2446* వ రోజు....           27-May-2022

 ఒక్కసారికే పనికి వచ్చే పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి!

కోమలా నగర్ లోనే మరొక నాటి స్వచ్చ పరిశ్రమ - @2446*

            27-5-22 - శుక్రవారం కూడ ఉషోదయాత్పూర్వమే – 4. 19 సమయానికే నిర్ణీత స్థలంలో కార్యకర్తల సంసిద్ధత! ఇక అక్కణ్ణుండి 100 నిముషాల పాటు - 31 మంది శ్రమ వితరణ! మరొక రెండు అడ్డ రోడ్ల, పాక్షికంగా రెండు ఖాళీ స్థలాల శుభ్ర సుందరీకరణ! తక్కిన వార్డులను మించి, ఆరేడుగురు స్థానిక కార్యకర్తల శ్రమదాన మన్నన!

            నాకెందుకో - మనం బ్రతుకుతున్నది రెండు విభిన్న వాతావరణాల్లో అనిపిస్తున్నది. ఒకటేమో విశ్వవాప్తంగా పెచ్చరిల్లుతున్న అక్రమాల - విచక్షణా రాహిత్యాల స్వార్థ వైపరీత్యాల - దోపిడీల నిరంకుశ పోకడల ఉక్కవాతావరణమైతే, ఇంకొకటి దేశవ్యాప్త - రాష్ట్ర వ్యాప్త - బాధ్యతా హీనతల దౌర్జన్యాల - మానభంగాల - పర్యావరణ హత్యల భీభత్స వాతావరణం!

            ఈ రెంటికి భిన్నంగా, కనీసం ఒక్క చల్లపల్లి గ్రామంలో పరిమిత స్థాయిలో - ఒక గ్రామ సామాజిక హిత నిర్విరామ

నిస్వార్ధ - నిష్కళంక - సుదీర్ఘకాల శ్రమదాన సంఘటన!

            నేటి కాలానికి ఆవశ్యకమైనదీ, నా దృష్టిలో ప్రత్యామ్నాయమే కనిపించనిదీ  ఈ సామాజిక - సామూహిక శ్రమదానానికి ఇప్పటికీ ఈ గ్రామంలో రావలసినంత మద్దతు, ఉండదగినంత భాగస్వామ్యమూ ఎందుకుండవో అర్థం కాదు!

            ఊళ్లోని 18 - 20 వార్డుల్లోనూ ప్రతి రోజూ - ఏదో ఒక రూపంలో జరుగదగిన వీధి మెరుగుదల చర్యల శ్రమదానం ఊరంతటికి ఒకే చోట జరిగితే ఎలా? పరిపాలకుల నుండైనా ఇంత పరిమిత స్థాయిలో సానుకూల సహకారాలు అందితే ఇంకెంత కాలానికి ఈ చల్లపల్లి ఒక సమగ్ర - ఆనంద - ఆరోగ్య - ఆదర్శ స్వచ్చ శుభ్ర - సుందర - చల్లపల్లిగా మారేను?

వెనకటికి - ఒక వామపక్ష భావజాల సినిమా పాట..

ఎవడిదిరా ఈ భూమి అసలెవ్వడురా ఆసామి

దున్నేవాడిదె భూమి - కష్టించేవాడే భూస్వామి....అని సాగుతుంది!

అలాగే ఎప్పటికైనా

ఎవరిదిరా ఈ ఊరు శ్రమదాతలదే మన ఊరు

స్వచ్చ శుభ్రతలు పరిరక్షించే - జన సంక్షేమం ఆలోచించే

ప్రతి ఒక బాధ్యునిదీ ఊరు....

అనే రోజు రావాలనీ ఆ - మంచి కాలం రాకడను త్వరితం చేస్తూ 2446* దినాలుగా శ్రమిస్తున్న స్వచ్చ సైనిక

సహోదరులందరికే అభివందనాలు! స్వచ్చ సైనికుల శ్రమదాన దినచర్యంటే - అది నాజూకుగానో - బట్టలు నలగకుండానో జరగదు. ఈ దినం నేను పరిశీలించినంతలో చెమటతో ఒళ్ళు తడవని కార్యకర్త కనిపించలేదు.

            ఇంత శ్రమపడి, తమ శరీర కష్టంతో సంతృప్తి పడి, 7.00 కు ఇంటికెళ్ళి, మళ్ళీ వీళ్లలో కొందరు గంగులవారి పాలెం రోడ్డు గస్తీ గది దగ్గర 11.30 దాటే దాక చక్కని చిక్కని - కమ్మని మజ్జిగను వందలాది బాటసారులకు ఉచితంగా పంచే బాధ్యత నిర్వహిస్తారు!

            6.30 ప్రాంతంలో గ్రామ స్వచ్చ శుభ్ర సౌందర్య వికాస సంకల్పాన్ని ముమ్మారు నినదించిన వారు - ఘంటశాల పాఠశాలలోపాధ్యాయుడు తిరుమలరావు గారు! కార్యకర్తలకు తినుబండారాల పొట్లాలు పంచినది గోపాలకృష్ణ వస్త్ర దుకాణదారులైన గోళ్ళ వంశీయులు!

            రేపటి వేకువ మన శ్రమదాన గమ్యస్థానం కూడ కోమలానగర్ ప్రధాన వీధే !

            సమర్పిస్తున్నాం ప్రణామం – 126

ఋజు ప్రవర్తన లెక్కడున్నవి ? కపటమే గద రాజ్యమేలుట!

మాట గొప్పలె - చేతలెక్కడ? స్వార్థమే శివ తాండవంగద!

చల్లపల్లిని ఒయాసిస్ వలె స్వచ్ఛ - సంస్కృతి ప్రోది చేసిన

స్వచ్ఛ సుందర కార్యకర్తకు వినయ వినమిత సత్ప్రణామం!

 

- నల్లూరి రామారావు,

   విశ్రాంత ఉపాధ్యాయుడు,

   స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త

   27.05.2022.