2452* వ రోజు....           02-Jun-2022

 

 ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి!

ఇది స్వచ్ఛ కార్యకర్తల 2452*వ నాటి గ్రామ బాధ్యత

            గురువారం 2.6.22 వ నాటి వేకువ సైతం 4.20 కే వారి కర్తవ్య నిర్వహణ కోమలా నగర్ చివరి వీధిలోనే! 6.10 దాక - అంటే 110 నిముషాల పాటు అక్కడొక క్రొత్తరకం సందడి! మైకు నుండి వినబడే పాటలొక ప్రక్క, కార్యకర్తల పనిలో వాడే పార కత్తి - గొర్రు లాంటి పనిముట్ల చప్పుళ్ళో వంక, అప్పుడప్పుడు ఒకరిద్దరి హెచ్చరికలో - సూచనలో - ఛలోక్తులో వినిపించే సందడన్న మాట!

            ఈ చిన్న వీధి మొత్తం శుభ్ర పడేదే గాని, రెండు ఖాళీ జాగాలు అడ్డుపడి పూర్తికాలేదు. ప్రధానంగా కార్యకర్తల ఆశయమేమంటే రోడ్లు శుభ్రంగా ఉండాలి, మార్జిన్లలో కాగితాలు, ప్లాస్టిక్ వస్తువులు వంటివి కనపడరాదు, వీధికి రెండు ప్రక్కలా పచ్చదనం పరుచుకోవాలి....

            ఐతే క్షేత్ర స్థాయిలో వస్తున్న చిక్కేమంటే ఖాళీ జాగాల్లో పిచ్చి - ముళ్ళ మొక్కలు పెరిగి చిట్టడవుల్లా మారడం, పాదచారులో, ప్రక్కిళ్ళ వారో అలవోకగా ప్లాస్టిక్ సంచులో, సీసాలో, కాగితం పొట్లాలో విసరడం...

             స్వచ్ఛ  కార్యకర్తల ప్రథమ శత్రువు ప్లాస్టిక్ తుక్కే గాని, చెట్ల మధ్య ఇరుక్కొన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ల కోసమైనా ఖాళీ జాగాల మొక్కల్ని నరకక తప్పడం లేదు అందుకే ప్రతి రోజూ పనిలో జాప్యం!

            ఇప్పుడిక ఈనాటి శ్రమదాన విశేషాల్ని తెలిపే వాట్సప్ మాధ్యమ చిత్రాల్ని గమనించండి ఒక్కోచోట 1012 - 15 మంది కార్యకర్తలు ఒక కైవారంగా ముళ్ళ చెట్లు నరుక్కొంటూ - ముగ్గురు నలుగురు బాల కార్యకర్తలు ప్లాస్టిక్ దరిద్రాలను ఏరి, డిప్పల్తో ట్రాక్టర్ లోకి మోస్తూ - కొందరు ఇతర వ్యర్ధాల్ని ట్రక్కులో నింపుతూ శ్రమించే సన్నివేశాలెంత బాగున్నాయో!

            మనలాంటి వాళ్లకా దృశ్యాలు ఆశ్చర్యకరం గానూ, ఇంత శ్రమపడే కార్యకర్తల పట్ల ఆరాధనకరంగానూ ఉండవచ్చు. ఆ శ్రమ జీవులకు మాత్రం ఇదొక సాధారణ అభ్యాసం! ఈ వ్యసనమెంత బలమైనదంటే - ఒక్కోమారు తమ ఎదుట మిగిలిపోయిన పనిని వదలరు, బ్రతిమాలుతున్నా విరమించరు!

            నేటి శ్రమదాతల్లో పది - పన్నెండేళ్ల బాల కార్యకర్తలు - దుబాయి నుండి, అమెరికా నుండి, విజయవాడ నుండి చుట్టపు చూపుగా వచ్చిన పిల్లలు పాటుపడుతున్న వైనం ఆకట్టుకోదా? కష్టం విలువ, సొంతానికి కాక ఊరి మేలుకై శ్రమించే ప్రత్యేకత, సమూహంలో కలసి పనిచేసే అలవాటు ఈ వయసులో కనుక అలవడితే - ఇక ముందు ముందు వాళ్లెంతగా జనహితులౌతారో ఆలోచించాలి!

            చల్లపల్లి స్వచ్చోద్యమ నిరంతర ఆరాధకులైన ఉదయ శంకర శాస్త్రి గారి నెలవారీ చందా 5,000/- మేనేజింగ్ ట్రస్టీ గారికి అందినది.

            అన్ని రకాల గ్రామ మెరుగుదల కృషి చేసి, కాయకష్టంతో ఉక్కతో- చెమటతో బట్టలు తడిసి, తామీనాటికి  మంచి పని ముగించామనే సంతృప్తి పొంది, 6.20 సమయంలో ఈ 28 మందీ ఆర్య ఆరవ్ ల గ్రామ ప్రయోజనకర నినాదాలకు గట్టిగా ప్రతిస్పందించారు. తామే చిరకాల స్వచ్చోద్యమ కార్యకర్తైన పైడిపాముల కృష్ణకుమారి (గ్రామ సర్పంచ్) గారి స్వగ్రామ - స్వచ్ఛ -  సౌందర్య - భవితవ్యం పట్ల ఆరాటాన్ని, పోరాటాన్ని, ఆవేదనను ఆలకించారు. డాక్టరు గారి సమీక్షను, సూచనలనూ విని, గృహోన్ముఖులయ్యారు. గంగులవారిపాలెం గస్తీగది దగ్గరి మజ్జిగ పంపకం బాధ్యతను కొందరు తీసుకొన్నారు.

            రేపటి మన శ్రమదానం కూడ కోమలానగర్ లోనే ఉంటుంది!

 

            సమర్పిస్తున్నాం ప్రణామం 31

పరిశుభ్రత సన్నిధిగా - విరితోటల పెన్నిధిగా

సుమ సుందర వీధులుగా, పర్యాటక దృశ్యంగా

శ్రమ సంచిత సర్వోత్తమ గ్రామంగా తమ ఊరిని

నిలుపుతున్న శ్రమ జీవన రీతికి నా ప్రణామం!

 

- నల్లూరి రామారావు,

  ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు,

   స్వచ్ఛ  సుందర చల్లపల్లి కార్యకర్త

  02.06.2022.