2447* వ రోజు.......           28-May-2022

 ఒక్కసారికే పనికి వచ్చే పర్యావరణాన్ని ధ్వంసించే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి!

స్వచ్చ – సుందరోద్యమ చల్లపల్లి – 2447*

28.5.22 - శనివారం వేకువ శ్రమదానం కోమలానగర్ లోనే! శ్రమ సమర్పకులు 29 మందే! వీరిలో స్థానిక క్రొత్త కార్యకర్తలు ఐదుగురు, కొంగ్రొత్త కార్యకర్త ఒక్కరు! మొత్తం మీద 4.19 నుండి 6.08 నడుమ అందరు వెచ్చించిన విలువైన సమయం 50 కి పైగా పని గంటలు! శుభ్రపడినది రెండు అడ్డ రోడ్లు.

          అసలు ఈ కోమలా నగర్ లో ఇన్ని ఖాళీ స్థలాలు, కొన్నిట్లో పెరుగుతున్న పిచ్చి చెట్లూ, ముళ్ళ మొక్కలూ, అన్నిట్లోనూ స్వచ్చ కార్యకర్తలకు వికారంగా కనిపించే కాగితం పొట్లాలూ, ప్లాస్టిక్ తుక్కులూ కనుక లేకపోతేనా – ఈ వార్డులోని వీధుల్ని శుభ్ర – సుందరీకరించడం ఆ శ్రమదాతలకెంతో పని కానే కాదు.

          గోడ మీదుగా ఖాళీ స్థలంలో ఇంటి వ్యర్ధాలను విసరడం గృహస్థ – గృహిణీ నైజం కాబోలు! అదొక అసంకల్పిత అలవోక దుర్వ్యసనమేమో! రోజూ పంచాయితీ చెత్త బండి తిరుగుతుంటే – ఇన్ని చెత్తలు ఖాళీ జాగాల్లో దొరకడానికర్ధమేమిటి?

          నేటి స్వచ్చ కార్యకర్తల పని కొంత మందగించడానికి మరొక కారణం – ఈ ఖాళీ జగాల్లోని రోడ్ల ప్రక్కన అడ్డొచ్చే చెట్ల కొమ్మల్నో – అసహ్యంగా కనిపించే చెత్తా – చెదారాన్నో తొలగించి, ఏరి ఊరుకోక, సదరు జాగాల పూర్తి శుభ్ర – సుందరీకరణ కోసం ప్రలోభపడడమే! ముఖ్యంగా కొద్ది మందైతే – తమ కళ్లెదుటి చిందర వందర పిచ్చి – ముల్నిమొక్కల్నీ చూస్తూ చూస్తూ వదిలేయలేని బలహీనతే!

          ఒక ప్రక్కన ఎనిమిదేళ్లుగా తమ ఊళ్ళో నిరంతరాయంగా జరిగే స్వచ్చోద్యమాన్ని పూర్తిగా అవగతం చేసుకోని - అనుసరించని కొందరి బలహీహనత! దీనికి దీటుగా కాలుష్యాల మీద తమ కసిని ఆపుకోలేని శ్రమదాతల బలహీనత! మరి దేన్ని సమర్ధించాలి? ఏది క్షమార్హం?

          నేటి పని ముగింపు వేళ 6.10 తరువాత అక్కడి వారెందరు ఈ కారకర్తల శ్రమతో ముచ్చటగా మారిన రెండు వీధుల్ని పరీక్షగా చూసి, సంతృప్తి చెందారో తెలియదు – ఏ ఒక్కరైనా రేపటి కార్యకర్తల ప్రయత్నంలో కలిసి వస్తారేమో చూడాలి!

          6.20 కి కాఫీల - కబుర్ల సమయం దాటాక - దైనందిన శ్రమదాన సమీక్షా సమావేశం గోళ్ల సాంబశివరావు గారి ఇంటి వేడుకలో కలిసిపోయింది! ఆ ఇంటి చిన్నారి - ఇంటర్ పరీక్షలిచ్చిన విద్యార్థిని - వెన్నెల పుట్టిన రోజు స్వచ్చ కార్యకర్తల సమక్షంలో, వాళ్ల నిండు మనసుల ఆశీర్వచనాలతో, నందేటి శ్రీనువాసుని పాటతో ఉత్సాహంగా జరిగింది. మనకోసం మనం” ట్రస్టు ఖర్చుల నిమిత్తం వెన్నెల ఇచ్చిన 500/- విరాళం కృతజ్ఞతలతో స్వీకృతమయింది.

          ఈ వేళ కూడ స్వచ్చ కార్యకర్తలు 8.00 12.00 నడుమ మజ్జిగ పంపకం కోసం గస్తీ గది దగ్గరకు చేరాల్సి ఉంది.

          మన రేపటి వేకువ (ఆదివారం) శ్రమదానం సైతం - కోమలానగర్‌లోనే - రావూరి సూర్యప్రకాశరావు గారి ఇంటి ప్రక్కనే జరగవలసి ఉంది!

 

          సమర్పిస్తున్నాం ప్రణామం – 27

గాలి మాటలు కావు - రోజూ గ్రామ శుభ్రతకై శ్రమించుట

బేల చర్చలు కావు - ఇంత సుదీర్ఘ కాలం ఉద్యమించుట –

ఊరిలో ప్రత్యంగుళమునూ స్వచ్చ పరచుట - దిద్ది తీర్చుట

ఆ మహాశయులందరికి మేమందజేస్తున్నాం ప్రణామం!

 

- నల్లూరి రామారావు,

   విశ్రాంత ఉపాధ్యాయుడు,

   స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త

   28.05.2022.