1909* వ రోజు....           02-Feb-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1909* వ నాటి బాధ్యతల వైవిధ్యం. 

         42 మంది ఆసక్తిగా పాల్గొన్న ఈ ఆదివారం వేకువ 4.00 - 6.28 నిముషాల మధ్య సమయంలో శ్రమదాన వేదికలు గంగులవారిపాలెం మార్గం, ప్రభుత్వ రవాణా సంస్థ ప్రాంగణం.

          జనవరి మాసంలో విడతలుగా రెండు వారాలపాటు ఇదే దారిలో నిర్వహించిన శుభ్ర – సుందరీకరణానికి తుది మెరుగులు ఈరోజు పూర్తి ఐనట్లే. వీరిలో....

          - ఇద్దరు మెరికలు బండ్రేవు కోడు మురుగుకాల్వ ఉత్తరం వైపు గతంలో పెట్టి, నష్టమైన పూల మొక్కల స్థానంలో 33 మొక్కలకు పాదులు తీసి నాటారు.

 

          - నలుగురైదుగురు గ్రామ రక్షక బాధ్యులు సాగర్ టాకీస్ బైపాస్ దారిలోని నిన్న – మొన్నటి పెద్ద చెట్ల వ్యర్ధాలను ట్రాక్టర్ తో తెచ్చి, బండ్రేవు కోడు కాల్వ గట్టులు కోసుకుపోకుండ సర్ధి, కొంత మట్టి కప్పారు. తాము పెట్టిన మొక్కలకు, రోడ్డుకు కూడ ఇది రక్షణ!

 

          - ఈరోజు 25 మందికి పైగా కార్యకర్తలకు పని కల్పించింది మాత్రం సన్ ఫ్లవర్ కాలనీ సిమెంట్ దారి, దాని పరిసరాలే! ఎప్పుడో నాల్గు నెలల క్రిందట తాము శుభ్రపరచిన ఈ దారి రెండు ప్రక్కల పెరిగిన పిచ్చి, ముళ్ళ కంపలు, తీగలు, పొదలు, తాడి మొక్కలు దారిని చాల వరకు క్రమ్మేసి, అసహ్యంగా ఉండడం భరించలేక అన్నిటినీ తొలగించి, వ్యర్ధాలన్నిటినీ ట్రాక్టర్ లో నింపి, మురుగు కాల్వ గట్టుకు చేర్చి, సర్దారు. తెల్లారి 6.30 తర్వాత సన్ ఫ్లవర్ దారి ఇంత స్వచ్చ – శుభ్రంగా ఉందంటే ఇందరి కార్యకర్తల శ్రమ ఫలితమే!

 

          - సుందరీకరణ సభ్యుల సృజనాత్మకత బస్ ప్రాంగణం లో కొనసాగుతున్నది. నిన్న రంగులు పూయడం ముగిసిన పాత మరుగు దొడ్ల గోడ మీద వారి చిత్ర లేఖనం సగం వరకు వచ్చినట్లున్నది. పనిలోలీనమైపోయిన ఈ బృందం - 7.00 దాక జరిగిన సమీక్షా సమావేశానికి రానేలేదు!

 

          వట్టి మాటలు కాక, చల్లపల్లి స్వచ్చోద్యమానికి ఆది నుండీ ఆర్ధికం గానే కాక సకల విధాలా సహకరిస్తున్న వివేకానంద – విజయ కళాశాలల యజమాని యార్లగడ్డ శివప్రసాదు, ప్రిన్సిపల్ కోటేశ్వరరావు గార్లు నేటి, స్వచ్చంద శ్రమదానాన్ని తిలకించి, పాల్గొని, అభినందించి, ప్రసాదు గారు మనకోసం మనం ట్రస్టుకు 25,000/- చెక్కు రూపంలో సమర్పించారు. ఎంత అభినందించినా తక్కువే!

 

          నేటి సమీక్షా సమావేశం కాలంలో కొన్ని విశేషాలు :

 

 - ముందస్తు వైద్య పరీక్షల పట్ల డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాదు గారి హితవు.

 - 6.2.2020 (గురువారం) నాడు ఉదయం 11.00 గంటలకు పాగోలులో యార్లగడ్డ ప్రసాదు గారి గృహ ప్రవేశానికి ఆత్మీయ ఆహ్వానం.

- ఈ సాయంత్రం 5.00 గంటలకు శాస్త్రి గారి మనుమని – మనుమరాలి స్వీకరణ ఉత్సవానికి ప్రయాణం.

 

          మన స్వచ్చోద్యమ ఆనవాయితీ ప్రకారం రేపు ఉదయం 4.00 కు ప్రధాన రహదారి శుభ్రతా కృషికై మూడు దారుల కూడలిలో కలుసుకొందాం!

 

          ఈ సమరం అనివార్యం

ఇన్నేళ్లుగ కాలుష్యం అనకొండలు నిర్మించాం

పర్యావరణ విధ్వంసక రాకాసిని కని - పెంచాం

ఇక తప్పదు రాకాసుల వ్యతిరేక మహా సమరం

భూ మండల పరిరక్షణ పూనిక ఇపుడని వార్యం!

 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

ఆదివారం – 02/02/2020

చల్లపల్లి.