రోజు.......           26-May-2022

 ఒక్కసారికే పనికి వచ్చే పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి!

కోమలా నగర్‌లో 2445* వ నాటి వీధి శుభ్రతా కృషి.

            26.5.22 - గురువారం వేకువ - 4.20 సమయంలో అది జరిగింది. వాళ్లు 29 మంది. ఎందుకో గాని రెగ్యులర్ స్వచ్ఛ కార్యకర్తల సంఖ్య ఈ వేకువ తగ్గితే, స్థానిక చైతన్యవంతులు ఆ లోటును పూడుస్తూ కనీసం 8 మంది వచ్చి చేరారు. (గోళ్ల వారి కుటుంబం కుటుంబమంతా వచ్చి - ఆరుగురు నేటి శ్రమదానంలో పాల్గొన్నారు - ఇలాంటివి చూస్తుంటేనే నాకు అప్పుడప్పుడు ఒళ్లు గగుర్పొడిచేది!)      

            సింహాలెప్పుడూ సింగిల్ గా వస్తాయని కొందరీ మధ్య సినిమా డైలాగ్ లు వాడుతున్నట్లుగా ఒక నర్రా సేవా సింహం, మరొక 91 ఏళ్ల కోనేరు PET సింహం విడివిడిగా వచ్చాయి! ఈ చల్లపల్లిలోని 4500 గడపలు 5 వేలకు పైబడిన కుటుంబాల వాళ్లంతా మూకుమ్మడిగా ప్రతిరోజూ వేకువ స్వచ్చంద సేవలో పాల్గొనాలనుకోవడం అత్యాశే గాని వంతుల వారీగా వీలైనంతలో - ప్రతి రోజూ కాకున్నా వారానికొక మారైనా - ప్రతి కుటుంబం నుండి ఒక్కరు పాల్గొన్నా చాలు - ప్రతిరోజూ - ప్రతి వార్డులో - 30/40/50 మందిగా లెక్కతేలుతారు!

            మన ఊరిలో - మనందరి ఆరోగ్య - అనందాల కోసం ఊరి ప్రజల్నుండి ఇలా స్వచ్చ కార్యకర్తలు కోరుకోవడం అత్యాశో - దురాశో ఎలా అవుతుంది? ఈ మాత్రం చిన్నపాటి ఆశయం లేకుండా - అతి తేలిక పాటి కలలు కనకుండా - వాటిని ఆచరణలో పెట్టుకోకుండానే అద్భుతాలు జరిగిపోతాయా? వట్టి కబుర్లతోనే స్వచ్చ - నుందర చల్లపల్లి అమాంతంగా ఆకాశం నుండి ఊడిపడుతుందా?

            అయ్యా! మాకెందుకీ విపరీత బుద్ధులు? స్వచ్చ సౌందర్య పరిశుభ్ర - సమగ్ర - స్వస్త చల్లపల్లి కోసం మేమేనాడైనా దేబిరించామా?.. అలాంటి గొంతెమ్మ కోరికలున్న వాళ్లు వేకువ జామునేం ఖర్మ - రాత్రంతా పాటుబడండి - మేం కాదంటామా?... “ఈ ధోరణిలో ఏ గ్రామ సోదరులన్నా ఉంటే వాళ్లకొక నమస్కారం!

            ఇప్పట్లాగే సానుకూలతతో - అందరి సహకారాన్ని అభ్యర్థిస్తూ - కలిసి వచ్చిన వారిని స్వాగతిస్తూ అలా కుదరని వారికి నమస్కరిస్తూ - ఎనిమిదేళ్లు నిరంతరాయంగా - నిర్నిబంధంగా నిష్కపటంగా - జరిగినట్లే ఈ గ్రామ ప్రయోజనకర స్వచ్చోద్యమం మరో 8 - 10 ఏళ్లు జరగకపోతుందా? అప్పటికైనా నూరు శాతం మంది గ్రామస్తులు కూడి రాకపోతారా?

            ఈ వేకువ శ్రమదానం సంగతి కోస్తే - జరిగింది పరిమిత కృషే - రెండు చిన్న వీధుల, రెండు ఖాళీ స్థలాల స్వచ్చ శుభ్ర స్థిరీకరణే! ముళ్ల చెట్ల, పిచ్చి కంపల తొలగింపే! ఈ మాత్రానికే స్త్రీ వృద్ధ శ్రమదాతలెంతగా చెమట చిందించారో వాట్సప్ చిత్రాలలో గమనించండి!

            ఎగుడు దిగుడు చోట్ల కాళ్లు నిలద్రొక్కుకొంటూ కత్తుల్తో, గొర్రుల్తో శ్రమిస్తున్న వాళ్లనూ, వాటిని లాగి గుట్టలు చేసి, ట్రక్కులో కందిస్తున్న వాళ్ళనీ, ఇందరు అందించే అన్ని రకాల తుక్కు -  కంపు డిప్పల్ని ఒంటి చేత్తో అందుకుని చకచకా సర్ది విజయ గర్వంతో రెండు చేతులెత్తిన ఒక అంజయ్యని గుర్తించండి! దయచేసి పొగడకండి! వాళ్లేమో తమ కనీస సామాజిక బాధ్యతను ఆలస్యంగానైనా నెరవేరుస్తున్నామనుకొంటున్నారు!

            తమ కృషి ముగింపు దశలో - 6.25 కు గోళ్ళ కుటుంబ పెద్ద ముమ్మార్లు చల్లపల్లి స్వచ్ఛ శుభ్ర - సౌందర్య సాధనా ప్రోత్సాహక నినాదాలు పలికి, తన ఇటీవలి యాత్రా విశేషాలు వివరించి, అతని కుటుంబీకులు కార్యకర్తలకు రవ్వ లడ్డుల పంపకం చేసి... ఇలాంటివి వాళ్లకు బాగా అలవాటైన పనులు!

            మన రేపటి వేకువ కాల శ్రమదానం కోసం కలుసుకోదగిన చోటు కూడ కోమలానగర్ ప్రధాన వీధే!

     

            సమర్పిస్తున్నాం ప్రణామం 126

వంచనలదే ప్రథమ స్థానం - మంచి నస్సలు నమ్మజాలం

స్వార్థ రహిత గ్రామ సేవల సంగతా? అది మేము నమ్మం......

ఇలా భీష్మించిన సమాజాన్నెలాగైనా మార్చగలమని

కదం త్రొక్కే స్వచ్చ - సుందర కార్యకర్తకు మా ప్రణామం!

 

- నల్లూరి రామారావు,

   ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు,

   స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త   

   26.05.2022.