2448* వ రోజు.......           29-May-2022

 ఒక్కసారికే పనికి వచ్చే పర్యావరణాన్ని ధ్వంసించే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి!

2448* వ నాటి 31 మంది గ్రామ మెరుగుదల ప్రయత్నం! 

         ఆదివారం -29.05.2022 వ తేదీ లో సైతం అదే కోమలా నగర్! శ్రమదాన కేంద్రీకరణ కూడ అదే ప్రధాన వీధిలో!  అడ్డ రోడ్డు మాత్రం మారింది! సూర్య ప్రకాశ రావు మాస్టారి ఇల్లున్న అడ్డ   వీధిలో-ముఖ్యంగా అక్కడి పల్లపు ఖాళీ స్థలంలోనే 20 మంది శ్రమించారు! స్థలం చిన్నదే గాని, కొబ్బరి బోండాల్తో – ప్లాస్టిక్ వ్యర్థాల్తో- అడ్డ దిడ్డంగా పెరిగిన పిచ్చి మొక్కల్తో అదేమీ తక్కువ తినలేదు!

 

          సదరు ఖాళీ జాగాలో గాని, దాని దక్షిణపు రోడ్డు మీదగాని ఎంతగా కార్యకర్తలు శ్రమించారో, ఎన్ని కశ్మలాలను ఊడ్చి, ఏరి, మెరుగు పరచారో, గంటన్నరకు పైగా అక్కడి కాయ కష్టమెంతో వాట్సాప్ మాధ్యమంలో గమనించారా?

 

          వాళ్ల దైహిక కష్టానికొక నిదర్శనం ట్రక్కు పట్టనన్ని వ్యర్థాలు!  పదే పదే వాళ్ళు త్రాగిన నీళ్లు! తుడుచు కొన్న చెమటలు! ముగ్గురు- నలుగురి పైకెత్తనే ఎత్తని నడుములు ! నలిగిన- దుమ్మంటు కొన్న బట్టలు! బహుశా ఈ శరీర కష్టాన్ని మరిపించేందుకు గాబోలు- మధ్యలో ఒకరిద్దరి జోకులు!

 

          మన శంకర శాస్త్రీయమైన వాట్సాప్ చిత్రాలు కార్యకర్తల పనిని చూపగలవే గాని- వాళ్ల మనోభావాల్ని కాదు; తామనుకొన్న స్వల్ప కాల లక్ష్యాల్ని సాధించినప్పటి మనః తృప్తినీ కాదు;  అందుకే – ఈ 100 నిముషాల శ్రమ జీవన సౌందర్యం అనుభవైక వేద్యం! ఊళ్లో మిగిలిన ప్రజలకీ, రాష్ట్ర వ్యాప్త- దేశ వ్యాప్త ఆలోచనా పరులకు ఆరాధ్యం- అవశ్యాచరణీయం!

          ఇంకో కోణం నుండి చూసే వాళ్ల దృష్టిలో మాత్రం ఈ శ్రమదాన ఘట్టం ఓ పెద్ద వ్యసనం – అదీ ఎనిమిదేళ్ల- 100/150 మంది సుదీర్ఘ కాల నిరర్థక వ్యసనం!

 

          ఐతే- సత్యం అనేదొకటుంటుంది. ఎనిమిదేళ్లకు ముందు పూతిగంధ దుర్భరమైన – అనాహ్లాదకరమైన- మురుగు కంపుల్తో అనారోగ్య హేతువైన చల్లపల్లి గ్రామం ప్రస్తుతం అధికారులకు, ఇతర గ్రామాల – జిల్లాల – రాష్ట్రాల విచక్షణా పరులకు , పర్యాటక ప్రదేశంగానూ, సినిమా షూటింగుల కర్హంగాను ఎలా మారిపోయింది? కార్యకర్తల కఠోర దీక్షతో కాదూ? వెలకట్టలేని వాళ్ల శ్రమ - సమయ త్యాగాలతో కాదూ?

 

          ఈ ఆదివారం వేకువ కాలంలో తక్కిన వార్డుల కాదర్శప్రాయంగా నలుగురైదుగురు స్థానికులు  స్వచ్చ కార్యకర్తలతో కలిసి శ్రమించినందుకు అభివందనీయులు!

 

          బొమ్మిశెట్టి ఆత్మ పరబ్రహ్మ ప్రవచిత గ్రామ స్వచ్చ-శుభ్ర-సౌందర్య సాధనా కాంక్షా నినాదాలతోను, DRK గారి నేటి 50 కి పైగా పని గంటల శ్రమ సమీక్షతోను 6.30 కి నేటి కార్యక్రమం ముగిసింది. వీరిలో ఏడెనిమిది మందికి మాత్రం గంగులవారిపాలెం వీధిలో 8-12 గంటల నడుమ మజ్జిగ పంపకం బాధ్యత మిగిలే ఉంది!

 

          మైకు కాస్త అస్వస్తతకు గురి కావడంతో నందేటి శ్రీనివాస గాయకుడి స్వరం బుధవారం నాడు వినిపిస్తుంది!

 

          1.06.22 బుధవారం వేకువ సైతం మనం కలిసి శ్రమించదగిన చోటు కోమలా నగర్ లోని సూర్య ప్రకాశ రావు గారి వీధే!  

 

          సమర్పిస్తున్నాం ప్రణామం – 28

 

ప్రపంచీ కరణ మూలంగా గ్రామ స్వస్తత భ్రష్టు పడితే-

మనం – మనద ను మాట పోయీ ధనం సంస్కృతి తాండవిస్తే-

ఒక్క ఊరును ఉదాహరణగ- స్వచ్చ సంస్కృతి పరిఢ విల్లగ

సాహసించిన- శ్రమించిన- మీ సచ్చరిత్రకు నా ప్రణామం!

 

- నల్లూరి రామారావు,

   విశ్రాంత ఉపాధ్యాయుడు,

   స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త

   29.05.2022.