2454* వ రోజు..........           04-Jun-2022

 ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి!

సొంత ఊరి వాళ్ల సౌకర్యం కోసం 2454* వ నాటి శ్రమదానం!

          ఈ స్థిర వారపు బ్రహ్మముహుర్తపు బాధ్యతలు కూడ కోమలానగర్ లో ఆకుల దుర్గా ప్రసాదుని అంగడి వద్దే మొదలయింది. రెండు వారాలుగా పాతిక ముప్పై మంది చొప్పున స్వచ్ఛ కార్యకర్తల ప్రణాళిక, దీక్ష ఫలించి, కోమలానగర్ లోని చిన్న - పెద్ద వీధుల, ఖాళీ స్థలాల కాలుష్య భారం తగ్గి, ఇటు స్వచ్చ సైనికులకు, అటు వార్డులోని కొందరు స్వచ్ఛ – సౌందర్యాభిలాషులకు సంతృప్తి లభించింది!

ఒక వరుస క్రమంలో చెప్పాలంటే:

1) రైస్ మిల్లు వీధిలోనే ముందు పని మొదలయింది. సుందరీకర్తలు ముగ్గురు – నలుగురు ఆ వీధి మొదట్లో దెబ్బతినబోతున్న సిమెంటు రోడ్డు రక్షకులుగా మారి, దాని రెండు అంచుల్ని మట్టి నింపి, పటిష్టపరిచారు.

2) 20 మంది కార్యకర్తలు ఆ వీధిని ఊడ్చి, రెండు ఖాళీ స్థలాలను పాక్షికంగా సుందరీకరించే పనిలో మునిగారు. ఒక సందర్భంలో అక్కడి మైకుసెట్ల సరఫరాదారుడు తాత్కాలిక స్వచ్చ కార్యకర్తగా మారి, కత్తి చేత బూని పనిచేశాడు. నిన్నటి, నేటి స్వచ్ఛంద శ్రమదానాన్ని చూసి, చూసి, ఒకామె తటపటాయించి, చివరికి కొంతసేపైనా కార్యకర్తలతో కలిసి పనిచేసింది! (ఈ నివేదిక రాస్తున్న పెద్ద మనిషి కూడ ఒక దశలో ఆవేశపడి, వంగి, పారతో పనిచేయడం గూడ జరిగిపోయింది!)

3) ఒక ఉత్తర - దక్షిణం రోడ్డూ, తూర్పు పడమరల రోడ్డూ యధాశక్తిగా రకరకాల కాలుష్యాలు నింపుకొని, ఏడెనిమిది మందికి ఉద్యోగం కల్పించాయి! ఐతే – ఏమాటకామాటే చెప్పుకోవాలి – ఈ రెండు వీధుల నివాసితులు మాత్రం మచ్చుకైనా ఒక్కరూ తమ ముంగిళ్ళలోనే – శుభ్రపరుస్తున్నది పెద్దలూ, ఉద్యోగులూ, పొరుగూరి వారూ – ఐనా సరే చలించక స్థిత ప్రజ్ఞత ప్రదర్శించి, వచ్చి కలువలేదు!

          ఆ విధంగా – 2 ½ వీధుల – 28 మంది కార్యకర్తల – 105 నిముషాల – దుమ్మూ – ధూళీ – చెమట ధారల - కార్యకర్తల పరంగానైతే – శ్రమ వినోదాల – నేటి గ్రామ మెరుగుదల కృషి ముగిసింది!

          శ్రీ పండిరాధ్యుల బాలసుబ్రహ్మణ్య గంధర్వుని పుట్టిన రోజుట ఇది! కాంపౌండరు శేషు, ఆ మహా గాయకుని గుర్తుగా బిస్కళ్ళ పంపకాన్ని, మరొక గేయాలాపననీ చేస్తే – మరొక అభిమాని – విశ్రాంత SBI ఆఫీసర్ - పృధ్వీశ్వరరావు మరొక సినీ గీతాలాపనతో అలరించగా –

          స్థానిక ప్రముఖురాలు – మేరుగు ఘాన్సీ గారు అసలు సిసలు తెలుగు వాగ్గేయకారుడైన అన్నమయ్య భక్తి గీతా గానం చేశారు!

          బొమ్మిశెట్టి ఆత్మ పరబ్రహ్మం గారు స్థిర సంకల్పంతో పలికిన గ్రామ స్వచ్చ - శుభ్ర – సౌందర్య సాధనా నినాదాలూ, డాక్టరు గారి ఆనంద పారవశ్య సమీక్షా వచనాలు, సరస సాహిత్య చతురోక్తులూ ముగిసేప్పటికే 6.50 దాటింది!

          వరంగల్లు నుండి తన తాత గారింటికి వచ్చి, ఈ ఉదయం మన సామూహిక శ్రమదానంలో పాల్గొన్న వేద విఠల్ వెంకట సాయి మయాంక్ తనకు తాతగారిచ్చిన 1000/- ధనాన్ని చల్లపల్లి స్వచ్చోద్యమానికి ఇచ్చివేయడం అందర్నీ ఆకర్షించింది!

          రేపటి వేకువ మన శ్రమ విరాళం ఆవశ్యకత బందరు రహదారిలోని వార్డు సచివాలయం (చిన్న కార్ల స్టాండు) దగ్గరే ఉన్నది!

 

    సమర్పిస్తున్నాం ప్రణామం – 33

సుసంఘటిత బలమేదో - సామూహిక శక్తెంతో

పరుల కొరకు శ్రమదానం ఫలితంగా తృప్తెంతో

ఊరి కొరకు ఏళ్ల కేళ్లు ఉద్యమించు విధమేదో –

సదాచరించి చూపుతున్న సాహసికులకు ప్రణామం!

 

- నల్లూరి రామారావు,

  ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ  సుందర చల్లపల్లి కార్యకర్త

  04.06.2022.