2453* వ రోజు.......           03-Jun-2022

 ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి!

గ్రామ శుభ్ర స్వచ్ఛ సౌందర్య సంకల్ప దీక్షలో 2453* వ రోజు

            శుక్రవారం (3.6.22) నాటిది 30 మంది బాధ్యతా పరుల ప్రజాప్రయోజక కృషి! అది జరిగింది కోమలా నగర్ లో! కోడూరు వేంకటేశ్వరుని వీధిలో! సమయం వేకువ 4.176.06 నడుమ! మెరుగులు దిద్దుకొని, శుభ్రపడినదేమో రెండు చిన్నపాటి, ఒక పెద్ద ఖాళీ స్థలాలు! ఈ 30 మంది కార్యకర్తల్లో నలుగురు భావి పౌరులు, ఇద్దరో ముగ్గురో స్థానికులు!

            ఎనిమిదేళ్లు 2453* దినాల భల్లూకప్పట్టు తర్వాత కూడ ఈ స్వచ్చంద శ్రమదాతల్ని భవిష్యద్దార్శనికులాంటారో, ఈ 2022 వ సంవత్సర సమకాలంలో గ్రామ సమాజ భవితవ్య వేగుచుక్కలంటారో, చెప్పింది చేసి చూపే వాస్తవికులంటారో, స్వార్ధం  చాలని అమాయకులే అంటారో లేక ;

            బొత్తిగా చప్పగా తీసిపారేసి, చెత్త మనుషులనో అర్ధం పర్ధం లేని, చాత గాని, ప్రచారం మేనియా గాళ్ళనే హేళన చేస్తారో....చేయండి గాని, తటస్తంగా మాత్రం ఉండరాదని మనవి!

            మన వార్డుని, మన వీధిని, మన ముంగిటిని ఎన్నెన్ని మార్లో స్వచ్ఛ కార్యకర్తలు శుభ్రపరుస్తుంటేనూ, మొక్కలు నాటి పెంచుతుంటేనూ, మన ఊరి శ్మశానాల్ని, కాలువ గట్టుల్ని, రహదారుల్నీ, ఖాళీ జాగాల్ని సంస్కరిస్తుంటేనూ, “ప్లాస్టిక్ వస్తువులు వాడొద్దు మహా ప్రభో అవి కొంపలు ముంచుతాయిఅని ఘోషిస్తుంటేనూ, ఆచరణలో పదే పదే చూపిస్తుంటేనూ, ఎన్నాళ్ళైనా స్పందించక ఉలకక పలకక ఉండిపోదామా?

            ఏదేమైనా ఈ నాటి ఈ 30 మందిది గంటన్నర పాటు ఒక ప్రత్యేక లోకమే! మూడు ఖాళీ జాగాల్లోనూ, వీధి బారునా కశ్మలాల మీద కాలు దువ్వుతూ చేసింది బృహత్ప్రయత్నమే!     

            ముఖ్యంగా కోడూరు వారి ఇంటి పడమర స్థలాన్ని వీళ్ళ శ్రమదానానికి ముందూ, తరువాత వాట్సప్ మాధ్యమంలో చూడండి! ఒక కర్షక కార్యకర్త అక్కడి వ్యర్ధాలను పది మంది నుండి అందుకొని, సర్ది, అణగ ద్రొక్కి, ట్రాక్టర్ లో పట్టేట్లుచేసే ప్రయత్నాన్ని గమనించండి! దీనికి సంబంధించిన ఒక దృశ్య శ్రవణ మాధ్యమాన్ని తిలకించండి!

            6.10 దాక ఈ శ్రమ వేడుక! ఆ తదుపరి కాఫీ - కబుర్ల సందడి! 6.20 కి ఒక బాల కార్యకర్త - అతడు హైదరాబాద్ నుండి చుట్టపు చూపు కుర్రాడు ఎలుగెత్తి ముమ్మారు చల్లపల్లి గ్రామ ఉజ్జ్వల భవితవ్య నినాదాల ప్రకటనా,

            ఈ సందర్భంగానే ఒక ఉపాధ్యాయుడు శివకుమార్, మరో యువకుడు మేరుగు రమేష్ గార్లు స్వచ్చోద్యమాభినందనగా DRK గారికి ఆరోగ్య ప్రదమైన ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కను బహూకరణగా ఇవీ నేటికొన్ని విశేషాలు!

            నేనిప్పుడిది రాస్తున్న సమయానికి గస్తీ గది దగ్గర మజ్జిగ పంపకం ముమ్మరంగా సాగుతున్నది!

            రేపటి మన వేకువ శ్రమదాన రంగస్థలం కోమలానగర్ లోనే!

 

    సమర్పిస్తున్నాం ప్రణామం 32

 శతాబ్దాలు - సహస్రాభి దశ తిరగని చల్లపల్లి

అష్ట వర్ష శ్రమదానం కాలంలో పట్టుబట్టి

పరిశుభ్రత జన స్వస్తత పై గట్టిగ దృష్టి పెట్టి

స్వచ్ఛ రమ్య మైనట్టి విశిష్టతకు ప్రణామం!

 

- నల్లూరి రామారావు,

  ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ  సుందర చల్లపల్లి కార్యకర్త

  03.06.2022.