2451* వ రోజు.......           01-Jun-2022

 ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి!

బుధవారం (01.06.202) నాటి స్వచ్చోద్యమ యధేచ్చా విహారం @2451*

        యధాపూర్వంగానే - వేకువ 4.18 కే - ముందే నిర్ణయించుకొన్న కోమలానగర్ చివరి వీధి కశ్మలాల మీద పాతిక మంది ఊరి స్వచ్చ - శుభ్ర - సౌందర్య విధాతలు సాగించిన యుద్ధం! ఈ క్రొత్త తరహా సమరంలో క్షతగాత్రులెవరూ లేరు గాని, ఒకే ఒక మృతవీరుడు శనిలా ఊరికి పట్టిన కాలుష్యమే!

        పురాణ - ఇతిహాసాల్లో మనం ఎన్నెన్నో యుద్ధాలు చదివి తెలుసుకొన్నాం. ట్రాయ్ యుద్ధాలు, రోమన్ వీరుడు జూలియస్ సీజరూ, గ్రీకు యువకుడు అలెగ్జాండరూ, ఫ్రెంచ్ జనరల్ నెపోలియనూ, సముద్రగుప్తుడూ, శ్రీ కృష్ణదేవరాయలూ, వంటి ఓటములెరిగిన - ఎరగని మహావీరుల వందల యుద్ధల్లో లక్షలాది మృతగాత్రులూ, క్షత గాత్రులూ ఎవరు? చచ్చింది సాధారణ సైనికులూ, చల్లారింది సాదాసీదా సంసారాలూ, తెగింది వేలకొద్ది గృహిణుల పుస్తెలూ!

        ఒకటో - రెండో – మూడో (రష్యా – ఉక్రెయిన్) ప్రపంచ యుద్ధాల ముచ్చట్లు అంతే! నా దృష్టిలో - ఈ సమకాలంలో - చల్లపల్లి స్వచ్చ శ్రమదానోద్యమే పై అన్ని యుద్ధాలకూ భిన్నమూ, ప్రత్యేకమూ, సార్థకమూ, సమర్థనీయమూ!

        ఈ 2451* వ నాటి స్వచ్చ కార్యకర్తల్లో ముగ్గురో - నలుగురో చిన్నారి సైనికులు కూడ ఉన్నారు. ఒక్కమారు నేటి పని ప్రారంభ సమయపు ఛాయాచిత్ర దృశ్యాన్ని చూడండి! రోడ్ల ప్రక్క ఎంతెంత భారీ కాలుష్యాలు, ముళ్ళ – పిచ్చికంపలు కనిపిస్తున్నాయో పరిశీలించండి – 100 నిముషాల కాలంలో ఈ పరిమిత సంఖ్యాక కార్యకర్తల కత్తులకు, గొర్రులకు, గోకుడు పారలకు, చీపుళ్ళకు బలైపోయి, గుట్టలుగా తేలి, ట్రాక్టర్ లో కెక్కిన వ్యర్ధాలను తలుచుకొండి!

        అవకాశమున్న మన వాట్సప్ మాధ్యమ పాఠకులు కొందరైనా రేపటి కోమలా నగర్ వీధి పారిశుద్ధ్య కృషిలో తప్పక చేయి కలపండి! మన గ్రామ సంక్షేమార్ధం స్వచ్చ సైనికుల సుదీర్ఘ కాల ప్రయత్నాన్ని ఇంకా – ఇంకా ఉపేక్షించకండి! ఎనిమిదేళ్లుగా - 3 ½ లక్షల పని గంటల ఈ కార్యకర్తల కృషే లేకుంటే చల్లపల్లి దేశంలోని లక్షలాది గ్రామాల్లాగే మిగిలిపోయే వని కూడా గుర్తుంచుకొందాం!

        6.15 తర్వాత – అనగా కాఫీ పానీయ వినియోగానంతరం గ్రామ స్వచ్చ – శుభ్ర - సౌందర్య సాధనా కాంక్షను నినాదాలుగా చాటిన వారు – నేడు ఆసాంతమూ శ్రమించిన బాల కార్మికులు ఆర్య – ఆరవ్ లే! కార్యకర్తల శ్రమ సమీక్షానందం మాత్రం దాసరి రామకృష్ణ వైద్యుల వారిదే!

        కోమలా నగర్ పారిశుద్ధ్య ప్రయత్నం తరువాత- 8.15 కు గంగులవారిపాలెం వీధి గస్తీ గది దగ్గర 14 వ రోజు మజ్జిగ పంపకం బాధ్యత కూడా కొందరు కార్యకర్తలు తరగని ఉత్సాహంతో నిర్వహిస్తున్నారు.

        గురువారం నాటి స్వచ్చ - సుందరీకరణ ప్రయత్నం కూడ కోమలా నగర్ లోనే!

 

        సమర్పిస్తున్నాం ప్రణామం  30

మన వీధిని – మన ఊరిని మనం సంస్కరించు కొరకు

మురుగుల దుర్గంధం నిర్మూలించే మంచి పనికి,

ఎవరెవరో నన్ను – నిన్ను బొట్టు పెట్టి పిలవాలా?”

అని బాధ్యత వహిస్తున్న అందరికీ ప్రణామం!

 

- నల్లూరి రామారావు,

  ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త

  01.06.2022.