2450* వ రోజు....           31-May-2022

 ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి!

ఒక ప్రత్యేక సంఖ్యగా చెప్పుకోదగిన 2450* వ రోజున రెస్క్యూ టీం ప్రత్యేక కృషి!

            ఈ మంగళవారం (31.05.2022) వేకువ 4.30 నుండి చల్లపల్లిలోని గ్రామ రక్షక దళ సభ్యులది కూడా ఒక వింతైన కొత్తరకం వీధి బాధ్యతే!

            ఇందులో కూడి వచ్చిన వారు నలుగురు కాక మరొక స్వచ్చ వైద్యుల వారు. ఆ ప్రత్యేక వినూత్న కృషి ఏమంటే :

            మురుగు వీరులుగా, రోడ్ల మరమత్తు కార్మికులుగా, రాత్రి వేళ శ్మశాన సంచారులుగా, ఒకటేమిటిలే ఏ అవతారమెత్తాల్సి వచ్చినా దానికి సంసిద్ధులుగా ఉండే రెస్క్యూ టీం వారు ఈ రోజు వీధి అవసరార్ధంగా వడ్రంగుల అవతారమెత్తారు.

            వాళ్ళు ఈరోజు తమ బాధ్యతలు నెరవేర్చిన వీధే ఒక ప్రత్యేకమైనది గంగులవారిపాలెం బాట గతంలో 9 ఏళ్ల నాడు ఒక భూలోక భయంకర నరక ప్రాయమే కావచ్చు గాని ఇప్పుడు ఆ స్థితి లేనూ లేదు, ఆ నికృష్ట -  దరిద్ర పరమ ఛండాలపు గందరగోళం స్థానంలో పచ్చదనాలు మొలిచి పెరిగి, పూల తోటలు పరిమళించి, ఎడారిలో పూల తోటలు విరిసినట్లు మరీ ముఖ్యంగా గత రెండేళ్ల నుండి ఈ వీధి అరకిలోమీటరు పై దాక నిత్య తోరణం పచ్చ కళ్యాణం!

            చల్లపల్లి కే కాదు - జిల్లా అంతటికీ ఇప్పుడు ఇదొక యాత్రా స్థలమైపోయింది. శుభకార్యాల వారు, సరదా సంతోషాల వారు, ఎక్కడెక్కడి నుండో నిత్యమూ వచ్చి ఇక్కడ ఫొటోలు దిగడమో - జల నాట్య వినోదాలను ఆస్వాదించడమో సినిమా షూటింగులు జరుపుకోవడమో - ఆ ఆకర్షణతో వందలాది జనం ఇక్కడ సందడి చేయడమో జరుగుతూనే ఉన్నది.

            ఇది కాక మరొక వంక గస్తీ గది దగ్గర దాతల సౌజన్యంతో స్వచ్చ కార్యకర్తలు 13 రోజులుగా రోజూ ఏడెనిమిది వందల మంది దప్పికగొన్న బాటసారులకు మజ్జిగ పంపిణీ చేసి ఆనందింపచేస్తున్నారు, ఆనందిస్తున్నారు.    

            ముందే చెప్పినట్లు వడ్రంగి పని వాళ్ళుగా మారిన ఈ గ్రామ రక్షకులు ఎక్కడ నుండో ఎండు చెట్ల కొమ్మల్ని, కాండాల్ని సేకరించి వాటిని తగిన పరిణామంలో ముక్కలుగా కోసి వీధి సందర్శకులు కూర్చొనదగిన పీటలుగా రూపొందించారు. మళ్ళీ అందులోనూ సాధ్యమైనంత కళాపోషణ కూడా!             

            రేపటి మన గ్రామ బాధ్యతల నిమిత్తం నిత్య కర్మిష్టులైన స్వచ్చ కార్యకర్తలే గాక, ఆసక్తి ఉన్న ఇతరులు కూడా కలిసి శ్రమించి, ఆదర్శం పాటించవలసిన చోటు కోమలానగర్ లోని రావూరి సూర్యప్రకాశరావు గారి ఇంటి వద్దనే.      

 

స్వచ్ఛ సుందర కార్యకర్త

          స్వార్ధము మానెనూ...... హోయ్!

          త్యాగము నేర్చెనూ.... హోయ్!

          చెమటలు చిందుతూ... సేవకుడాయెనూ.....!

ఐనా... ఊరు మారుతున్నా - కొందరు జనం మారలేదూ

(మన) వాలంటీరు మారలేదూ....అతని దీక్ష తగ్గ లేదూ

 

          ఎనిమిదేళ్ల శ్రమదానంతో - ఊరు నందనంగా మారాలని

          వీధులు ఊడ్చెను, డ్రైనులు నడిపెను - శ్మశానాలనూ సంస్కరించెను

          పూల తోటలను నాటి పెంచెను......

 

ఐనా... ఊరు మారెగానీ - కొందరు జనం మారలేదూ

(మన) వాలంటీరు మారలేదూ...ఆతని పట్టు సడల లేదూ

 

          ప్లాస్టిక్ ప్రమాదమాపుటకై - రహదారి వనాలను పెంచుటకై

          కాలికి బలపం కట్టుకు తిరిగెను - ప్రతి యొక్కరినీ అభ్యర్ధించెను

          శ్రమదానానికి ఆహ్వానించెను.....

 

ఐనా... ఊరు బాగుపడినా - కొందరి మనసు కరగలేదూ

వాలంటీర్లు మారలేదూ వారల ఉడుంపట్టు పోదూ

         

          చల్లపల్లి స్వచ్చోద్యమ చరితను - ప్రపంచమంతా గుర్తిస్తున్నా

          ప్రయోజనకరమని అనుసరించినా - కళ్లముందు కనిపించు నిజమ్మును

          ఊరుమెచ్చినా వచ్చి పాల్గొనదు

 

అయ్యో! ఊరు మారుతోందీ... కొందరి మనసు కరగకుందీ

వాలంటీర్లు మారలేదూ- వాళ్లకు విసుగు పుట్టలేదూ

 

స్వార్థమూ మానెనూ - త్యాగమూ నేర్చెనూ

చెమట చిందించెనూ- ఊరికి సేవకూడాయెనూ

ఐనా.. ఊరు మారు తోందీ-  కొందరి మనసె కరగకుందీ

వాలంటీర్లు మారలేదూ- పట్టిన పట్టు వీడలేదు.... !

 

- నల్లూరి రామారావు,

  ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త

  31.05.2022.